ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు తెలంగాణ మద్ధతు ఎంతవరకు?

రాష్ట్ర విభజన జరిగినప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదాను ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. ఇప్పుడు అధికారం లో ఉన్న బిజెపి అయితే ఏకంగా ఐదు కాదు, పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కావాలని పార్లమెంట్లో నినదించింది. వారి ఎన్నికల మానిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చారు. కానీ వీరు కూడా హోదాను ఇవ్వలేదు. 

బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటానికి ఉన్న కారణాలను విశ్లేషిస్తే

1. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత వారికి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వటంలో ఎటువంటి రాజకీయ ప్రయోజనం కనిపించకపోవడం. రాష్ట్రంలో బిజెపి రాజకీయంగా బలంగా లేకపోవటంతో, ఒకవేళ ప్రత్యేక హోదా ఇచ్చినా తెలుగు దేశం పార్టీ తమ ఘనతగా ప్రచారం చేసుకుంటుంది తప్ప బిజెపికి ప్రయోజనం ఉండే అవకాశం లేదు.

2. ప్రత్యేక హోదా విషయంలో బీహార్, బెంగాల్ సహా ఎన్నో రాష్ట్రాల నుండి డిమాండ్లు ఉన్నాయి. ఒక రాష్ట్రానికి ఇస్తే అనవసరంగా హోదా తేనెతుట్టెను కదిలించినట్లవుతుంది. హోదా విషయంలో ఇప్పటివరకు కొన్ని నిబంధనలు పాటిస్తూ వస్తున్నారు. సరిహద్దు లో ఉండటం, పర్వత ప్రాంతాన్ని కలిగి ఉండటం లాంటివి. వీటిని సడలించి ఆంధ్రప్రదేశ్ కు హోదా కల్పిస్తే అన్ని రాష్ట్రాలు అప్పుడు హోదాను  డిమాండ్ చేసే అర్హతను కలిగి ఉంటాయి. 

3. పొరుగు రాష్ట్రాల నుండి వ్యక్తమవుతున్న వ్యతిరేకత. ఒకవేళ ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే తమ రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టులు అక్కడికి వెళ్తాయని భయం. ఈ విషయంలో తమిళనాడు బాహాటంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను వ్యతిరేకించింది. కర్ణాటక ఆంధ్ర ప్రదేశ్ కు ఇస్తే తమకూ కావాలని డిమాండ్ చేసింది. ఛత్తీస్ గఢ్, ఒడిషా తమకు కూడా కావాలని అడుగుతున్నాయి.  అయితే తెలంగాణ మాత్రం హోదాకు మద్దతు తెలిపింది. 

ఈ తెలంగాణ మద్ధతు ఎంతవరకు అని విశ్లేషిస్తే 

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తే తెలంగాణకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అంటే మిగిలిన పొరుగు రాష్ట్రాల తరహాలో నష్టం తప్ప లాభం ఏమీ ఉండదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదు కనుక మాట వరుసకు మద్దతు  ఇచ్చేసారు. నిజంగా ఇచ్చే సమయం వస్తే వారు తమకు కూడా హోదా కావాలనటం గానీ, వ్యతిరేకించటం గానీ చేస్తారు. మీకు గుర్తుండే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నాయకులు ప్రత్యేక తెలంగాణ విషయంలో కూడా ఇలానే చేసారు. చేసుకున్నవారికి చేసుకున్నంత. 

అయితే అసలు ఇచ్చే ఉద్దేశ్యం లేనప్పుడు బిజెపి ఇస్తామని ఎన్నికల మానిఫెస్టోలో ఎందుకు పెట్టాలి. ఎందుకు హామీ ఇవ్వాలి. ఇప్పటి రాజకీయ పార్టీలకు, నాయకులకు అధికారమే పరమావధి. దాన్ని సాధించేందుకు ఎన్ని హామీలైనా ఇస్తారు. ఏమైనా చేస్తామంటారు. ఒకరకంగా హోదా రాకపోవటం కన్నా అందరూ మనల్ని మోసం చేసారు, చేస్తున్నారన్న విషయమే ఎక్కువ బాధ పెడుతుంది. 

ఇప్పుడు హోదా ఎలా సాధించాలి అనేదాని కన్నా, ఇవ్వకపోవటం అనే నేరాన్ని ఎలా ఎదుటివారి పైన తోసేయాలన్న దానిపైనే రాజకీయం నడుస్తోంది. చంద్రబాబు నాయుడు గారు ఈ సారి ప్రత్యేక హోదా సాధ్యంకాదని గ్రహించి ప్యాకేజీకి ఒప్పుకున్నారు. కానీ ప్రజల్లో వ్యతిరేకతను గమనించి మళ్ళీ హోదా రాగం ఎత్తుకుని బిజెపిని దుమ్మెత్తి పోయటం ప్రారంభించారు. ఇక బిజెపి, ముఖ్యమంత్రి గారిని ఊగిసలాట ధోరణిలో పెట్టి   నేరం ఆయన పైకి తోసే ప్రయత్నం చేసింది. ఇక ప్రతిపక్షం విషయానికి వస్తే తాము అధికారంలోకి వస్తే హోదా వస్తుందంటారు. ఎలా వస్తుందో వారికే తెలియదు. కాంగ్రెస్ కూడా అంతే. రాజకీయ పార్టీలన్నీ 'ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి' తరహాలో తమ అవసరాల్ని తీర్చుకుంటాయి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post