పాకిస్తాన్లో ఎన్నికలకు ముందు చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఆ దేశం ఉగ్రవాదులకు మద్ధతునిచ్చే స్వభావాన్ని, దేశ పరిపాలన మరియు రాజకీయాలలో అక్కడి సైన్యం జోక్యాన్ని ప్రపంచానికి బహిర్గతం చేస్తున్నాయి.
ముంబయి బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, లష్కర్-ఏ-తోయిబా అధినేత హఫీజ్ సయీద్ ఎన్నికలలో ఉత్సాహంగా ప్రచారం చేస్తుండగా, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు.
అమెరికా హఫీజ్ సయీద్ తలపై 10 మిలియన్ డాలర్ల పారితోషికం ప్రకటించింది. ఈ ఎన్నికలలో అతను స్వయంగా పోటీ చేయడం లేదు కానీ అతని పార్టీ తరపున 265 మంది అభ్యర్థులను నిలబెట్టాడు. అభ్యర్థులలో అతని కుమారుడు, అల్లుడు కూడా ఉన్నారు. అతని పార్టీ మిల్లి ముస్లిం లీగ్ కు అనుమతి లభించక పోవటంతో ఇప్పటికే అనుమతి పొంది, పెద్దగా పేరులేని అల్లా-హు-అక్బర్ తెహ్రీక్ పార్టీని పోటీకి ఎంచుకున్నాడు.
ఇక నవాజ్ షరీఫ్ విషయానికి వస్తే ప్రధాన మంత్రిగా అతను స్వంత నిర్ణయాలు తీసుకుంటూ సైన్యానికి కంటగింపుగా మారాడు. ఆయన ఆర్ధిక సరళీకరణ, ఇస్లామిక్ తీవ్రవాదం వంటి విషయాలలో సైన్యానికి వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. భారత్ తో సంబంధాల విషయంలో కూడా షరీఫ్ నిర్ణయాలు సైన్యానికి నచ్చలేదు. దీనితో సంవత్సరాల క్రితం నాటి కేసులో సరిగ్గా ఎన్నికల ముందే తీర్పు వచ్చి అతనికి శిక్ష పడింది. ఈ తీర్పు వల్ల దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేత ఎన్నికలలో పాల్గొనకుండా నిషేధానికి గురయ్యారు. కాగా సైన్యం ఇప్పుడు మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీకి మద్ధతు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అమెరికా కూడా పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్య రాజ్య సమితి రూపొందించిన ఉగ్రవాదుల జాబితాలో పాకిస్తాన్ కు చెందిన వారే అత్యధికంగా 139 మంది ఉన్నారు. ఈ ఎన్నికల ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదులను నాయకులుగా మారిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Post a Comment