వరంగల్ కీర్తి నగర్లోని భద్రకాళి ఫైర్ వర్స్క్ గోడౌన్లో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది కార్మికులు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో అందులో 15 మంది ఉద్యోగులు ఉండగా, ముగ్గురు క్రాకర్స్ కొనడానికి వచ్చారు. కాగా అగ్నిప్రమాదం నుండి అయిదుగురిని స్థానికులు రక్షించారు. అగ్ని మాపక సిబ్బంది ఇంకా శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రమాదంలో గోడౌన్ పూర్తిగా ధ్వంసమైంది. నల్లగా కమిలిపోయిన మృతదేహాలతో, విరిగిపడిన అవయవాలతో అక్కడి పరిస్థితి భయానకంగా ఉంది. మృతదేహాలు గుర్తు పట్టడానికి వీల్లేకుండా మారాయి. శిథిలాల క్రింద ఇంకా మృతులు ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరుగున్నప్పుడు భారీ శబ్దాలు వినిపించాయని, గోడౌన్ క్షణాల్లో బూడిద కుప్పలుగా మారిపోయిందని స్థానికులు తెలిపారు.
ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 10 మంది వరకు మరణించి ఉండవచ్చు. అని జిల్లా కలెక్టర్ ఎం. హరిత అన్నారు. నగర పోలీస్ కమిషనర్ వి. రవీందర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 8 మృతదేహాలు వెలికి తీసాం. ఇంకా కొన్ని బయటపడవచ్చు అని అన్నారు.
ఈ గోడౌన్ లైసెన్స్ గుణపల్లి కుమార్ పేరు మీద ఉంది. ఆయన జిల్లాలో అతిపెద్ద ఫైర్ క్రాకర్స్ సరఫరాదారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారని సమాచారం. శాసనసభ్యులు డి. వినయ్ భాస్కర్, ధర్మా రెడ్డి, కొండా సురేఖ మరియు ఆరూరి రమేష్ అక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ సంఘటన పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి వెంటనే వెళ్లి సహాయచర్యలు చేపట్టాలని, విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆయన సూచించారు.
సీఎం కేసీఆర్ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో వైద్య సేవలు అందిస్తామని సీఎం తెలిపారు.
Post a Comment