నరేంద్ర మోడి నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వ్యూహంలో భాగంగా పంటలకు కనీస మద్దతు ధరను (MSP) ఒక్కసారిగా పెంచింది. అయితే క్షేత్ర స్థాయిలో ఇది రైతులకు ఉపయోగపడటం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వద్ద ఎక్కువ నిల్వ సామర్థ్యం లేదు మరియు దీనికి అవసరమైన నిధులు కూడా కేటాయించలేదు.
మోడి ప్రభుత్వం మొదటి నాలుగేళ్ళలో కేవలం 3-4 % మాత్రమే మద్దతు ధరను పెంచింది, అయితే ఈ సంవత్సరం 25% వరకు మద్ధతు ధరను పెంచటం ద్వారా రాబోయే ఎన్నికలకు ముందు రైతుల మద్ధతు కూడగట్టుకోవటానికి ప్రయత్నం చేసింది.
అయితే మన దేశంలో ప్రభుత్వాలు కొద్ది స్థాయిలో మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయి. 26 కోట్ల మంది రైతులలో కేవలం 7% మంది మాత్రమే మద్దతు ధరను దక్కించుకుంటున్నారు. మిగిలిన వారు గత్యంతరం లేక దళారులను, వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం డబ్బుల చెల్లింపు లో జాప్యం చేయటం, కొనుగోలు కేంద్రాలలో రోజుల తరబడి వేచి ఉండాల్సి రావటం కూడా రైతులను మద్దతు ధర నుండి దూరం చేస్తున్నాయి.
ప్రభుత్వం ఆర్భాటంగా మద్దతు ధరను అయితే ప్రకటించింది కానీ దానికి సరిపడా నిధులు కేటాయించలేదు. క్షేత్ర స్థాయిలో కేవలం కొన్ని రాష్ట్రాలలో మాత్రమే సరిపడా గోదాములు ఉన్నాయి. ప్రభుత్వాలు కొనుగోలు చేయకపోవటంతో గత సంవత్సరం రైతులు కందులను కనీస మద్దతు ధర కన్నా దాదాపు 1000 రూపాయలు తక్కువకే అమ్ముకోవాల్సి వచ్చింది. ఇది ఎన్నికల సంవత్సరం కావటంతో రైతులు కూడా ప్రభుత్వం ఎలాగోలా మద్ధతు ధరకు కొంటుందని ఆశిస్తున్నారు.
Post a Comment