ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రానికి ఫస్ట్ ర్యాంక్ రాకుండా కేంద్రం అడ్డుకోవాలని చూసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం ఏమీ చేయలేకపోయింది. కొన్ని అంశాలు తొలగించి మన స్కోర్ తగ్గించాలని ప్రయత్నించారు. వారు విధిలేకే మనకు మొదటి స్థానం ఇచ్చారు. ఇది మన రాష్ట్రంలో అవినీతి లేని సమర్థ పాలనకు నిదర్శనం అని చెప్పుకొచ్చారు. రాజధాని సమీపంలో ఉండవల్లి లోని ప్రజా దర్భార్ హాలులో ఏర్పాటు చేసిన తెలుగు దేశం పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్లపై పోరాడతాం
కేంద్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. కేంద్రానికి చేతకాకపోతే పదేళ్ల పాటు రాయితీ ఇవ్వాలని తామే ఏర్పాటు చేసి చూపిస్తామని ఆయన అన్నారు. సంయుక్త భాగస్వామ్యానికి కూడా సిద్ధమే అని అన్నారు. రైల్వే జోన్ సాధించేదాకా వదిలేది లేదని ఆయన అన్నారు.
మొత్తం సచివాలయాన్ని తీసుకుని ఢిల్లీకి వస్తాను.
పోలవరం ప్రాజెక్టు పై కేంద్రం కొర్రీలు పెడుతుందని కూడా ఆరోపించారు. అయిన ఖర్చులోనే ఇంకా 2250 కోట్లు రావాలని, ఇంకా గడ్కరీ సమాధానం చెప్పమని అడుగుతున్నారని దుయ్యబట్టారు. మా అధికారులను ఢిల్లీ పంపించి అక్కడే ఉంచుతా. అన్నిటికీ సమాధానాలు ఇస్తారు. అయినా కాకపొతే నేను మొత్తం సచివాలయాన్ని తీసుకుని అక్కడికి వస్తాను. మీకేం వివరాలు కావాలన్నా ఇస్తానని గడ్కరీకి స్పష్టం చేశానని తెలిపారు. కేంద్రం తెచ్చిన 2013 చట్టంతోనే భూసేకరణ ఖర్చు పెరిగిందని, కొంతమంది బిజెపి, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రాజెక్టు పూర్తి కాకూడదనే లక్ష్యంతోనే అడ్డు పడుతున్నారని అన్నారు.
మనమేం చేసామో ప్రచారం చేయండి
ప్రభుత్వం ఏర్పడి జులై 15 నాటికి 1500 రోజులు అవుతుందని ఆయన అన్నారు. గ్రామదర్శిని, గ్రామ వికాసం లాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు నేతలకు ఉద్బోధించారు. తాను 100 సభలకు హాజరవుతానని, రైతులు, పొదుపు సంఘాల మహిళలు, ఉపాధికల్పన, సంక్షేమ కార్యక్రమాల విషయంలో మనమేం చేసామో ప్రచారం చేసుకోవాలని సూచించారు. చెప్పిన దానికంటే ఎక్కువే చేసామని, ఓటరు జాబితాలు కూడా పరిశీలించుకోవాలని, మన ఓట్లు పోకుండా చూడాలని ఆయన అన్నారు.
ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను తీవ్రంగా తిప్పికొట్టాలని కూడా ఆయన నేతలకు సూచించారు. ఇకనుంచి చంద్రన్న పెళ్లి బకాయిలన్నీ వారంలోగా చెల్లిస్తామని, పెళ్లి రోజే కానుక అందిస్తామని ఆయన తెలిపారు.
Post a Comment