బోనాల పండుగ

బోనాలు అనేది హిందువులు మహంకాళిని మరియు ఇతర గ్రామ దేవతలను ఆరాధిస్తూ జరుపుకునే పండుగ. దీనిని ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటారు. ఆషాఢ మాసములో జరుపుకునే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ  మాసములో కూడా జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారు.

బోనాలు / బోనం

బోనం అనే పదం భోజనానికి మరో రూపమని భావిస్తారు. ప్రజలు అమ్మవారికి బోనం రూపంలో నైవేద్యాన్ని సమర్పిస్తారు. పాలు మరియు బెల్లంతో కలిపి వండిన అన్నాన్ని రాగి/ఇత్తడి లేక మట్టి కుండలలో పెట్టి, ఆ కుండలను పసుపు, కుంకుమలు మరియు వేప మండలతో అలంకరిస్తారు. ఈ మధ్య వీటికి ఆధునిక అలంకరణలు కూడా చేస్తున్నారు. కొంత మంది ఈ కుండలపై దీపాన్ని కూడా వెలిగిస్తారు. ఇలా అలంకరింపబడిన కుండను బోనం అని పిలుస్తారు.

పట్టు చీరలతో సాంప్రదాయబద్ధంగా తయారైన స్త్రీలు ఈ బోనాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుడు, ఆట పాటలతో ఊరేగింపుగా వెళ్లి చీరె, గాజులు, పసుపు కుంకుమలతో పాటు గుడిలో అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా బోనం తలకెత్తుకుని వెళ్లే  మహిళలను అమ్మవారి అంశగా భావిస్తారు. రౌద్రానికి ప్రతీక అయిన అమ్మవారిని శాంత పరచడానికి దారి పొడుగునా భక్తులు వారి కాళ్లపై నీళ్లు పోస్తుంటారు.


ఇలా దాదాపు అన్ని గ్రామదేవతల గుడులలో బోనం సమర్పించటమనే ఆచారాన్ని పాటిస్తారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కలమ్మ, ఆంకాళమ్మ, పోలేరమ్మ, నూకాలమ్మ మరియు మారెమ్మ మొదలైన అన్ని దేవతల గుడులు ఈ సమయానికల్లా కొత్త రంగులతో, విద్యుత్ దీప కాంతులతో, శోభాయమానంగా ముస్తాబవుతాయి.

బోనాల ఉత్సవాలు ఎలా ప్రారంభమయ్యాయి?

బోనాల ఉత్సవాలు 18వ శతాబ్దంలో ప్రారంభమైనట్లుగా చరిత్రకారులు భావిస్తారు. 1813 సంవత్సరంలో జంట నగరాలలో కలరా వ్యాధి ప్రబలడంతో వేలాది మంది ప్రజలు చనిపోయారు. ఈ వ్యాధి ప్రబలడానికి ముందే ఒక సైనిక బెటాలియన్ ను ఉజ్జయినికి పంపించారు. ఆ బెటాలియన్ లోని వ్యక్తులు ఇక్కడి కలరా వ్యాధిని గురించి తెలుసుకుని ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ లోని మహంకాళి దేవతను ప్రార్థించారు. ఆ అంటువ్యాధి తగ్గిపోతే నగరంలో మహంకాళి దేవత గుడిని నిర్మిస్తామని మొక్కుకున్నారు.

వారు తిరిగి వచ్చేసరికి వ్యాధి తగ్గిపోవటంతో మొక్కుప్రకారం ఆలయం నిర్మించి బోనాలు పండుగ జరుపుకున్నారు. సైన్యంలో పనిచేసిన సికింద్రాబాద్‌కు చెందిన సురిటి అప్పయ్య, 1815 లో  ఈ ఆలయాన్ని నిర్మించినట్లు, కలపతో అమ్మవారి విగ్రహన్ని చేయించి, ఉత్సవాలు జరిపినట్లు ఆలయ నిర్వాహకులు చెబుతారు.  అప్పటినుండి బోనాల పండుగ ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలలో భాగమైంది.

మరొక నమ్మకం ప్రకారం ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వస్తుందని భావిస్తారు. పుట్టింటికి వచ్చిన దేవతను సంతోష పరిచటానికి బోనాల పండుగను జరుపుతారు. ఈ పండుగకు ఆడపిల్లలను పుట్టింటికి పిలిచే సాంప్రదాయం ఇప్పటికీ ఉంది. కొన్ని ప్రాంతాలలో ఈ పండుగను పెద్ద పండుగ, ఊర పండుగ మరియు ఊరడి అనే పేర్లతో కూడా పిలుస్తారు.

బోనాల ఉత్సవాలు 

బోనాల పండుగను జంట నగరాలలో వైభవంగా జరుపుకుంటారు. లంగర్ హౌస్ లో ప్రారంభమయ్యే ఊరేగింపుతో బోనాల ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసములో తొలి ఆదివారం గోల్కొండ మహంకాళి ఉత్సవాలు జరుగుతాయి. రెండవ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర, బల్కంపేట ఎల్లమ్మ జాతరలు జరుపుకుంటారు. మూడవ ఆదివారం పాత నగరం బోనాల జాతర అంటే లాల్ దర్వాజా సింహవాహిని, చిలకలగూడ మైసమ్మ, హరిబౌలి అక్కన్న మాదన్న, శాలిబండ ముత్యాలమ్మలకు మరియు నగరంలో మిగిలిన అనేక ప్రాంతాల్లో ఇదే రోజు బోనాల పండుగ జరుపుకుంటారు. తిథులను బట్టి ఒక్కొక్కసారి ఒక వారం అటూ ఇటూగ పండగ తేదీలు ఉంటాయి. 

మహిళలు సంప్రదాయబద్ధంగా చీరెలు, లంగా ఓణీలు ధరించి నగలతో ముస్తాబయి ఈ పండుగకు ప్రత్యేక శోభను తీసుకువస్తారు. కొంతమంది భక్తి పారవశ్యంతో నృత్యాలు చేస్తారు. 

పురాతన కాలంలో ఈ పండగ రోజు దున్నపోతును బలి ఇచ్చే ఆచారం ఉండేది. ఈ మధ్యకాలంలో మేకలను, కోళ్లను అమ్మవారికి బలి ఇస్తున్నారు. పోతురాజు, కొలుపులు, రంగం, ఘటం, తొట్టెల, ఫలహార బండి లాంటివి ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణలు గా ఉంటాయి. 

పోతురాజు 

పోతురాజు గ్రామదేవతకు సోదరుడు. పోతురాజుకు సంబందించిన ఆచారాలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. ప్రతి అమ్మవారి గుడి బయట పోతురాజు విగ్రహం పెట్టడం గానీ, పెయింట్ తో వేయటం గానీ చేస్తారు. బోనాల జాతర సందర్భంగా పోతురాజు వంటినిండా పసుపు/కుంకుమ, పెయింట్ వేసుకుని భయంకరాకారంతో కనిపిస్తుంటారు. కళ్ళకు పెద్ద గజ్జెలు, శరీరంపై గంటలు, వేపాకులు ధరించి నుదిటిపై పెద్ద బొట్టుతో, చేతిలో కొరడాతో భీతావహంగా ఉంటారు.

పోతురాజు ఎప్పుడూ ఫలహారం బండికి ముందు నడుస్తాడు. అతన్ని జాతరకు మొదటివాడిగా, రక్షకుడిగా పరిగణిస్తారు. అతను డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యం చేస్తాడు. ఊరేగింపు సందర్భంగా మైకంతో శిగం ఊగే వారిని అతనే నడిపిస్తాడు. 

పోతురాజు చేతిలో కొరడాను ఈరకోల అంటారు. పోతురాజులు ఎవరి మెడలోనైనా ఈరకోల వేస్తే మంచి జరుగుతుందని, కొడితే వ్యాధులు తగ్గుతాయనీ, మానసిక భయాలు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే అందరూ పోతురాజుకు మొక్కుతారు. ఓం నమ: శివాయ అంటూ బ్యాండు కొట్టేప్పుడు పోతురాజులు ప్రత్యేకమైన భక్తి తో కూడిన తాండవం/నృత్యం చేస్తారు. ఆ సమయంలో ఎవరూ పోతురాజుకు ఎదురు వెళ్ళరు. 

పోతురాజులలో చాలా మంది ఉపవాసం చేస్తారు. జాతర సుదీర్ఘ సమయం సాగుతుంది కాబట్టి శక్తి కోసం కొంతమంది గ్లూకోస్ నీళ్లు తీసుకుంటారు. కొన్ని ప్రాంతాలలో ఆచారం కానప్పటికీ ఆల్కహాల్ ను కూడా తీసుకుంటున్నారు.  

గావు పట్టడం 

ఉగ్ర రూపంలో ఉండే అమ్మవారు రక్తాన్ని చూసి శాంత పడతారనే నమ్మకం కూడా ఉంది. అందుకే పోతురాజులు నోటితో కోడి, లేదా మేకను కొరుకుతారు. దీనినే గావు పట్టడం అంటారు. పోతురాజు నోటిలో రక్తం చూస్తే అమ్మవారు శాంతిస్తుంది. అమ్మవారికి పోతురాజు మేకను గావు పట్టడం చాలా ఇష్టమని పూర్వీకుల నుండి వస్తున్న నమ్మకం. ఇవి ఇష్టంలేని ప్రాంతాలలో గుమ్మడికాయ, నిమ్మకాయలతో కూడా గావు పట్టే ఆచారాలు ఉన్నాయి. 

బోనాల విందులు 

బోనాలు పండుగ రోజు కొలుపులు కొలిచిన తరువాత, ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. దాని తర్వాత కుటుంబ సభ్యులు, అతిథులు, తెలిసినవారందరితో మాంసాహార విందును జరుపుకుంటారు. కల్లు, ఆల్కహాల్ కూడా ఈ విందులో భాగంగా మారిపోయాయి. పండుగ జరిగే ప్రాంతాలలో వీధులని వేపాకులతో, పందిళ్ళతో అలంకరిస్తారు. అమ్మవారికి సంబంధించిన జానపద గీతాలు వీధి వీధినా వినపడుతాయి. 

రంగం 


రంగంలో భాగంగా జోగిని భవిష్యవాణిని వినిపిస్తుంది. వేదికను అలంకరించి, పచ్చికుండను దేవతకు ప్రతిరూపంగా భావించి భూమిలో పాతుతారు. దాని చుట్టూ బియ్యంతో ముగ్గులు వేసి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. రంగం చెప్పే జోగినికి కొత్తబట్టలు పెట్టి ఒడిబియ్యం పోస్తారు. ఆ సమయంలో డప్పు చప్పుళ్ళు, ఇతర వాయిద్యాలతో వాతావరణాన్ని ఉద్విగ్నభరిత స్థాయికి తీసుకువెళుతారు. వాటితో మైకంలోకి వెళ్లిన జోగినిని దేవత ఆవహించి భవిష్యవాణిని వినిపిస్తుందని భక్తుల నమ్మకం. 

ఘటం 

రంగం తర్వాత ఈ ఉత్సవం జరుగుతుంది.  రాగి కలశాన్ని అమ్మవారిగా భావించి, అలంకరించి ఘటం అని అంటారు. సాంప్రదాయిక వస్త్రధారణతో, ఒంటి పై పసుపు పూసుకున్న పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు వరకూ ఈ ఘటాన్ని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగిస్తారు.

హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయములో  ఘటాన్ని ఏనుగు అంబారీపై, అశ్వాలపై అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగించి సాయంత్రం నయా పూల్ వద్ద నిమజ్జనం చేస్తారు. లాల్ దర్వాజా నుండి నయా పూల్ వరకు వేలాది మంది రోడ్డుకు ఇరుపక్కలా గుమికూడి అంగ రంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను వీక్షిస్తారు. ఘటాలతో పాటు, పోతురాజు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపదగీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు.

పాత నగరంలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి అక్కన్న మాదన్న, ఉప్పుగూడ, లాల్‌దర్వాజా, మీర్ ఆలం మండీ, కాసరగుట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్‌ షాహీ జగదాంబ, షాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా మరియు సుల్తాన్‌షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాదులోని దర్బారు మైసమ్మ మందిరం మరియు చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి.

సికింద్రాబాద్ లో జరిగే ఘటాల ఊరేగింపులో ఉజ్జయిని మహంకాళి, కర్బలా మైదానంలోని మహాదేవి పోచమ్మ, ఇమామ్ బావి డొక్కలమ్మ, కళాసిగూడ ముత్యాలమ్మ, నల్లగుట్ట, పాన్ బజార్, చిలకల గూడ, ఉప్పరి బస్తి, కుమ్మరి గూడ, రెజిమెంటల్ బజార్ మరియు బోయిగూడ దేవాలయాలు పాల్గొంటాయి. 

తొట్టెల 

తొట్టెల అనేది బోనాల పండుగ సందర్బంగా దేవతకు సమర్పించటానికి ఉద్దేశించినది. దీనిని వెదురు కర్రలు మరియు రంగురంగుల పారదర్శకమైన పేపర్లతో,  గోపురం ఆకారంలో కళాఖండాలుగా రూపొందిస్తారు.  వీటిని ఊరేగింపుగా తీసుకెళ్లి దేవతకు అర్పిస్తారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post