కేంద్ర హోంశాఖ, సుప్రీమ్ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో విశాఖ రైల్వే జోన్, తెలంగాణాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు సాధ్యం కావని పేర్కొంది. అందరి దృష్టి వీటిపైనే కేంద్రీకృతమైంది కానీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వీటికన్నా ప్రమాదకరమైన అంశం మరొకటి ఉంది. అదే పదవ షెడ్యూల్ సంస్థలు.
పదవ షెడ్యూల్ సంస్థలకు తెలంగాణ, హైదరాబాద్ లలో భారీ ఎత్తున భూములు, ఆస్తులు ఉండటంతో వాటిని విభజిస్తే, అక్కడ ఆంధ్రప్రదేశ్ కు వేలకోట్ల రూపాయల ఆస్తులు వస్తాయనే ఉద్దేశంతో ఇప్పటివరకూ ప్రభుత్వం ఉంది. కానీ కేంద్రం అఫిడవిట్ తో వాటిపై కూడా నీళ్లు చల్లింది. పదవ షెడ్యూల్ సంస్థలు కూడా ఎక్కడ ఉన్నవి ఆ రాష్ట్రానికే చెందుతాయని, కేవలం పది సంవత్సరాల పాటు మాత్రమే రెండు రాష్ట్రాలకు సేవలందిస్తాయని కేంద్రం పేర్కొంది.
పదో షెడ్యూల్‌లో మొత్తం 140 కి పైగా సంస్థలున్నాయి. వాటిలో 57 ప్రభుత్వ రంగ సంస్థలు, 15 యూనివర్సిటీలు, 21 రిజిస్టర్డ్ సంస్థలు, 45 సొసైటీలు, మరో కొన్ని ఇతర సంస్థలు ఉన్నాయి. వీటిలో తెలుగు అకాడమీ, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ, ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి సంస్థలున్నాయి. ఈ సంస్థలకు సంబంధించిన స్థలాలు మరియు భవనాల విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుంది. వీటికి తోడు ఆరోగ్యశ్రీ, ఎంఎన్‌జే క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, యోగాధ్యాయన పరిషత్‌లను తర్వాత వీటికి జోడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015 లో ఉన్నత విద్యా మండలి మరికొన్ని ఇతర సంస్థలలో ఉన్న బ్యాంకు డిపాజిట్లను ప్రత్యేక అకౌంట్లకు తరలించాలని భావించింది. తెలంగాణ ప్రభుత్వం బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయించి ఈ ప్రయత్నాలను అడ్డుకుని ఉన్నత విద్యా మండలి ఆస్తులను పూర్తిగా స్వాధీనం చేసుకుంది.
ఉన్నత విద్యా మండలి ఆస్తుల విభజన పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించగా, అప్పుడు కేంద్రం స్పందించలేదు. కోర్టు తీర్పుతో డిపాజిట్ల వాటా రాష్ట్రానికి రావటమే కాకుండా, విభజన విషయమై ఆంధ్రప్రదేశ్ వాదనకు సానుకూలత లభించింది. కానీ ఆస్తుల విభజన సాధ్యం కాలేదు. ఇప్పుడు కేంద్రం ఇలా చేయటంతో ఆంధ్రప్రదేశ్ వాటా ప్రమాదంలో పడింది.
కేంద్రం అఫిడవిట్, తుది తీర్పు ఏమీ కాదని, ఉన్నత విద్యామండలి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే పదో షెడ్యూలులోని మిగతా సంస్థల ఆస్తులన్నింటినీ కూడా విభజించాలంటూ సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Post a Comment