థాయ్ గుహల్లో ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌

థాయ్ గుహల్లో ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌
థాయిలాండ్ లో రెండు వారాలకు పైగా గుహలో చిక్కుకుపోయిన 12 మంది ఫుట్ బాల్ టీం చిన్నారులంతా  కోచ్ తో సహా సురక్షితంగా బయట పడ్డారు. మూడు రోజుల పాటు సాగిన బయటకు తీసుకు వచ్చే కార్యక్రమాలు ఇవాళ ముగిసాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌ సుఖాంతమైంది. 

జూన్‌ 23న ఫుట్ బాల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ పన్నెండు మంది చిన్నారులు తమ ఫుట్‌బాల్‌ కోచ్‌తో థాయ్‌లాండ్‌లోని ప్రఖ్యాత తామ్ లుయాంగ్‌ గుహలను చూడటానికి వెళ్లారు. వీరు లోపలికి వెళ్లిన అనంతరం నీటిమట్టం బాగా పెరిగి బయటకు వచ్చే దారి మూసుకు పోవటంతో వీరు లోపలే చిక్కుకుపోయారు. వారిని కనిపెట్టడానికి బయట నుండి అనేక ప్రయత్నాలు చేసారు. తొమ్మిది రోజుల అనంతరం  అవి ఫలించి, బ్రిటిష్ డైవర్లు వారిని కనిపెట్టగలిగారు. గుహ కిలోమీటరు కన్నా పొడవు ఉండటం, మొత్తం నీటితో నిండిపోవటం తో వారిని అక్కడే ఉంచి ఆహారం, మందులు అందించారు.  తర్వాత వారిని బయటకు తీసుకు రావటానికి అనేక ప్రయత్నాలు చేసారు.  ఎట్టకేలకు విదేశీ మరియు థాయిలాండ్ డైవర్లు వారిని విజయవంతంగా బయటకు తీసుకు రాగలిగారు. కాగా విజయవంతమైన ఈ ఆపరేషన్ లో ఒక థాయ్ డైవర్ మరణించటం దురదృష్టకరం. 

తొలి రోజు నలుగురినీ, రెండవ రోజు నలుగురిని, ఇవాళ మూడవ రోజు కోచ్ తో సహా ఐదుగురిని నేవీ డైవర్ల సహాయంతో బయటకు తీసుకు వచ్చారు. వీరందరినీ హాస్పిటల్ కు తరలించారు. వారికి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉండటం తో ఎవరినీ కలవటానికి అనుమతించడం లేదు. కాగా థాయ్ ప్రధాని ప్రయుత్‌ చాన్‌-ఓచా ఆస్పత్రిలో ఉన్న చిన్నారులను డాక్టర్ల పర్యవేక్షణలో కలిసినట్లు తెలుస్తోంది. పిల్లలంతా మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఇద్దరికి మాత్రం న్యూమోనియా సోకిందని, చికిత్స చేస్తున్నామని వెల్లడించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post