రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా చేసేందుకు ఉద్దేశించిన కేంద్ర సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. వీటిని పూర్తి చెయ్యాల్సిన కాల పరిమితిని వచ్చే ఏడాది జూన్ వరకు పొడగించవలసిందిగా రాష్ట్ర నీటి పారుదల శాఖ, కేంద్ర జల వనరుల సంఘానికి (సీడబ్ల్యూసీ) విజ్ఞప్తి చేసింది.
ఈ పథకం లో భాగంగా దేవాదుల, ఇందిరమ్మ వరద కాల్వ, ఎస్సారెస్పీ–2, భీమా, కొమురం భీం, గొల్ల వాగు, ర్యాలి వాగు, మత్తడి వాగు, పెద్ద వాగు, పాలెం వాగు, జగన్నాధ్‌పూర్ ప్రాజెక్టులు ఉన్నాయి. 2017 జూన్ లోగా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని రాష్ట్రం ప్రధానికి సమీక్షలో భాగంగా తెలియ చేసింది. వీటిలో గొల్ల వాగు, ర్యాలి వాగు, మత్తడి వాగు పూర్తయ్యాయి. మిగిలినవి భూ సేకరణలో ఇబ్బందుల వల్ల ఆలస్యమయ్యాయి. దానితో 2018 జూన్ వరకు పొడగింపు అడిగారు. ఇప్పుడు కూడా లక్ష్యం పూర్తి కాకపోవటంతో 2019 వరకు పొడగింపు అడుగుతున్నారు.
నిధుల కొరత కారణంగా, 8 ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ ఆలస్యమయింది. ఈ ప్రాజెక్టుల మొత్తం నిర్మాణ ఖర్చు 24,719 కోట్ల రూపాయలు కాగా ఇప్పటివరకు 18,838 కోట్లు ఖర్చు చేసారు. దీనిలో కేంద్రం వాటా 5,881 కోట్లు కాగా ఇప్పటివరకు వచ్చినది 4513 కోట్లు.
ఈ ఏఐబీపీ పథకం కింద సాధారణంగా చిన్న సాగునీటి ప్రాజెక్టులను మాత్రమే నిర్మిస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ జాబితాలో భారీ ఆయకట్టు లక్ష్యాలున్న దేవాదుల, ఇందిరమ్మ వరద కాల్వ, ఎస్సారెస్పీ–2, భీమా వంటి ప్రాజెక్టులను మంజూరు చేయించుకోవటం గమనార్హం.
Post a Comment