ఆషాఢ నవరాత్రి

ఆషాఢ నవరాత్రి
నవరాత్రి అనేది ఆది శక్తిని ఆరాధించే హిందూ పండుగ. నవరాత్రి అనే పదానికి అర్థం తొమ్మిది రాత్రులు. ఈ తొమ్మిది రాత్రుల పాటు తొమ్మిది రూపాలలో ఉన్న దేవిని ఆరాధించటమే నవరాత్రి ఉత్సవం. అందరికీ తెలిసిన నవరాత్రి ఉత్సవం శరద్ నవరాత్రి. దీనిని ఆశ్వయుజ మాసములో దసరాకు ముందు తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఇదేకాకుండా సంవత్సరంలో మరికొన్ని సార్లు కూడా నవరాత్రిని జరుపుకుంటారు. వాటిలో ఒకటి ఆషాఢ నవరాత్రి. 

ఆషాఢ నవరాత్రిని ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నవరాత్రికి  గుప్త నవరాత్రి, గుహ్య నవరాత్రి, వారాహి నవరాత్రి, శాకంబరి నవరాత్రి మరియు గాయత్రి నవరాత్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. 

ఆషాఢ నవరాత్రి ప్రజల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు కాబట్టి దీనిని గుప్త నవరాత్రి అని కూడా అంటారు.  ఎక్కువగా దీనిని అమ్మవారి ఆలయాల్లోనే జరుపుకుంటారు.  శరద్ నవరాత్రి ఉత్సవ సమయంలో పాటించే అచారాలన్నీ దీనికి కూడా పాటిస్తారు. 

తొమ్మిది రోజుల పాటు ఆలయాల్లో జరుపునే పూజలు వరుసగా 

పాడ్యమి -  కలశ స్థాపన, శైలపుత్రి పూజ (తెలుగు రాష్ట్రాల్లో దుర్గా అవతారంలో)
విదియ - బ్రహ్మచారిణి పూజ (భద్రకాళి)
తృతీయ -చంద్రఘంట పూజ  (జగదంబ)
చతుర్థి - కూష్మాండ పూజ  (అన్నపూర్ణ)
పంచమి - స్కందమాత పూజ  (సర్వమంగళ)
షష్టి - కాత్యాయని పూజ  (భైరవి)
సప్తమి -కాళరాత్రి పూజ  (చండి)
అష్టమి - మహాగౌరీ పూజ, సంధి పూజ  (లలిత )
నవమి - సిద్ధిధాత్రి పూజ, నవరాత్రి పారణ  (భవాని)

వారాహి నవరాత్రి 

కొన్ని ప్రాంతాలలో మరియు ఆలయాలలో ఆషాఢ నవరాత్రిని వారాహి నవరాత్రిగా జరుపుకుంటారు. వారాహి మాత లలితా త్రిపుర సుందరి మాత యొక్క దండనాయకి/ దండనాథ దేవి. ఈ అమ్మవారు వరాహ తలను కలిగి ఉంటుంది. 

ఈ నవరాత్రి పూజల్లో భాగంగా వారాహి అమ్మవారి ఆవాహన, నవావరణ పూజ, వారాహి కుంకుమార్చన మరియు వారాహి హోమం లాంటివి నిర్వహిస్తారు. దుర్గా సూక్తం, లలితా సహస్ర నామం, లలితోపాఖ్యానం మరియు బ్రహ్మాండ పురాణ పారాయణం చేస్తారు. 

గుప్త నవరాత్రి / గుహ్య నవరాత్రి 

తాంత్రికులు మరియు సాధకులు ఈ నవరాత్రి సందర్భంగా శాంతికరణం, వశీకరణం, ఉఛ్ఛాటనం, స్తంభనం మరియు మరణం లాంటి తంత్ర విద్యల సాధన చేస్తారు. 

శాకంబరి నవరాత్రి ఉత్సవంలో భాగంగా అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్లతో అలంకరించి ఆరాధిస్తారు. శాకంబరి మాత విశేషాల్నిఇక్కడ తెలుసుకోవచ్చు. 

ఆషాఢ నవరాత్రి సందర్భంగా దేవి భాగవతం, దుర్గ సప్తశతి మరియు దేవి మహత్యం లాంటివి పారాయణం చేయటం శుభాలను కలిగిస్తుందని భావిస్తారు. 

0/Post a Comment/Comments