ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) నుండి ఈరోజు ఉదయం ఆరురోజుల వయస్సు ఉన్న పసికందు అదృశ్యమయిన ఘటన సుఖాంతమైంది.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల్లోని చోర్పల్లి గ్రామంలో నివసించే దిర్బాసి మమత (25), ఈ నెల రెండవ తేదీన ఆసుపత్రిలో చేరింది. నాలుగవ తేదీన ఒక బాలుడికి జన్మనిచ్చింది. అయితే ఆ బాలుడు తెల్లవారుజామున రెండు నుండి మూడు గంటల మధ్య అపహరించబడ్డాడు. సమాచారం తెలుసుకున్న ఆదిలాబాద్ పోలీసులు వెంటనే స్పందించి, చుట్టు పక్కల పోలీసు స్టేషన్‌లను అప్రమత్తం చేశారు. మరియు నగరమంతా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు.
ఆదిలాబాద్ పోలీసు అధికారులు హెచ్చరించిన తరువాత నేరడిగొండ టోల్‌ప్లాజా వద్ద పోలీసు ఇన్స్పెక్టర్ జి. హరిశేఖర్ ఒక చెక్ పాయింట్ ఏర్పాటు చేశారు. వార్తా పత్రికలు రవాణా చేయటానికి ఉపయోగించే కారులో అనుమానాస్పందంగా పసికందు తో వెళుతున్న దంపతులను ఆయన విచారించగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు చిన్నారి ఫోటోలను అధికారులకు పంపడంతో, బాధిత మహిళ చిన్నారిని గుర్తు పట్టారు. బిడ్డను ఆమెకు అప్పగించి నిందిత దంపతులను అరెస్ట్ చేశారు. నిందితురాలిని మాజీ ANM పుష్పలత గా గుర్తించారు.
గత వారం రోజుల్లో తెలంగాణ పోలీసులు విజయవంతంగా ఛేదించిన రెండవ శిశువు అపహరణ కేసు ఇది. హైదరాబాద్ లోని కోఠి ప్రభుత్వ ఆసుపత్రి ఉదంతంలో బీదర్ పోలీసుల సహకారంతో అపహరింపబడిన శిశువును 48 గంటల్లో గుర్తించారు.
Post a Comment