చంద్రబాబుకు ఏమైంది?

చంద్రబాబుకు ఏమైంది?
1994 లో చంద్రబాబు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు, అభివృద్ధి కాముకుడు, మరియు ఎదో చేయాలనే ఆరాటం ఆయనలో స్పష్టంగా కనిపించేది. 

దీర్ఘ కాలంలో ప్రజల శ్రేయస్సు కోసం అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఆయనకు ఉండేది.  విద్యుత్ సంస్కరణలు, సంవత్సరానికి ఒకసారి విద్యుత్ బిల్లుల పెంపు దీనికి ఉదాహరణ. 

స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించేవాడు కాదు. 2004 ఎన్నికలకు ముందు ఉచిత విద్యుత్ హామీ ఇవ్వమని కొంత మంది సలహాలు ఇచ్చినా పట్టించుకోలేదు. ప్రజలకు ఉచితం అలవాటు చేయటం మంచిది కాదని, ఉపాధి అవకాశాలు పెంచటమే మార్గమని ఆయన భావించేవారు. 

నిర్ణయాల్లో ఊగిసలాట ధోరణి మచ్చుకైనా కనిపించేది కాదు. తను చేయలేనివి, చేయాలనుకోనివి స్పష్టంగా చెప్పే లక్షణాలుండేవి. అందుకే 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా సమైక్యాంధ్ర నినాదంతోనే ఎన్నికలకు వెళ్లారు. 

ఇప్పటిలా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పటం, గంటల తరబడి అనవసరమైన సంభాషణలు చేయటం కూడా ఎక్కువగా కనిపించేవి కావు. అప్పట్లో కూడా కొంత వరకు తన గొప్పలు చెప్పుకున్నా, అవి ఈ స్థాయిలో ఉండేవి  కాదు. చాలా వరకు అందులో నిజాలే ఉండేవి.

ప్రభుత్వ ఉద్యోగులతో పని విషయం లో కఠినంగా  వ్యవరించి జవాబుదారీతనం అలవాటు చేసాడు. ఆయన సామాన్యుడు కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో తమకవసరమైన పనులు స్వయంగా  చేయించుకోగలిగే వాతావరణం మొదటిసారిగా కల్పించినవాడు. ఇది ఆయన సాధించిన విజయంగా చెప్పవచ్చు. అప్పటిలో వచ్చిన ఐటీ బూమ్ లో బెంగళూరుతో పాటు హైదరాబాద్ లో కూడా ఉపాధి అవకాశాలు పెరగటం లో ఆయన పాత్ర ఎంతగానో ఉంది.  

కానీ కొన్ని విషయాల్లో మరీ కఠినంగా వ్యవరించేవాడు. బషీర్ బాగ్ ఘటన, కరెంటు బిల్లులు ప్రతి ఏడాది పూర్తి స్థాయి లో పెంచటం లాంటివి ఆయనకు చెడ్డ పేరు తెచ్చి పెట్టాయి.  సంక్షేమ పథకాల్ని తొలగిస్తుండటం, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయటం, ఎవరితోనూ సర్దిచెప్పినట్లు మాట్లాడకపోవడం మరియు పదేళ్లు అధికారంలో ఉండటం ఆయన పట్ల విముఖతను కలిగించాయి. 

2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా సమైక్యాంధ్ర నినాదంతోనే ఎన్నికలకు వెళ్లారు. కానీ విజయం సాధించలేకపోయారు. దానికి అనేక కారణాలున్నాయి. కరెంటు బిల్లులు, ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాల్ని, రైతులను నిర్లక్ష్యం చేయటం లాంటివి కూడా ప్రముఖ పాత్ర వహించాయి.

కానీ చంద్రబాబు గారు, తన ఓటమికి కారణాలుగా తెలంగాణ వాదాన్ని, ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకతను ప్రముఖంగా భావించాడు. అప్పట్లో తెలంగాణ వాదం 2009 తర్వాత ఉన్నంత బలంగా లేదు. ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకతే కారణమైతే 1999 లోనే ఆయన ఓడిపోయేవాడు.

అయితే 2004 లో వైయస్సార్ తెలంగాణ హామీ ఇచ్చి కూడా నిలబెట్టుకోకుండా ప్రజలను మభ్యపెట్టాడు. ఇది అధికారం కోల్పోయి ఉన్న చంద్రబాబు లో కొంతవరకు మార్పుకు కారణమైంది. 

2009 లో కూడా టీఆరెస్ తో పొత్తు ఆయన స్వభావానికి, వ్యవహార శైలికి విరుద్ధం. ఆయన ఫక్తు సమైక్యవాది. తెలంగాణ ఇచ్చే ఉద్దేశ్యం లేకుండానే వైయస్సార్ 2004 లో హామీ ఇచ్చి, తెలంగాణ ఇవ్వకుండా ఎలా తన పబ్బం గడుపుకున్నాడో, 2009 లో చంద్రబాబు కూడా అలాగే చేద్దామనుకున్నాడు.

అయితే 2009 లో వైయస్సార్ తెలంగాణాలో ఎన్నికలు అయిపోగానే, హైదరాబాద్ వెళ్ళడానికి వీసా కావాలి అని ఆంధ్ర ప్రజలను భయపెట్టి మరీ ఓట్లు వేయించుకోగలిగాడు. ఇదీ రెండు కళ్ళ సిద్ధాంతమే. చంద్రబాబు దీనిని కూడా జాగ్రత్తగా గమనించాడు. 

2009 లో మరో ఓటమి ఆయనను చాలా వరకు మార్చింది. గెలవటానికి ఏమైనా చేయవచ్చు. ఎటువంటి హామీలైన ఇవ్వవచ్చు అనుకోవటానికి బహుశా అదే నాంది. 10 సంవత్సరాల పాటు అధికారంలో  లేకపోవడాన్ని కూడా చంద్రబాబు గారు భరించలేకపోయారు. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే తహతహ ఆయనలోని విలువల్ని సమాధి చేసింది. తెలంగాణ ఏర్పాటు కూడా ఆయనను నిస్పృహకు గురి చేసింది. 

ఇలా 2014 ఎన్నికల నాటికి చంద్రబాబు పూర్తిగా మారిపోయారు. అసలు అమలు సాధ్యం కాని రైతు, డ్వాక్రా రుణమాఫీలు, నిరుద్యోగ భృతి లాంటివన్నీ హామీలుగా ఇచ్చేసారు. అదే 2004లో కరెంటు బిల్లులు తగ్గించటం, ఉచిత విద్యుత్ లాంటి అమలు సాధ్యమయ్యే అవకాశాలున్న హామీలను కూడా తన వ్యవహార శైలికి విరుద్ధమని ఇవ్వలేదు. అప్పుడు మరీ కఠినంగా, ఇప్పుడు మరీ మెత్తగా వ్యవరిస్తున్నాడు.

ఇంత చేసి 2014 లో అధికారం దక్కించుకున్న తర్వాత కూడా ఆయన ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. 1994 లో ఆయనకు అన్నీ ప్రశంసలే దక్కేవి. కానీ ఇప్పుడు అధికారంలోకి రాగానే, హామీల అమలుపై  తీవ్ర విమర్శలు ఎదుర్కొనవలసి వచ్చింది. స్వతహాగా తనలో తనే ఇలా మభ్యపెట్టడం భరించలేక పోతున్నాడు. నోటు కు వోట్ లాంటి కేసు కూడా ఆయన మానసిక స్థయిర్యాన్ని దిగజార్చింది.

ఈ మధ్య ఆయన మాట్లాడే మాటలు కూడా విచిత్రంగా, నవ్వుకునే విధంగా ఉంటున్నాయి. 

దోమలపై డ్రోన్లతో యుద్ధం

మొదటి నుండి ఆయనకు క్యాచీగా ఉండే హైటెక్ పదాలు వాడటం ఇష్టం. కానీ ఇలా మాట్లాడటం ఆయన స్థాయికి తగినది కాదు. సింపుల్ గా  దోమలను నిర్మూలిస్తాం అని మున్సిపాలిటీనో, మున్సిపల్ శాఖామాత్యులో ప్రకటన చేస్తే బావుండేది. అయినా మన మున్సిపాలిటీలలో శానిటేషన్ సిబ్బందికి కొదువ లేదు. మనుషులు వెళ్లలేని, డ్రోన్లు మాత్రమే వెళ్లగలిగే ప్రాంతాలు ఉండటం కూడా అనుమానమే.  

రెయిన్ గన్లతో కరువును ప్రారదోలాం

ఇది కూడా సింపుల్ గా, రెయిన్ గన్లతో కరువును తగ్గించే ప్రయత్నం చేసాం లేక నీరు ఆదా చేయటానికి ప్రయత్నం చేసాం అని చెప్పవచ్చు. ప్రారదోలాం లాంటి పదం ఇక్కడ అవసరం లేదు. 

హైదరాబాద్ ని నేనే ప్రపంచ పటంలో పెట్టాను

ఇక్కడ, హైదరాబాద్ లో ఐటీ రంగం నా హయాం లోనే అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. లేకపోతే మా ప్రభుత్వ హయాంలోనే గుర్తింపు లభించింది  అంటే బావుండేది.  ప్రపంచ పటం లో పెట్టడమేంటో, అది అప్పటి వరకూ అదృశ్య పట్టణమా?  ఇంకా నేనే అనేది అహంకారాన్ని సూచిస్తుంది. మన అనక పోయినా పరవాలేదు. కనీసం మా ప్రభుత్వం, మా హయాం అంటే బావుంటుంది.  

ఇంకా నేను వేసిన రోడ్లపై నడుస్తున్నావు.
సెల్ ఫోన్ తెచ్చింది నేనే లాంటివెన్నో........ 

ఇలాంటి మాటలన్నీ వింటుంటే ఒక్కొక్క సారి ఆయనకు ఏమయిందో అన్న అనుమానం కలుగుతుంటుంది. ఇంకా గంటల తరబడి చెప్పిందే చెప్పటం కూడా ఏమీ బావుండటం లేదు. 1994 చంద్రబాబుకి, 2014 చంద్రబాబుకి మధ్య ఎంత వ్యత్యాసమో? 

0/Post a Comment/Comments

Previous Post Next Post