తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేసే విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్

డోనాల్డ్ ట్రంప్ జనవరి 2017 లో అమెరికా అధ్యక్ష్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారి తన వివాదాస్పద నిర్ణయం నుండి వెనక్కు తగ్గారు. తల్లిదండ్రుల నుండి పిల్లలను వేరుచేసే ఈ ఇమ్మిగ్రేషన్ పాలసీపై స్వదేశంలోనూ, అంతర్జాతీయంగా కూడా ఆగ్రహం వ్యక్తమైంది. దీనిని నిలిపివేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై  ట్రంప్ సంతకం చేసారు. 

కుటుంబాలను ఒకే దగ్గర ఉంచటంతో పాటు, మనది శక్తివంతమైన దేశమని తెలియచెప్పటం, దుర్భేద్యమైన సరిహద్దును కలిగి ఉందని నిర్ధారించుకోవడం కూడా ముఖ్యమేనని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

ట్రంప్ ఇలా ఎందుకు చేసారు? 

సరిహద్దులు దాటి అమెరికాలోకి అక్రమంగా వస్తున్న వలసదారుల్ని నిరోధిస్తానని డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలలో హామీ ఇచ్చారు. ఆయనను సమర్థించిన చాలామంది ప్రజలు ఇది ఖచ్చితంగా జరగాలని కోరుకున్నారు.

ఎందుకు వెనక్కితగ్గారు ?

పిల్లలు ఏడుస్తున్న వీడియోలు , యువకులను బోనుల్లో బంధించిన  వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీనిపై మతాధికారులు, వ్యాపారస్తులు, మరియు ఇతర ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనిని పొప్ ఫ్రాన్సిస్ కూడా ఖండించారు. పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేసే ప్రక్రియను తక్షణం ఆపాలని అమెరికాకు ఐక్యరాజ్య సమితి సూచించింది.

అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా ఈ అంశంలో ట్రంప్ తో విభేదించారు. పిల్లలను వారి కుటుంబాల నుంచి వేరు చేయటాన్ని చూడలేకపోతున్నాను.  వారంతా కలవాలని కోరుకుంటున్నాను. మన దేశం అన్ని చట్టాలనూ పాటించటం తో పాటు,  మనసుతో ఆలోచించే దేశం కూడా కావాలి. అని ఆమె పేర్కొన్నారు.

మాజీ ప్రథమ మహిళ బార్బరా బుష్ కూడా ఈ అంశంలో తీవ్ర విమర్శలు చేసారు.  క్రూరమైన ఈ విధానం నా హృదయాన్ని బద్దలు చేస్తోంది. చిన్న పిల్లల్ని గోదాముల్లోను, ఎడారి నగరాల్లోని టెంట్లలోను పెట్టే పనిలో మన ప్రభుత్వాన్ని చూడలేకపోతున్నాను.  అని ఆమె అన్నారు.

మిస్టర్ ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ఇమ్మిగ్రేషన్ విషయంలో  కఠినమైన వైఖరిని అవలంభించారు. కానీ ఇప్పుడు కుటుంబాలను వేరు చేయటంతో వస్తున్న విమర్శల వల్ల తన చేతులు కట్టివేయబడుతున్నాయని పేర్కొన్నారు. 

తర్వాత ఏం జరగనుంది ? 

ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఇకనుండి దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన కుటుంబాలు ఒకే దగ్గర నిర్బంధించబడతాయి. అయితే నిర్బంధ కాలపరిమితి మాత్రం ఇక్కడ పేర్కొనబడలేదు. అయితే ఇది పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులను విచారణలో ముందువరుసలో నిలుపనుంది. సున్నా సహనం (zero tolerance) విధానమే ఇక్కడ కూడా వర్తించనుంది. 

రిపబ్లికన్ల మెజారిటీ ఉన్న U.S. కాంగ్రెస్ ఈ సమస్యను పరిష్కరించడానికి కొత్త చట్టాల్ని ఆమోదించే విషయాన్ని పరిశీలిస్తోంది. కుటుంబాలను వేరు చేసే విధానాన్ని నిలిపివేయడానికి మరియు ఇతర ఇమ్మిగ్రేషన్ సమస్యలను పరిష్కరించేందుకు రెండు బిల్లులపై సభలో గురువారం ఓటింగ్ జరపాలని  ప్రణాళికలు సిద్ధం చేసింది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post