కృష్ణా నదిలో టెలిమెట్రీ పరికరాలు పనిచేయటం లేదు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతి ఏటా కృష్ణాజలాల పంపిణీపై వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాలకు చెక్ పెట్టేందుకు, ఎవరెంత నీటిని వాడుకున్నారో ఖచ్చితమైన లెక్కలు కట్టేందుకు కృష్ణా నదీ బోర్డు టెలిమెట్రీ పరికరాలు అమర్చింది. అయితే ఈ పరికరాలు పని చేయటం లేదు. దీనితో నీటి డిశ్చార్జ్ కొలవటానికి సైడ్‌లుకింగ్ డాప్లర్ కరంట్ ప్రొపెల్లర్ (ఎస్సెల్డీసీపీ) అనే వేరే రకం పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. 

గురువారం కృష్ణా బోర్డు కార్యాలయంలో ఇరు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు, ముగ్గురు ప్రతినిధులు, బోర్డు చైర్మన్ సాహూ అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా టెలిమెట్రీపైనే చర్చించారు. రెండు రాష్ట్రాల్లోని కృష్ణా ప్రధానప్రాజెక్టుల పరిధిలో మూడువేల క్యూసెక్కులకు పైగా నీటి విడుదల ఉన్న ప్రతిచోటా డాప్లర్ పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూరాల, నెట్టెంపాడు, కల్వకుర్తి, కేసీ కెనాల్, సాగర్ ఎడమ, కుడి కాల్వలు, కృష్ణా డెల్టా ఇలా ప్రతి చోటా ఈ కొత్త పరికరాలను ఏర్పాటు చేయనున్నారు.  గుంటూరు చానెల్ దగ్గర , ఈస్ట్, వెస్ట్ చానెల్స్ దగ్గర కూడా ఇవి ఏర్పాటవనున్నాయి. మరో ఆరు పాయింట్ల వద్ద కేంద్ర జలసంఘం మీటర్‌గేజ్‌లు ఉన్నందున సీడబ్ల్యూసీ నుంచి తామే స్వయంగా వివరాల్ని తీసుకుంటామని బోర్డు స్పష్టంచేసింది. 

ఇక పోతిరెడ్డిపాడు విషయంలో బనకచర్ల వద్ద పరికరాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఇంజినీర్లు పట్టుబట్టారు. హెడ్‌రెగ్యులేటర్‌కు తక్కువ దూరంలోనే ఇవి ఏర్పాటు చేయడం వల్ల నీటిలెక్కలు ఖచ్చితంగా వస్తాయని సమావేశానికి హాజరైన సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చి స్టేషన్ (CWPRS) శాస్త్రవేత్త వీఎన్ కట్టే వీరికి మద్దతు ఇచ్చారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post