గ్రామ పంచాయతీలకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చు విషయంలో ఎలక్షన్ కమిషన్ భారీగా వెసులుబాటు కల్పించింది. సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు మెంబర్లుగా పోటీ చేసే వారికీ కొత్త పరిమితులను నిర్ణయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం రోజున నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ కొత్త నోటిఫికేషన్ ప్రకారం అయిదు వేల జనాభా కంటే తక్కువ ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థికి 1.50 లక్షల రూపాయలు (గతంలో 40 వేలు), వార్డు సభ్యుడిగా బరిలో ఉన్న వారు 30 వేల రూపాయల (గతంలో 6 వేల) వరకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అయిదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి 2.50 లక్షల రూపాయల (గతంలో 80 వేల) వరకు ఖర్చు చేసే అవకాశం కల్పించింది. ఇలాంటి గ్రామాల్లో వార్డు సభ్యుడు గరిష్టంగా 50 వేల రూపాయలు (గతంలో 10 వేల) ఖర్చు చేయవచ్చు.
ప్రభుత్వం ఆమోదించిన పంచాయతీరాజ్ చట్టంలోని కొత్త నిబంధనల ప్రకారం ఈ విధంగా పెంచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ పరిమితులకు 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోనున్నట్లు ప్రకటించింది.
అభ్యర్థులందరూ నామినేషన్ వేయటానికి ముందే ఎన్నికల ఖర్చు లెక్కలకు సంబంధించి ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్ ప్రారంభించాలి. నామినేషన్ వేసిన రోజు నుంచి రోజువారీగా లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. నియమావళి ప్రకారం, పోటీ చేసిన వారందరూ అంటే గెలిచినా, ఓడినా సరే ఎన్నికలు ముగిసిన నలభై రోజుల్లోగా తమ తమ ఖర్చు వివరాలను ఎన్నికల అధికారులకు సమర్పించ వలసి ఉంటుంది. ఈ గడువులోపు వివరాలను సమర్పించని వారికి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ షార్ట్ నోటీసు జారీ చేస్తుంది. ఈ నోటీసు జారీ అయిన ఇరవై రోజుల్లోగా సమాధానం తో పాటు వివరాలు సమర్పించాలి. లేకుంటే నిబంధనల ప్రకారం మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుంది.
Post a Comment