అరణ్యక గౌరీ వ్రతం

జ్యేష్ఠ మాసములో శుక్ల పక్ష షష్ఠి రోజున ప్రజలు ఎక్కువగా తిరగాడని అరణ్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు తోటి ముత్తైదువులతో కలిసి గౌరీ దేవిని పూజించటమే అరణ్యక గౌరీ వ్రతం.

జ్యేష్ఠ మాసములో శుక్ల పక్ష షష్ఠి రోజున ప్రజలు ఎక్కువగా తిరగాడని అరణ్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు తోటి ముత్తైదువులతో కలిసి గౌరీ దేవిని పూజించటమే అరణ్యక గౌరీ వ్రతం. గౌరీ దేవికి అరణ్యాలంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆమెకు ఉన్న కదంబ కాననావాసా, వన సంచార కుశలా,  అశోక వనికాప్రియ లాంటి పేర్లు  స్పష్టం చేస్తాయి.

వ్రత విధానం 

అరణ్యక గౌరీ వ్రతాన్ని స్త్రీలు లేక దంపతులు కలిసి ఆచరించవచ్చు. వ్రతంనాటి ముందురోజు రాత్రి ఉపవాసం ఉండి పవిత్రంగా గడపాలి. వ్రతంనాటి తెల్లవారుఝామున తలస్నానం చేసి మనుషులు ఎక్కువగా సంచరించని అరణ్య ప్రాంతం చేరుకోవాలి. ఒక చెట్టును ఎన్నుకుని దాని మొదలును శుభ్రపరిచి అలికి ముగ్గులు వెయ్యాలి. తర్వాత బియ్యం పోసి దానిపై పసుపుతో గౌరీ దేవిని నెలకొల్పుకోవాలి. ముందుగా వినాయక పూజ చేసి, తర్వాత విధి విధానాలతో గౌరీ దేవి పూజ చేయాలి. అనంతరం ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ వ్రతాన్ని జీవితాంతం ఆచరించవచ్చు.

 అరణ్యక గౌరీ వ్రత కథ 

ఈ వ్రతం ఆచరణలోకి రావడం వెనుక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. పూర్వం మధుర ప్రాంతాన్ని చంద్రపాండ్యుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు.  ఆయన భార్య కుముద్వతి. భర్తకు తగ్గ ఇల్లాలు. చంద్ర పాండ్యుడు దైవభక్తి పరాయణుడు. పార్వతీదేవి భక్తుడు. నిత్యం శివ పార్వతులను పూజిస్తూ ఉండేవాడు. దీనితో రాజ్యం సుభిక్షంగా ఉండేది. ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగించేవారు. చుట్టు పక్కల రాజ్యాలను కూడా జయించి రాజ్య విస్తరణ చేసాడు. ప్రజలు ఆయనను గొప్ప పాలకుడు అని ప్రశంసించడం మొదలుపెట్టారు. ఈ పొగడ్తల వల్ల, విజయాల వల్ల ఆయనలో అహంకారం, గర్వం పెరిగింది. ఈ భూప్రపంచంలో తనకు మించిన పాలకుడు, బలశాలి లేడని విర్రవీగసాగాడు. దానితో రాను రాను రాజులో దైవభక్తి సన్నగిల్లింది. పూజలు చేయడం మానివేసాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత వరుసగా రెండు సంవత్సరాల పాటు రాజ్యంలో కరువు ఏర్పడింది. ప్రజలు ఆహారానికి తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితులలో శత్రువులు రాజ్యంపై దండయాత్రలు చేయడం ప్రారంభించారు. కరువు కాటకాల వల్ల తగిన ఆర్థిక వనరులు లేకపోవటంతో దండయాత్రలు ఎదుర్కోవటం కష్టమైంది. చివరకు చంద్రపాండ్యుడు శత్రువుల చేతిలో ఓడిపోయి, రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలయ్యాడు. ఆయన తన భార్య కుముద్వతితో అడవులలో కష్టంగా జీవనం గడపసాగాడు. కొన్ని రోజుల తర్వాత అడవిలో కూడా ఆహారం, నీరు దొరకడం కష్టమైంది. చంద్రపాండ్యుడు దాహంతో స్పృహ కోల్పోయే స్థితికి వచ్చాడు. దీనితో అతని భార్య ఆయనను ఒక చెట్టు కింద కూర్చోబెట్టి ఆహారం, నీళ్ల కోసం అడవిలో చుట్టుపక్కల గాలించడం ప్రారంభించింది.  కొంత దూరం వెళ్లిన తర్వాత ఆమెకు ఒక ఆశ్రమం కనిపించింది. అందులోకి వెళ్లి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షికి నమస్కరించి తమ దీనగాథను వివరించింది. వారి పరిస్థితికి చలించిన మహర్షి తన శిష్యులను పంపి చంద్రపాండ్యున్ని ఆశ్రమానికి పిలిపించుకున్నాడు. వారికి తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి, తనకున్న దూర దృష్టి ద్వారా జరిగిన విషయాన్నంతా గ్రహించాడు. వారికి గౌరీ దేవి ఆశీస్సులు లోపించటమే దీనికి కారణమని గుర్తించి, రాజ దంపతులతో జ్యేష్ఠమాస శుక్లపక్ష షష్ఠి రోజు గౌరీ దేవి వ్రతం ఆచరింపచేసాడు.

అక్కడ శత్రువుల పరమైన మధురలో రాజ్య పాలన అస్తవ్యస్తంగా తయారైంది. దీనితో ప్రజలందరూ చంద్రపాండ్యుడు రాజ్యానికి రావాలనే కోరుకుంటున్నారు. కొంతకాలం ఆశ్రమ వాసం తర్వాత చంద్రపాండ్యుడు రాజ్యానికి రాగానే ప్రజలందరూ పెద్ద మద్ధతుతో అతనిని ఆహ్వానించారు. దీనితో అతని శత్రువులు భయపడి రాజ్యం విడిచి పారిపోయారు. అప్పటినుండి రాజదంపతులు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుక్ల పక్ష షష్ఠి రోజు అరణ్యక గౌరీ వ్రతం చేయసాగారు. 

వ్రత ఫలం 

అరణ్యక గౌరీ వ్రతాన్ని ఆచరించటం వలన దరిద్రం దరి చేరదు. కరువు కాటకాలు సంభవించవు. అన్న పానీయాలకు లోటు ఉండదు. ఇప్పుడు ఈ పూజా సాంప్రదాయం చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయింది. ఒక రోజంతా అడవిలో గడపటం శరీరాన్ని, మనసును ఆహ్లాద పరుస్తుంది. 
Labels:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget