దానం నాగేందర్ - హైదరాబాద్ లో ప్రముఖ రాజకీయ నాయకుడు. సిద్ధాంతాలు, విధేయత లాంటివి మచ్చుకైనా కనిపించని నయా తరహా రాజకీయ వేత్త. ఏ పార్టీలో అయినా చేరి తన అవసరాలు తీర్చుకోగల ప్రతిభాశాలి. వ్యక్తిగతంగా ఈయన వ్యవహారం వీధి స్థాయి రౌడీలా ఉంటుంది.
మొదటి నుండి ఈయన రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిద్దాం.
మొదట జనార్దన్ రెడ్డి (పిజెఆర్) అనుచరుడిగా పేరుపొంది ఆయన వెనక తిరిగేవాడు. ఆయన చలవ వల్లే రాజకీయాలలోకి ప్రవేశించాడు. ఆ కాలంలో మర్రి చెన్నారెడ్డి (మాజీ ముఖ్య మంత్రి ), జనార్దన్ రెడ్డి (పిజెఆర్) లు హైదరాబాద్ కాంగ్రెస్ రాజకీయాలను శాసించేవారు.
మొదటిసారి 1994 లో ఆసిఫ్ నగర్ అసెంబ్లీ టికెట్, దానం నాగేందర్ కు దక్కడంలో పిజెఆర్ కీలక పాత్ర వహించాడు. 1994 లో ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రాజకీయాలలోకి ప్రవేశించాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే కావటంతో తిరిగి 1999 లో టికెట్ దక్కించుకుని విజయం సాధించాడు.
మొదటి నుండి ఆసిఫ్ నగర్ రాజకీయాలు వేరుగా ఉండేవి. ముస్లిములందరూ ఎంఐఎంకు, హిందువులందరూ పార్టీలకతీతంగా బలమైన కాండిడేటుకు వేసేవారు. అది ఆయనకు 1999 లో తెలుగుదేశం ప్రభంజనాన్ని అడ్డుకుని విజయం సాధించటానికి తోడ్పడింది. అయితే 2004 లో పరిస్థితులు ఆయనకు అడ్డం తిరిగాయి. కాంగ్రెస్, ఎంఐఎం అవగాహనలో భాగంగా ఆసిఫ్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని ఎంఐఎం కు వదిలివేయటంతో ఆయనకు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు.
ఆ స్థానం లో పోటీ చేయటం ఇష్టం లేని దానం, కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి తెలుగు దేశం నుండి ఆసిఫ్ నగర్ టికెట్ దక్కించుకుని పోటీలో నిలబడ్డాడు. ఇక్కడే ఆయనకు పిజెఆర్ తో విభేదాలు మొదలయ్యాయని అంటారు. ఆయనను కాంగ్రెస్ లోనే ఉంచడానికి పిజెఆర్ ప్రయత్నించినా వినకపోవడం తో ఈ స్పర్థ మొదలయ్యిందని చెప్పుకుంటారు.
దానం నాగేందర్, 2004 లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించాడు, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ ది మరో తరహా వ్యక్తిత్వం. తాను తప్ప కాంగ్రెస్ లో మరో బలమైన నాయకున్ని ఆయన సహించేవారు కాదు. అప్పటికే హైదరాబాద్ లో బలంగా ఉన్న పిజెఆర్ కు మంత్రి పదవి ఇవ్వకుండా ఆయన వ్యతిరేకులను దువ్వడం ప్రారంభించాడు. ఆయన దృష్టిలోకి నాగేందర్ రావటం తో అవకాశం కోసం వేచి చూస్తున్న ఈయన కూడా తెలుగు దేశం పార్టీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాడు. అప్పటికి ఇంకా వేరే పార్టీ ఎమ్మెల్యేగా ఉండి మంత్రి పదవులు అందుకునే సంస్కృతి రాలేదు. దానితో రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళాడు. కానీ ఎంఐఎం చేతిలో ఓడిపోవటంతో ఫలితం దక్కలేదు.
2009 నాటికి పరిస్థితులు మరింతగా మారాయి. అప్పటికి పిజెఆర్ మరణించారు. అసిఫ్ నగర్ లో కూడా ముస్లిం జనాభా పెరగడం తో గెలవడం కష్టం అనే నిర్ణయానికి నాగేందర్ వచ్చేసారు. అప్పుడు వైఎస్ చలవతో పిజెఆర్ కుమారుడు ఆశించినప్పటికీ, ఆయన కంచుకోట అయిన ఖైరతాబాద్ స్థానంలో పార్టీ టికెట్ దక్కించుకున్నాడు. అక్కడ గెలుపొంది మొదటిసారిగా మంత్రివర్గంలో ఆరోగ్య శాఖా మంత్రిగా చోటు దక్కించుకున్నాడు. ఇది పిజెఆర్ కుమారునికీ, ఇతర కుటుంబీకులకు మనస్థాపం కలిగించింది. దీనిని వారు వెన్నుపోటుగా భావించారు.
మంత్రి వర్గంలో స్థానం దక్కడంతో ముఖ్యమంత్రుల ఆకాంక్షలకు అనుగుణంగా కరడుగట్టిన తెలంగాణా వ్యతిరేకిగా పేరుపొందాడు. అయితే ఆయన రాజకీయ గురువు పిజెఆర్, తెలంగాణ మద్ధతుదారు కావటం విశేషం. తెలంగాణా వ్యతిరేకతే అర్హతగా వైఎస్ మరణం తర్వాత రోశయ్య మంత్రివర్గం లోనూ కొనసాగాడు.
ఉద్యమ సమయంలో అయితే హైదరాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకమెవరు అంటే దానం నాగేందర్ ప్రముఖంగా కనిపించేవాడు. ఆయన ఉద్యమ కారుల మీద చేసిన దాడులు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి.
తెలంగాణా వ్యతిరేకి గా పేరుపొంది, అసెంబ్లీలోనూ వీధి స్థాయి రాజకీయ నాయకుడిలా వ్యవహరించే ఇతను (ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ టిక్కెట్ కోసం అని అంటున్నారు) టీఆర్ఎస్ లో చేరాడు. అసెంబ్లీ టిక్కెట్ కోసం మంత్రి పదవికోసం 2004లో అప్పటికప్పుడు రెండు పార్టీలను మార్చిన ఇతను ఇప్పుడు పదవుల కోసం టీఆర్ఎస్ లో చేరలేదు అంటూనే బీసీ పల్లవి అందుకున్నాడు.
ఇలా ఆయన
- 2004 లో రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెసును కాదని తెలుగు దేశంలో చేరాడు.
- కోరుకున్న అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చిన తెలుగు దేశాన్ని నెలలోపే వదిలివేసాడు.
- రాజకీయ గురువు అయినా జనార్దన్ రెడ్డిని కాదని వైస్సార్ వర్గంలో చేరాడు.
- 2009 లో పిజెఆర్ కుటుంబీకులకు వెన్నుపోటు పొడిచి ఖైరతాబాద్ స్థానం దక్కించుకున్నాడు.
- 2018 లో కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకించిన తెరాస లో చేరాడు.
ఇక ఇప్పుడు బీసీలను తెరాసను ఏం చేస్తాడో వేచి చూడాలి.
Post a Comment