నీతి ఆయోగ్‌ సమావేశం

భారత ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ పాలకమండలి (గవర్నింగ్‌ కౌన్సిల్‌) నాలుగో సమావేశం ఆదివారం ఉదయం న్యూ ఢిల్లీ లోని  రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో  ప్రారంభమైంది.  సాయంత్రం నాలుగు గంటల వరకు సమావేశం కొనసాగనుంది. గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా ఉన్న ప్రధాని సహా, సభ్యులైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ , నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్‌ గురువారమే ఢిల్లీకి చేరుకోగా, చంద్రబాబు శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. కానీ గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. 

ఈ సమావేశ అజెండా 

గత సమావేశ నిర్ణయాల అమలు
 రైతుల ఆదాయం రెట్టింపు చేయటం 
 ఆయుష్మాన్‌ భారత్
 పోషణ్‌ మిషన్
 మిషన్‌ ఇంద్రధనుష్
మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు 

సమావేశం లో మోడీ ప్రసంగం 

ఈ సమావేశంలో  మోడీ ప్రారంభోపన్యాసం చేశారు.  సందర్భంగా సమావేశానికి హాజరైన వారందరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలియచేసారు.  జీఎస్టీ అమలు విషయంలో  రాష్ట్రాల పాత్ర ఆమోఘమని ప్రధాని కొనియాడారు.  పోటీతత్వంతో కూడిన సమైక్య స్ఫూర్తి వలననే అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో వనరులకు ఎలాంటి కొదవ లేదని, వాటిని సరైన రీతిలో వినియోగించుకోవాలని సూచించారు. గత త్రైమాసికం లో సాధించిన 7.7% వృద్ధి శుభ సూచకమనీ, రెండంకెల వృద్ధి సాధించే సత్తా భారత్ సొంతమనీ వ్యాఖ్యానించారు. 

ఇంకా నరేంద్ర మోడీ  విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, జిల్లాల  అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. జన్‌ధన్‌ యోజన, ముద్రబ్యాంకు రుణాల పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్ట పరిచాయని వివరించారు. గత ప్రభుత్వ హయాము చివరి సంవత్సరం లో రాష్ట్రాలకు ఆరు లక్షల కోట్లు కేటాయించగా, ఈ సంవత్సరం ఆ మొత్తం పదకొండు లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు.  వరదలతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. 

సమావేశం లో కేసీఆర్‌ ప్రసంగం 

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా నీతి ఆయోగ్ సమావేశానికి ఆహ్వానించినందుకు ప్రధాని నరేంద్రమోడీకి, సభాసదులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో వ్యవసాయరంగ సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామనీ, రాష్ట్రంలో 98% బడుగు రైతులే ఉండటంతో రైతుబంధు పేరుతో ఎకరాకు పంటకు నాలుగు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నామనీ , రైతు బంధు పథకం రుణ లభ్యత, వ్యవసాయోత్పత్తుల ధరలు, పంటల సాగుపై ఎలాంటి ప్రభావం చూపదనీ ప్రసంగించారు. అలాగే రైతు భీమా యోజన ద్వారా 18 ఏళ్ల నుండి 60ఏళ్ల లోపు ఉన్న రైతులకు 5లక్షల రూపాయల భీమా సౌకర్యంకల్పించామని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు. రైతు భీమా ప్రీమియం క్రింద ప్రభుత్వమే ఏటా వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించనుందని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతున్న ఈ పథకంతో 50లక్షల మంది రైతులకు భీమా కల్పించబోతున్నామని పేర్కొన్నారు.   

భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకత కోసం భూ రికార్డుల ప్రక్షాళన జరిపామనీ, 17రకాల సెక్యూరిటీ ఫీచర్లతో 50లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేశామని వివరించారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అత్యాధునిక పద్ధతులను అవలంభిస్తున్నామనీ, ఇవి అందుబాటులోకి వస్తే అదనంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే రైతుల కోసం గత మూడు సంవత్సరాలలో  1,050 కోట్ల రూపాయల వ్యయంతో 18.30 మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల 356 గోడౌన్లు నిర్మించినట్లు తెలిపారు. వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలైన డెయిరీ పరిశ్రమ, పౌల్ట్రీ, మేకలు, గొర్రెలు, చేపలపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలనీ, ఆయా రంగాలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలనీ కోరారు. జాతీయ ఉపాధీ హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానించాలని కేసీఆర్ సూచించారు. 

విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, అంతర్జాతీయ అంశాలపై కేంద్రం మరింత దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉండటంతో  విద్య, వైద్యం, నగరీకరణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర అంశాల్లో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛనివ్వాలని, ఈ అంశాలు రాష్ట్రాలకే వదిలివేయాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ అభ్యర్థించారు.

సమావేశం లో చంద్రబాబు నాయుడు ప్రసంగం 

శనివారమే ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నాయుడు నలుగురు బీజేపీ వ్యతిరేక ముఖ్యమంత్రులతో కలిసి కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నదనీ, అవసరమైతే ఈ సమావేశాన్ని బహిష్కరిస్తామనీ కలకలంరేపారు. పత్రికలలో కూడా విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో తలపడే అవకాశం ఉందనీ వార్తలు రావటంతో ఏం జరుగుతుందో అన్న ఆసక్తిని కలిగించారు. అయితే సమావేశ సమయంలో ఇరువురు నేతలు పరస్పరం చేతులు కలుపుకుని సుహృద్భావముతో కనిపించారు.  అనంతరం కొద్దిసేపు ఇరువురు ప్రత్యేకంగా సమావేశం అయినట్లు సమాచారం. 

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి  అక్షరక్రమం ప్రకారం అందరికన్నా ముందుగా మాట్లాడే అవకాశం లభించింది.

ఏక పక్ష విభజన తో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనీ, విభజన తర్వాత కూడా రాష్ట్రానికి న్యాయం జరగలేదని చంద్రబాబు ప్రసంగించారు. ఆదాయం విషయంలో ఏపీ సేవారంగం వృద్ధిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. 

విభజన చట్టంలోని అంశాలు, ఇచ్చిన హామీలు కేంద్రం నెరవేర్చాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావస కల్పనలతో సహా  పూర్తయ్యేందుకు కావాల్సిన మొత్తం నిధులు సమకూర్చాలని కోరారు. అలాగే రాజధాని నిర్మాణానికి కూడా భారీ నిధులు అవసరమనీ,  రెవెన్యూలోటు, రాష్ట్రానికి రైల్వే జోన్‌  విషయాలలో గతంలో ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు. కేంద్ర సహాయం లేకున్నా నాలుగేళ్లలో ఏపీ సొంతంగానే అభివృద్ధి చెందిందన్నారు.  అంతేకాక 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో 2011 జనాభా లెక్కలను పరిగణించవద్దని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 

అలాగే జీఎస్టీ తో రాష్ట్ర ప్రయోజనాలు  దెబ్బతిన్నాయనీ, స్థానికంగా పన్నులు విధించే వెసులుబాటు లేకుండా పోయిందనీ పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు అనంతరం ఉత్పన్నమైన నగదు కొరత సమస్యను కేంద్రం ఇంకా పరిష్కరించలేదని విమర్శించారు. పక్కనున్న రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చేవరకూ ఏపీకి ప్రత్యేక హోదానివ్వాలని కోరారు. రాష్ట్రానికి పదేళ్లపాటు హోదా కావాలని ఆరోజు అడిగింది భాజపా నేతలేనని గుర్తుచేశారు.

చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకున్న హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 

నీతి ఆయోగ్‌ సమావేశంలో చంద్రబాబు దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించారు. కానీ 7 నిమిషాల ప్రసంగం తరువాత చంద్రబాబు ప్రసంగాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అడ్డుకున్నారు. ఇచ్చిన సమయం ముగిసిందని చెబుతూ ఇక ప్రసంగాన్ని ఆపాలని చెప్పారు. ఏపీ సమస్యలు ప్రత్యేకమైనవంటూ చంద్రబాబు ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్‌ను బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ సమర్థించారు. బిహార్‌కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ట్విట్టర్ కామెంట్స్ 

0/Post a Comment/Comments

Previous Post Next Post