గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్(85) ఇవాళ తుదిశ్వాస విడిచారు.
వరంగల్ జిల్లాలోని మట్టెవాడ లో 1932 వ సంవత్సరం, డిసెంబర్ 28 వ తేదీన వేణుమాధవ్ జన్మించారు. ఆయన తల్లిదండ్రుల పేర్లు శ్రీహరి మరియు శ్రీలక్ష్మీ. ఆయన భార్య పేరు శోభావతి. నేరెళ్లకు నలుగురు సంతానం. పెద్దబ్బాయి శ్రీనాథ్, రెండో సంతానం. లక్ష్మీ తులసి , మూడవ కూతురు వాసంతి, నాలుగవ కుమారుడు రాధాకృష్ణ. కాగా వీరిలో కుమార్తె లక్ష్మీ తులసిని మిమిక్రీ కళాకారిణిగా తీర్చిదిద్దారు. లక్ష్మీ తులసి కొన్ని ప్రోగ్రామ్‌లు కూడా ఇచ్చింది.
తన పదహారేళ్ల వయసులోనే అంటే 1947 లో మిమిక్రీ ని వృత్తి గా ఎంచుకున్నారు. ఆయన తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ మరియు తమిళ భాషలలో ప్రదర్శనలు ఇచ్చేవారు. దేశవిదేశాల్లో ఆయన అనేక ప్రదర్శనలు ఇచ్చారు.
చిన్నప్పుడు తన అభిమాన నటుడు చిత్తూరు నాగయ్యను అనుకరిస్తూ మిమిక్రీ నేర్చుకోవటం మొదలుపెట్టాడు. రేడియోలోనే వినిపించిన గొంతులను ప్రాక్టీస్ చేసి ఆ నాయకులకే వినిపించి ఆశ్యర్యపరిచేవాడు. టెన్ కమాండ్మెంట్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లోని ధ్వనుల అనుకరణ నేరెళ్ల కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.
చిన్నప్పుడు తన అభిమాన నటుడు చిత్తూరు నాగయ్యను అనుకరిస్తూ మిమిక్రీ నేర్చుకోవటం మొదలుపెట్టాడు. రేడియోలోనే వినిపించిన గొంతులను ప్రాక్టీస్ చేసి ఆ నాయకులకే వినిపించి ఆశ్యర్యపరిచేవాడు. టెన్ కమాండ్మెంట్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లోని ధ్వనుల అనుకరణ నేరెళ్ల కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.
మిమిక్రీ కళ అభివృద్ధికి నేరెళ్ల వేణుమాధవ్ ఎంతో కృషి చేసారు. మిమిక్రీలో వినూత్న ప్రయోగాలతో కొత్త కొత్త ప్రక్రియలు రూపొందించారు. మిమిక్రీ డిప్లొమా కోర్సును పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ప్రారంభించేందుకు ఆయన చాలా కృషి చేశారు. ఆ తర్వాత తెలుగు వర్సిటీలో మిమిక్రీ అధ్యాపకుడిగా సేవలందించారు. మిమిక్రీ కళ అనే పుస్తకం కూడా రాసారు. ఎంతోమంది శిష్యులను ఆయన తయారు చేసి భావి తరాలకు అందించారు. నేరెళ్ల ప్రతిభకు మెచ్చి శివదర్పణం సంపుటిని కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఆయనకు అంకితమిచ్చారు. నేరెళ్లపై ఐవీ చలపతిరావు, పురాణం సుబ్రమణ్యశర్మలు కూడా పుస్తకాలు రాసారు.
ఆయన పుస్తకం గురించి ఆయన మాటల్లోనే
"ఇమిటేట్ చేసే అలవాటు నాకు చిన్నతనం నుంచే అలవాటైంది. ఇంట్లో బంధువులు అంతా కూర్చున్నప్పుడు వాళ్ల గొంతులు వాళ్లకే వినిపించేవాడిని. వాళ్లెట్లా మాట్లాడితే అట్లానే మాట్లాడేది. బజారులో ఉండే వాతావరణాన్ని ఇంట్లో వినిపించేవాడిని. అలా అది మిమిక్రీ అని తెలియకుండానే అదే ప్రపంచంగా బతికాను. దాన్నే నేను సర్వస్వంగా భావిస్తాను ఇప్పటికీ. నేను చాలామంది నటుల్ని, పండితుల్ని, పామరుల్ని అందరినీ అడిగాను. కానీ మిమిక్రీ అంటే ఇలా ఉంటుందని ఎవరూ చెప్పలేదు. మిమిక్రీ ఒక శాస్త్రం. ఒక కళను శాస్త్రబద్ధంగా రాస్తే అది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. అప్పుడు మొదలుపెట్టాను మిమిక్రీ శాస్త్రబద్ధం చేయాలనే ప్రయత్నాన్ని. అది సఫలం అయింది."
వేణుమాధవ్ పుట్టిన రోజు డిసెంబర్ 28 ని ప్రపంచ మిమిక్రీ కళాకారుల దినోత్సవంగా ఆయన శిష్యులు జరుపుకుంటున్నారు. 1971లో పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేణుమాధవ్ ఎమ్మెల్సీగా నియమింపబడ్డారు.
నేరెళ్ల వేణుమాధవ్ ప్రత్యేకతలు
- మిమిక్రీ తో పాటు వెంట్రిలాక్విజం లోనూ అసమాన ప్రతిభావంతుడు
- ఐక్య రాజ్య సమితి (న్యూయార్క్) లో ప్రదర్శన ఇచ్చిన తొలి మిమిక్రీ కళాకారుడు
- ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీతో పాటు ఇగ్నోల నుండి గౌరవ డాక్టరేట్లు
- తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు తెలంగాణ రికార్డుల పుస్తకం ఆధ్వర్యంలో జీవితకాల సాఫల్య పురస్కారం
- వేణుమాధవ్ చిత్రంతో పోస్టల్ స్టాంప్
- పద్మ శ్రీ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణం పేరుతో వరంగల్ లో ఆడిటోరియం
- వరంగల్ లో ఒక వీధి డాక్టర్ నేరెళ్ల వేణు మాధవ్ మార్గ్ అని పేరు
- వరంగల్ లో ఒక వీధి డాక్టర్ నేరెళ్ల వేణు మాధవ్ మార్గ్ అని పేరు
- నేరెళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ ను స్థాపించి వర్ధమాన కళాకారులకు చేయూతనిచ్చారు
నేరెళ్ల వేణుమాధవ్ పొందిన అవార్డులు
- 2001 లో భారత ప్రభుత్వం నుండి పద్మ శ్రీ పురస్కారం
- 1981 లో శ్రీ రాజ - లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు
- 1978 లో ఆంధ్రా యూనివర్సిటీ నుండి కళా ప్రపూర్ణ పురస్కారం
నేరెళ్ల వేణుమాధవ్ నిర్వహించిన ముఖ్యమైన పదవులు
- ఎం.ఎల్.సీ (1972-78)
- ఎఫ్.డీ.సీ డైరెక్టర్ (1976-77)
- సంగీత నాటక అకాడమీ సభ్యుడు (1974-78)
- సౌత్ జోన్ కల్చరల్ కమిటీ, తంజావూరు సభ్యుడు
- దూరదర్శన్ ప్రోగ్రాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-94)
- టెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-96)
- రైల్వే జోనల్ యూజర్స్ కమిటీ సభ్యుడు (1993-96)
- ఎ.పి.లెజిస్లేటివ్ లైబ్రరీ కమిటీ సభ్యుడు (1972-75)
- రవీంద్రభారతి కమిటీ సభ్యుడు (1974-78)
- ప్రభుత్వ అకాడమిక్ రివ్యూ కమిటీ సభ్యుడు (1975-76)
వేణుమాధవ్ బిరుదులు
ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్, కళా సరస్వతి, స్వర్‌కే రాజా, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, ధ్వన్యనుకరణ చక్రవర్తి, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ
ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది కళారంగానికి తీరని లోటు అని ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారనీ పేర్కొన్నారు. మిమిక్రీ కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిన వ్యక్తి నేరెళ్ల అని కొనియాడారు. మిమిక్రీ కళను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా నేరెళ్ల మలిచారు అని గుర్తుచేసుకున్నారు. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ఎస్‌కే జోషికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.
వేణుమాధవ్ పాత మిమిక్రీ వీడియో యూట్యూబ్ నుండి
Post a Comment