సోమవారం రోజు సర్వేజనరల్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మధ్యన నెలకొన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి భేటీ జరిగింది. బళ్లారి రిజర్వ్ ఫారెస్టుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు సుప్రీమ్ కోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో సర్వే జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు, ఇరు రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో కలిసి ఇటీవల సంయుక్తంగా సర్వే చేశారు. సోమవారం రోజు సర్వే జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు తాము ఏవిధంగా సరిహద్దు పాయింట్లను గుర్తించాం? అలా చేయటానికి ప్రాతిపదికలు ఏమిటి? లాంటివి వివరించారు.
ఇవాళ రెండు రాష్ట్రాలు తాము సరిహద్ధు గుర్తించటానికి అభ్యంతరాలేమిటి? వాటికి తమ వద్దనున్న ఆధారాలేమిటి? వంటి విషయాల్లో వాదనలు వినిపించవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖా అధికారులు పాత రాయదుర్గం తాలూకా మ్యాప్‌ను సేకరించి దాని ఆధారంగా సరిహద్దు పాయింట్లను గుర్తించారు. వీటి ఆధారంగా వాదనలు వినిపించనున్నారు.
సరిహద్దు వివాదానికి సంబంధించి పరిష్కారం కొరకు రెండు రాష్ట్రాలు సర్వేజనరల్ ఆఫ్ ఇండియా సూచనలను అంగీకరించవలసి ఉంటుంది. వీరిలో ఎవరు అంగీకరించకపోయినా ఈ వివాదం ముగిసే అవకాశం లేదు. 2010, 2014 సంవత్సరాల్లో కూడా చర్చలు ఇలాగే అసంపూర్తిగా ముగిసాయి.
Post a Comment