కేటీఆర్ ట్విట్టర్ - వ్యవస్థలున్నది ఎందుకు?

కేటీఆర్ మరోమారు తన సందేశంతో ముగ్గురు అనాథ పిల్లలకు దారిచూపారు. తనకు ట్విట్టర్ లో వచ్చిన సందేశానికి స్పందించి కలెక్టర్ కర్ణన్  కు ఆదేశాలు జారీచేసారు. దానికి కలెక్టర్ గారు వారిని విద్యా సంస్థలలో చేర్పించి నగదు సహాయం కూడా చేసారు.

ఇది నిన్నటి నుండి ఈ కేటీఆర్ గారి ఘనతగా వార్త సోషల్ మీడియా లోనే కాకుండా ప్రింట్ మీడియా, టీవీ చానెల్స్ లో కూడా ట్రెండింగ్ లో ఉంది.  ఇంతవరకూ బాగానే ఉంది. ఇలా ఆయన ట్విట్టర్ ద్వారా సహాయం చేసిన వార్త రావటం ఇది మొదటి సారి కాదు. ప్రతి కొన్ని రోజులకు ఒకసారి ఇది వస్తూనే ఉంటుంది. దానికి తగ్గట్లుగా అనుకూల ప్రచారం కూడా జరుగుతూనే ఉంది, ఉంటుంది కూడా. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే.

నాణేనికి రెండో వైపు నుండి చూస్తేనే పరిస్థితి భయానకంగా కనిపిస్తుంది.

కేటీఆర్ గారికి ట్విట్టర్ లో పదమూడు లక్షల మంది కన్నా ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన దృష్టికి ఏదైనా సమస్యను తీసుకుని రావటానికి రోజూ కొన్ని వేల మంది ప్రయత్నం చేస్తుంటారు. వాటిలో నిజంగా ఎన్ని ఆయన దృష్టికి వస్తుంటాయి. ఎన్నింటికని ఆయన ఒక్కడే పరిష్కారం చూపగలడు. మంత్రి గారికి కూడా తన శాఖా పరమైన విషయాలు, వ్యక్తిగత విషయాలు చూసుకోవటానికి సమయం ఉండాలి కదా. 

కేటీఆర్ గారికే ట్వీట్ ఎందుకు చేస్తున్నారు ?

మనకు ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలో తెలియక కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లటం అయినా అయి ఉండాలి.
మనము అడిగితే కలెక్టర్ /కింద వ్యవస్థలు స్పందిచవన్న భావన అయినా మనకు ఉండి ఉండాలి.

కేటీఆర్ గారు, దయ చేసి ప్రభుత్వం లోని సహాయం చేసే వ్యవస్థలకు ప్రచారం కల్పించండి.  మేము స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా, ఏ సమస్యను ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలో తెలియనంత దయనీయ స్థితిలో ఉన్నాము. అలాగే  సమస్యను దృష్టికి తీసుకు వెళ్తే అధికారులు పరిష్కరిస్తారన్న నమ్మకం కూడా కలిగించండి.

ప్రతి గ్రామం లో విలేజ్ అసిస్టెంట్లు ఉన్నారు. వారి పైన రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఎమ్మార్వోలు, ఆర్దీవోలు వారిపైన కలెక్టర్లు మరియు మంత్రిత్వ శాఖా సిబ్బంది కూడా ఉన్నారు. వారందరినీ దాటి కేటీఆర్ గారికి  మొర పెట్టుకోవలసిన అవసరం మాకు ఎందుకు వచ్చింది?

ఇలా అన్నీ మీరే చేయాలనుకున్నప్పుడు మనకు 10 జిల్లాలుంటే ఏమిటి? 31 ఉంటె ఏమిటి ? వికేంద్రీకరణ ఫలితాలు ప్రజలకు ఎప్పుడు అందుతాయి?  మీరు మీ దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరించడం బావుంది. మరోసారి అలాంటి సమస్య వస్తే ఏ జిల్లాలో ఎవరిని సంప్రదించాలో కూడా మీరు షేర్ చెయ్యొచ్చు. 

ఇక పొతే మంచిర్యాల కలెక్టర్ గారికి ట్విట్టర్ ఉంది. వారు మంత్రి గారికి స్పందించారు. బావుంది కానీ ఇలాంటి ట్వీట్లు డైరెక్టుగా మీకే వచ్చేలా, ఇంకా వీలయితే  గ్రామ, మండల స్థాయిల్లోనే యంత్రాంగం ఇలాంటి వాటికి పరిష్కారం చూపేలా, అలాకాకపోతే వారే మీ దగ్గరకు తీసుకు వచ్చేలా ప్రచారం కల్పించుకోండి.

మీరు అందుబాటులో లేకపోవటం / మీ దృష్టికి సమస్యను ఎలా తీసుకెళ్లాలో మీ జిల్లా ప్రజలకు తెలియక పోవటం / కింది స్థాయిలో ఉన్న మీ వ్యవస్థ మీరు చెప్పేవరకు స్పందించకపోవటం. వీటిలో ఏది కారణమైనప్పటికీ అది మీ పాలనా వ్యవస్థ వైఫల్యమే.

మీ జిల్లా సమస్య కేటీఆర్ గారు చేప్పేంత వరకు మీరు పరిష్కరించుకోక పోవటం మీకు అవమానం కాదా?
కేవలం కేటీఆర్ గారు చెప్తేనే ఈ రాష్ట్రంలో పనులు జరుగుతాయా?
సామాన్యులకు మీరు /ఇతర అధికారులు స్పందించరా ?

కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్ గారు, పీయూష్ గోయెల్ గారు కూడా ఈ తరహా సోషల్ మీడియా ప్రచారంలో ఆరితేరిపోయారు. ప్రధాన మంత్రి గారు ఒక స్కూల్ విద్యార్థి లేఖ కు స్పందించటం కూడా ఇదే కోవలోకి వస్తుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post