ఈ సంవత్సరం టెక్సాస్ కు చెందిన విద్యార్థి కార్తీక్ నేమాని (14) స్పెల్లింగ్ బీ విజేతగా నిలిచాడు. ఇతను తన తోటి టెక్సాస్ స్పెల్లర్ న్యాస మోడీ పై విజయం సాధించారు. ఈ సంవత్సరం 516 మంది స్పెల్లింగ్ బీ ఫైనల్స్ లో పోటీపడగా, టాప్ ఫైవ్ లో నిలిచిన వారందరూ ఇండియన్ అమెరికన్లే కావటం విశేషం. గత 22 మంది విజేతలలో భారతీయ మూలాలు కలిగిన వారు 18 మంది ఉన్నారు. గత 11 సంవత్సరాల నుండి గెలిచిన వారందరూ వీరే కావటం విశేషం.
అమెరికా జనాభాలో ఒక శాతానికి లోపే ఉన్న వీరు ఇన్ని సంవత్సరాలుగా అప్రతిహత విజయాలు సాధించటానికి కారణాలేమిటి? నిష్పత్తి ప్రకారం చూస్తే ఇవి అసాధారణమైన విజయాలే. విద్యా సంబంధిత పోటీల్లో తమ నిష్పత్తి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ప్రతిభ కనబరిచే వీరికి స్పోర్ట్స్, అథ్లెటిక్స్ లో అసలు ప్రాతినిధ్యమే లేకపోవటం గమనార్హం.
ఈ విజయాలకు సామాజిక, కుటుంబ పరమైన కారణాలు ఉన్నాయి. ఒక వర్గానికి చెందిన ప్రజలు కొన్ని విషయాల లోనే ఆసక్తి చూపించి వాటిలోనే అసాధారణ విజయాలు సాధిస్తుంటారు. అమెరికన్ వలస విధానాల వల్ల కేవలం అత్యున్నత విద్య, ప్రతిభ కలిగిన భారతీయులకే వీసాలు వస్తున్నాయి. వీరి పిల్లలైన రెండవ తరం భారతీయ అమెరికన్ విద్యార్థుల కుటుంబ వాతావరణం విద్యా సంబంధ విషయాలకే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది.
1999 లో నూపుర్ లాలా స్పెల్లింగ్ బీ లో సాధించిన విజయం స్పెల్ బౌండ్ డాక్యుమెంటరీ గా రావటం, ఈ విజయపరంపర ప్రారంభానికి కారణమని చెప్పవచ్చు. ఇది అనేక మంది ఇండియన్ అమెరికన్ విద్యార్థులను ఆకర్షించింది. 2017 లో వచ్చిన బ్రేకింగ్ ది బీ డాక్యుమెంటరీ కూడా భారతీయ అమెరికన్ పోటీదారులు ఈ స్పెల్లింగ్ బీ కి ఎలా సన్నద్ధమవుతున్నారు. వారికి దోహదం చేస్తున్న అంశాలేమిటి అనే విషయాలను కూలంకుషంగా విశదీకరించింది.
1980 లో నార్త్ సౌత్ ఫౌండేషన్ ప్రారంభమైనప్పుడు అది భారతీయ అమెరికన్ విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందించటం పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. కానీ 1993 నుండి విదార్థులను ఇతర విద్యా సంబంధకమైన పోటీలలో పాల్గొనటానికి సహాయం చేయటం, వాటికి సన్నద్ధం చేయటం ప్రారంభించింది. వీటిలో స్పెల్లింగ్ బీ కి సన్నద్ధం చేయటానికి సౌత్ ఆసియన్ స్పెల్లింగ్ బీ ని ప్రారంభించింది. ఇందువల్ల ఇండియన్ అమెరికన్ సమూహాలు వారిలో వారు పోటీ పడటం, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరికొకరు సహాయం చేసుకోవటం మరియు తర్వాతి సంవత్సరాల పోటీదారులకు ఆసక్తిని కలిగింపచేయటం ప్రారంభించారు. ఇది వీరి విజయాలకు మార్గాలు పరిచింది.
ఇండియన్ అమెరికన్ విజేతలలో ఎవరి మాతృ భాష కూడా ఇంగ్లీష్ కాకపోవటం, అందరూ బహుభాషా కోవిదులు కావటం కూడా మరో విశేషం. వీరందరూ సౌత్ ఏసియన్ స్పెల్లింగ్ బీ లో పాల్గొన్నవారే. దీనిలో సంవత్సరాల తరబడి పాల్గొనటం, గెలిచే వరకూ ప్రయత్నించటం, ఎక్కువ గంటలు కష్టపడే తత్త్వం వీరిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
వలస వచ్చిన వారిలో సహజంగా ఉండే ప్రత్యేకత సాధించాలనే తహ తహ, విజయం సాధించాలనే పట్టుదలలు కూడా కారణాలే. తరతరాలుగా భారతీయులకు జన్యువుల ద్వారా సంక్రమిస్తున్న అసాధారణ ధారణ శక్తి కూడా దీనికి కారణమనే వారు కూడా వున్నారు. ఈ వరుస విజయాల పై జాత్యహంకార ధోరణిలో కామెంట్లు చేసిన వారు కూడా వున్నారు.
గత మే నెలలోనే ముగిసిన నేషనల్ జియోగ్రాఫిక్ బీ లో కూడా ఇండియన్ అమెరికన్ విద్యార్థి వెంకట్ రాజన్ (13) విజయం సాధించారు. తర్వాత రెండు స్థానాల్లో నిలిచిన అనౌష్క బుద్ధికోట్, విశాల్ సారెడ్డి కూడా భారతీయ మూలాలే కలిగి ఉండటం విశేషం. గత ఏడు సంవత్సరాల నుండి ఇండియన్ అమెరికన్లే దీనిని కూడా గెలుస్తూ వస్తున్నారు.
Post a Comment