మాల్దీవ్స్ కు ఎగుమతి అయ్యే అత్యవసర వస్తువుల కోటా తగ్గింపు

మాల్దీవ్స్ కు ఎగుమతి అయ్యే అత్యవసర వస్తువుల కోటా తగ్గింపు
మనదేశం నుండి మాల్దీవ్స్ కు ఎగుమతి అయ్యే అత్యవసర వస్తువుల కోటాను భారత్ తగ్గించింది.  వీటిలో బంగాళదుంపలు, ఉల్లిపాయలు మరియు గుడ్లు ఉన్నాయి. నూతన గణన పద్దతి ద్వారా ఇది నిర్ణయించామని అంటున్నప్పటికీ, రెండు దేశాల మధ్య ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. 

భారత దేశ  నిర్ణయం కారణంగా తమకు అవసరమైన వస్తువుల కొరత  ఏమీ వచ్చే అవకాశం లేదని ఆ దేశ ట్రేడ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ షాహీర్ అన్నారని మాల్దీవియన్ మీడియా ఇటీవల వెల్లడించింది. 1981 లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒక ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, భారతదేశం మాల్దీవుల ప్రభుత్వం తెలియజేసిన అవసరాలకు అనుగుణంగా అత్యవసర వస్తువులను  ఎగుమతి చేస్తుంది.

అయితే విదేశీ వాణిజ్య సంస్థ డైరెక్టరేట్ జనరల్ గత వారం నోటిఫికేషన్లో  ఈ పరిమితులను తగ్గించింది. 2018-19 సంవత్సరానికి సంబంధించిన లెక్కలు నూతన పద్దతిని ఉపయోగించి నిర్ణయించామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతి సంవత్సరం  అవసరమైన వస్తువుల జాబితాను వారు మనకు పంపుతారు. ఈ సంవత్సరం పంపించలేదు కాబట్టి గత మూడు సంవత్సరాల సరాసరిని పరిమితిగా నిర్ణయించామని తెలిపారు.  ఇదేమీ ప్రతీకార చర్య కాదని కూడా వ్యాఖ్యానించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post