నా బిడ్డ పువ్వులాంటోడు, ఆడ్ని కోసి గుడ్డసుడతానంటే సూత్తా ఊరుకుంటానా. మీ దగ్గర ఏవేవో పెద్ద పెద్ద మిసన్లుంటాయ్ కదా... ఆడ్ని మల్లా తిరంగా సూడండి, బిడ్డ ఎక్కడికీ పోడు. మా బుడ్డోడు బతికే ఉన్నాడు. మా ఊరి దేవర ఆడికి పెద్ద ఉజ్జోగం వత్తాదన్నాడు. యారా దొన్ని. సెప్పాడా? లేదా...? ఓరే... ఆలకి సెప్పు మట్టి పిసికిన సేతులివి. నా బిడ్డ జోలికొచ్చారో. ఒకొక్కడిపని సెప్తాను. సుబ్బి లేవరా. నిన్ను కోసెత్తారంట నాన్నా. ఏమనుకుంటున్నార్రా వీళ్లు రాజుగాడంటే.
చనిపోయిన కుమారుడిని పోస్ట్ మార్టం కు తీసుకెళుతుంటే ఇలా అడ్డుకున్న అమాయకపు తండ్రి ఆక్రందన హాస్పిట ల్ లో ఉన్న వారందరినీ కదిలించింది. చివరకు అతని సోదరుని సహాయం తో సర్ది చెప్పగలిగారు.
విశాఖపట్నం జిల్లాలోని గిరిజన గ్రామానికి చెందిన పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న బోడెం సుబ్బారావు అనే బాలుడు, ఈ నెల 17న నేరేడు పండ్ల కోసం చెట్టుఎక్కి కిందపడ్డాడు. దానితో బాలుడి ఎడమ కాలు విరిగిపోగా, కుడి చెంప భాగంలో తీవ్ర గాయమైంది. అతని తండ్రి కుమార్‌రాజు కుమారుడిని కాకినాడ జీజీహెచ్‌కు తీసుకు వచ్చాడు. ఆరోజు నుండి జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం బాలుడు మృతి చెందాడు.
Post a Comment