ఏరువాక పున్నమి

ఏరువాక పున్నమి
వర్షారంభ కాలంలో జ్యేష్ఠ మాసంలో వచ్చే పూర్ణిమకు ఒక ప్రత్యేకత ఉంది.  తెలుగు ప్రాంతాల్లోని రైతులు ఈ రోజును  ఏరువాక పున్నమిగా  వ్యవహరిస్తారు. ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అనీ, ఏరువాక అంటే తొలి నాగేటి చాలు అని అర్థం. అంటే వ్యవసాయం మొదలు పెట్టడాన్ని రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు. 

ఏరువాక పున్నమి విధి విధానాలు 

ఏరువాక పున్నమి రోజు రైతులంతా ఉదయాన్నే ఎద్దులను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరిస్తారు. ఎడ్లకు, నాగలికి, భూమాతకు పూజ చేసి, ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి ఎడ్లకు ఆహారంగా పొంగలిని పెడతారు. అనంతరం రైతులందరూ సామూహికంగా మేళతాళాలతో ఎడ్లను తోలుకుంటూ పొలాలకు వెళ్లి దుక్కి దున్నుతారు. 

ఏరువాక రోజున రైతులు ఎవరికీ అప్పు, చేబదులు ఇవ్వరు. డబ్బు పెట్టి ఏమీ కొనరు. ఇంట్లోని వస్తువులు బయట వారికి ఇవ్వరు. ఈ పండగకు కావలసిన వస్తు సామగ్రి అంతా ముందు రోజే తెచ్చుకుంటారు. ఈ రోజున ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. ఇంట్లో పిండి వంటలు చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు జరుపుకుంటారు. 

ఇతర పేర్లు 

ఈ పండుగకు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, కృషిక పున్నమి, ఏరువాక పౌర్ణమి అనే పేర్లు కూడా ఉన్నాయి. సంస్కృతంలో ఈ పండగను ఉద్వృషభ యజ్ఞమనీ, కన్నడలో కారుణిపబ్బ అనీ పిలుస్తారు. మన పంచాంగాలలో ఈ రోజును వృషభ పూజ,  హల ప్రవాహ లాంటి పదాలతో కూడా  వ్యవహరిస్తారు. అంటే ఎద్దులను పూజించడం, నాగలి సాగించడం ఈనాటి విధాయ కృత్యాలని తెలుస్తోంది. 

ఏరువాక పున్నమి గురించి ప్రస్తావన  

తొలిసారిగా భూక్షేత్రం లో నాగలిని  కదల్చడానికి ముందు భూమి పూజ చేయాలనీ ఋగ్వేదం వివరిస్తుంది. ఇదే ఈ పండగను గురించి తెలిపే ప్రాచీన ప్రస్తావన. ఏరువాక పున్నమిని వప్పమంగల దివసంగా రైతాంగం జరుపుకునే వారని జాతకకధల ద్వారా తెలుస్తోంది. విష్ణుపురాణంలో సీతాయజ్ఞం అనే మాట వినవస్తుంది. దీనికి అర్థం నాగేటి చాలు అని తెలుస్తోంది. హాలుని గాథాసప్తశతిలో కూడా ఏరువాకపున్నమి గురించి వివరించారు.

1955లో వచ్చిన రోజులు మారాయి చిత్రంలో ఏరువాక సాగేరో.. అనే పాట సుప్రసిద్దం. 1999లో వచ్చిన ఒకే ఒక్కడు చిత్రంలోని పాటలో కూడా ఏరువాక శబ్దం వినిపిస్తుంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post