బ్రహ్మోస్ మిస్సైల్ ప్రాజెక్ట్ భారతదేశం మరియు రష్యాల మధ్య శాస్త్ర, సాంకేతిక, సైనిక మరియు రాజకీయ స్థాయిలలో ఉన్న అద్భుతమైన అవగాహనకు నిదర్శనంగా నిలచింది. భవిష్యత్తులో రెండు దేశాలు కలసి చేయబోయే అన్ని ప్రాజెక్టులకు గీటురాయిగా ఉంది.
భారతదేశం ఆయుధాల తయారీలో దశాబ్దాలుగా చెప్పుకోదగిన ప్రగతిని సాధించలేకపోయింది. అనేక విఫలమైన ప్రాజెక్టులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (LCA) ప్రాజెక్ట్ 35 సంవత్సరాల తర్వాత కూడా, ఇంకా వాణిజ్య సరళిలో ఉత్పత్తికి నోచుకోలేదు. అర్జున్ ట్యాంక్ ఇంకా సైన్యాన్ని మెప్పించలేక పోతోంది. మన సాయుధ దళాలకు కావలసిన తుపాకులను కూడా మనం తయారు చేసుకోలేము. ఇటీవలే వీటికోసం టెండర్లు కూడా పిలిచారు.
ఆయుధ తయారీ సంస్థల్లో నెలకొన్న అలసత్వం, విదేశీ ఆయుధ తయారీదారుల ద్వారా వచ్చే కమిషన్లు కూడా వీటికి ఆజ్యం పోస్తున్నాయి. క్షిపణుల విషయానికి వస్తే ఈ విషయంలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఈ విషయంలో మనం కొంతవరకు స్వయం సంవృద్ధిని సాధించాం.
ఆయుధ తయారీలో ఇలాంటి నేపథ్యం కలిగిన మన దేశం, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రూయిజ్ మిస్సైల్ ను ఎలా తయారు చేసుకోగలిగింది?
1991 గల్ఫ్ యుద్ధంలో అమెరికన్ తోమహాక్ క్రూయిజ్ క్షిపణులు ఇరాక్ యొక్క సైనిక మరియు కమ్యూనికేషన్ కేంద్రాలపై దాడి చేసి, వారిని అసహాయ స్థితిలోకి నెట్టాయి. కేవలం కొన్ని క్రూయిజ్ క్షిపణులు 12 లక్షల ఇరాకీ సైనికులకు ఆదేశాలు ఇచ్చేవారు లేని పరిస్థితులు కల్పించాయి. భారత రక్షణ వ్యూహకర్తలు దీనిని జాగ్రత్తగా గమనించారు. 1971 యుద్ధంలో అమెరికా సెవెంత్ ఫ్లీట్ బంగాళాఖాతం సమీపానికి వచ్చిన విషయం ఇంకా వారు మర్చిపోలేదు.
బ్రహ్మోస్ CEO ఎ. శివథాను పిళ్ళై తన పుస్తకం ‘The Path Unexplored' లో తోమహాక్ విజయాల్ని చూసిన భారత్ ఖచ్చితంగా దాడి చేయగల క్రూయిజ్ క్షిపణిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుందని తెలిపాడు.
1995 లో మన దేశ క్షిపణి పితామహుడు - తరువాత అధ్యక్షుడు - A.P.J. అబ్దుల్ కలాం, ఒక బ్రాండ్ కొత్త క్రూయిజ్ క్షిపణి కోసం భారత్-రష్యా జాయింట్ వెంచర్ యొక్క CEO గా బాధ్యతలు చేపట్టవలసిందని పిళ్లైని కోరారు. చాలామంది సహోద్యోగులు, అధికారులు ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావటం కష్టమని, పిళ్ళైని వెనక్కులాగారు. అలాగే కొన్ని వ్యతిరేక శక్తులు కూడా బ్రహ్మోస్ ప్రాజెక్టుకు అడ్డుపడాలని భావించాయి. అని పుస్తకంలో తెలిపారు.
క్రూయిజ్ క్షిపణికోసం ఎన్నుకోబడిన టీం ప్రొపల్షన్, గైడెన్స్ మరియు నియంత్రణ, సీకర్ మరియు కాన్ఫిగరేషన్ పరంగా వివిధ ఆప్షన్లను చూడటం ప్రారంభించింది. మేము ఈ క్షిపణి, దాని తరగతిలో ఉత్తమమైనది గా, భవిష్యత్ క్షిపణిగా ఉండాలని కోరుకున్నాం. అని పిళ్ళై వ్రాశాడు. కానీ భవిష్యత్ క్షిపణిగా ఎలాంటి లక్షణాలు ఉంచాలో ఆలోచించటానికి సమయం పట్టింది. భవిష్యత్ క్షిపణి అంటేనే వేగవంతమైన క్షిపణి అని నిర్ణయానికి వచ్చాము. అది శత్రువు యొక్క ప్రతిస్పందన సమయాన్ని తగ్గిస్తుంది. అప్పటికే మన రెండు దేహాల మధ్య ఉన్న బంధం కారణంగా రష్యా ను భాగస్వామిగా ఎంచుకున్నారు.
NPO Mashinostroyenia (NPOM) ను భాగస్వామిగా ఎంచుకోవడానికి కారణం, ఇది మలాకీట్ మరియు గ్రానిట్ వంటి ఐకానిక్ క్రూయిజ్ క్షిపణులను అభివృద్ధి చేసింది. అలాగే DRDO తో ఆకాష్ క్షిపణి విషయంలో కలసి పనిచేసిన అనుభవం ఉంది. అలాగే ఎఫ్రెమోవ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ NPOM కూడా, మన దేశానికి సూపర్ సోనిక్ టెక్నాలజీ బదలాయిపు విషయంలో రష్యా ప్రభుత్వాన్ని ఒప్పించడానికి సహాయపడ్డారు.
అప్పట్లో ప్రధానమంత్రి మరియు రక్షణ మంత్రి గా ఉన్న పీవీ నరసింహారావు గారు ఈ ఉమ్మడి ప్రాజెక్టుకు వెంటనే ఆమోదం తెలిపారు. నిధుల కొరత కూడా ప్రాజెక్టును ఆపివేసినంత పని చేసింది. NPOM ఆ సమయంలో రూపాయి కూడా పెట్టగలిగే స్థితిలో లేదు. దీనిని వారి సాంకేతిక భాగస్వామ్యం మరియు మన దేశం సోవియట్ కు చెల్లించాల్సిన అప్పు స్థానంలో భర్తీ చేసి ఎట్టకేలకు ప్రాజెక్టును పట్టాలెక్కించారు.
నరసింహారావు గారు ఆ సమయం లో ప్రధానమంత్రిగా ఉండి మన దేశంలో ఈ ప్రాజెక్టుకు ఏ విధమైన బ్యూరోక్రటిక్ అడ్డంకులు లేకుండా చూసారు. ఏ విధమైన అనుమతులైనా మాకు వెంటనే వచ్చేవి. అని ఆయన తెలియ చేసారు. రష్యా ప్రభుత్వం సహకరించటం లోనూ నరసింహారావు గారు కీలక పాత్ర వహించారు. సరియైన సమయంలో మనకు సరియైన నిర్ణయాత్మక ప్రధానిగా వ్యవరించారు. అని కూడా వ్యాఖ్యానించారు.
పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా
Post a Comment