కాళేశ్వరం ప్రాజెక్టు పై ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పై ఆంధ్రప్రదేశ్‌ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టుపై  ఫిర్యాదుల ద్వారా  అపెక్స్‌ కౌన్సిల్‌కు లాగే ప్రయత్నం చేస్తోంది. అంతేగాకుండా కేంద్ర జల సంఘం జారీ చేసిన సాంకేతిక సలహా కమిటీ  అనుమతులపై ప్రశ్నలు లేవనెత్తింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ రెండ్రోజుల కింద కేంద్ర కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్‌ సింగ్‌కు లేఖ రాసారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా అభ్యంతరం చెబుతూ లేఖ రాయటం ఇది తొమ్మిదవసారి. 

కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ, అటవీ, పర్యావరణ అనుమతులతోపాటు కీలకమైన టీఏసీ అనుమతి కూడా ఇటీవలే లభించింది. దీనిపై ఆంధ్ర ప్రదేశ్ తాజాగా మరోసారి కేంద్రానికి ఫిర్యాదు చేసింది.  ఇప్పటి వరకు గోదావరి బోర్డు అనుమతి తీసుకోలేదనీ, తమ అనుమతి లేకుండా మహారాష్ట్ర తో ఎలా ఒప్పందం కుదుర్చుకుంటారని ప్రశ్నించింది.  ఇలా చేయటం రాష్ట్ర విభజన చట్టంలోని 85(సి), 85(డి) నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.  ఇవన్నీ తేలే వరకు ప్రాజెక్ట్ పనులు తక్షణమే నిలిపివేయించాలని కూడా కోరింది. 

లేఖ పై మండిపడిన తెలంగాణ  

తాము అన్ని అనుమతులు తెచ్చుకొని ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పటికీ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభ్యంతరం లేవనెత్తటం పై తెలంగాణ మండి పడింది. ఈ అభ్యంతరాలు కేవలం రాజకీయ దురుద్ధేశాలతో కూడుకున్నవనీ, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఈ ప్రాజెక్ట్ ఈ విధంగాను భంగం కలిగించదనీ రాష్ట్ర మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఏపీ వాదనలు ఎదుర్కోవడానికి తగిన వాదనలు సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జలవనరుల సంఘం (CWC)

ఇదిలా ఉండగా 10 మంది సభ్యుల CWC  బృందం మంగళవారం, బుధవారం రోజులలో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. వీరు మేడారం రిజర్వాయర్, టన్నెల్, పంప్ హౌస్, సర్జ్ పూల్ మరియు ఇతర పనులను పరిశీలించారు. బృంద సభ్యులు ఇంజనీర్లతో మాట్లాడి ప్రాజెక్ట్ గురించి వివరాలు తెలుసుకున్నారు. 

ఈ బృందం పనుల వేగం, నాణ్యత పై తమ సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదే వేగంతో పనులు కొనసాగితే డిసెంబరు లోగా పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది.  

0/Post a Comment/Comments

Previous Post Next Post