ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ కష్టాలు |
ఆంధ్ర ప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రం అని పాలకులు గర్వంగా ప్రకటిస్తున్నారు కదా. వారి అత్యుత్సాహం మరియు అధికారుల హ్రస్వదృష్టి రానున్న విద్యుత్ కష్టాలకు కారణాలుగా మారనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నుండి గత జూన్ మొదటి వారం వరకు ఆంధ్రప్రదేశ్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో మెజారిటీ వాటా తెలంగాణ పంపిణీ సంస్థలకు ఇస్తున్నట్టు, తెలంగాణ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి లో మైనారిటీ వాటా ఆంధ్రప్రదేశ్ పంపిణీ సంస్థలు తీసుకుంటున్నట్లుగా లెక్కల్లో చూపించేవారు. రెగ్యులేటరీ సంస్థ కు విద్యుత్ ధరల నిర్ణయం విషయంలో కూడా ఇవే లెక్కలు చూపించే వారు. ఆంధ్ర ప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ లో థర్మల్ విద్యుత్ కి అయ్యే వ్యయం యూనిట్ కి 50 పైసల నుండి 2 రూపాయల వరకు తక్కువ. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ కు పంపిణీ అవుతున్న విద్యుత్ మాత్రం 500MW ఉండేది. విభజన నాటి నుండి ఈ బకాయిలు 4400 కోట్లు గా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు లెక్క తేల్చాయి. తెలంగాణ సంస్థలు ఈ బకాయిలు చెల్లించట్లేదని ఆంధ్ర ప్రదేశ్ నుండి విద్యుత్ సరఫరా జూన్ మొదటి వారంలో నిలిపి వేసారు.
కాగా తాము కేవలం 500MW మాత్రమే తీసుకున్నామని వాటికి సరిపడా బిల్లులను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని, 2014 లో కేంద్రప్రభుత్వం గ్రాంటులలో తమ వాటా, తమ సంస్థలకు కృష్ణపట్నం విద్యుత్ సంస్థ లో వున్న వాటాలను లెక్కతేలిస్తే ఆంధ్రప్రదేశ్ సంస్థలే 1600 కోట్లు ఎదురు ఇవ్వాల్సి ఉంటుందని తెలంగాణ సంస్థలు వాదిస్తున్నాయి. ఒకవేళ విభజన చట్టం ప్రకారం 46 : 54 నిష్పత్తి లో పంచుకోవాల్సి వస్తే అది కేవలం థర్మల్ సంస్థలకే వర్తించదనీ, తక్కువ యూనిట్ ఖర్చు వుండే జల విద్యుత్ ని కూడా ఆ మేరకు ఇవ్వాల్సిందనీ, తాము విద్యుత్ లోటు లో వున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మొదటగా తమకు ఇవ్వకుండా విభజన చట్టాన్ని ఉల్లంఘించిందనీ అంటున్నాయి.
ఈ వాదనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలకు రెగ్యులేటరీ సంస్థ కు చూపినట్లుగా 4400 కోట్ల బకాయిలు వచ్చే అవకాశం లేదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం కూడా సర్దుబాటు చేయటం కష్టం. రాష్ట్రం లో ఎక్కడా థర్మల్ విద్యుత్ యూనిట్ కు 4 రూపాయలకు తక్కువగా ఉత్పత్తి అవటం లేదు. గత కొన్ని నెలల నుండి బహిరంగ మార్కెట్లో ధరలు రెండున్నర రూపాయలకు అటూ ఇటూ గా ఉన్నాయి. కాబట్టి బహిరంగ మార్కెట్లో అమ్మే పరిస్థితి లేదు.
తెలంగాణ లో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో 190 మిలియన్ యూనిట్లు దాటినా బహిరంగ మార్కెట్లో కొని తెచ్చుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్ వినియోగం ఇప్పటికిప్పుడు ఆ స్థాయిలో పెరగటం కష్టమే. పవన విద్యుత్ ఉత్పత్తి కూడా పెరిగిపోవటం తో రెండు నెలలు గా ఏ థర్మల్ సంస్థ కూడా పూర్తి స్థాయిలో పనిచేసింది లేదు. వర్షాలు కురిసి రిజర్వాయర్లలోకి నీళ్లు వస్తే మొత్తం సంస్థలను కొన్ని రోజులపాటు మూయవలసిందే.
పెరిపోతున్న ఉత్పత్తి ఖర్చులు, రాని బకాయిలు కలిసి రాష్ట్ర వినియోగదారులకు గుదిబండగా మారే అవకాశాలున్నాయి. రెగ్యులేటరీ సంస్థ కు ఇవే వివరాలు అందిస్తే యూనిట్ కి కనీసం 2-3 రూపాయల వరకూ పెంచవలసి ఉంటుంది. వినియోగదారులు కూడా ఆ స్థాయి ధరలు భరించటం కష్టం. 2019 లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఇప్పట్లో విద్యుత్ ధరలు కూడా పెరిగే అవకాశం కూడా లేదు. ఇవన్నీకలసి ఇప్పటికే అంతంత మాత్రంగా ఆర్థిక పరిస్థితి ఉన్నరాష్ట్ర విద్యుత్ సంస్థలను నష్టాల ఊబిలోకి నెట్టనున్నాయి.
Post a Comment