కాపీ కొట్టినందుకు యాదాద్రి అనుమతులు రాలేదు |
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ కు ఎదురు దెబ్బ తగిలింది. కాపీ చేసిన, ప్రాజెక్టుతో సంబంధం లేని విషయాలతో కూడిన పత్రాలను సమర్పించినందుకు కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ అనుమతిని నిరాకరించింది.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (TSGENCO) నల్గొండ జిల్లాలో 4000 MW థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయ తలపెట్టిన విషయం తెలిసిందే. సంబందించిన అనుమతుల కోసం కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో అన్నీ ఎక్కడ నుండో కాపీ చేసిన వివరాలు ఉన్నాయట. కొన్ని చోట్ల రెండు నౌకాశ్రయాల నుండి బొగ్గు దిగుమతి చేసుకుంటామని ఉండగా కొన్ని చోట్ల నాలుగు నౌకాశ్రయాలని ఉందట. అసలు స్థలానికి సంబందించిన వివరాలు లేకపోవటం తో పాటు బొగ్గును ఎలా సమకూర్చుకుంటారు అనే వివరాలు అసలే లేవట. ఇంకా 4000 MW ప్రాజెక్ట్ ని చిన్న సంస్థ గా పేర్కొన్నారట.
TSGENCO అధికారులను దీనిపై వివరణ అడుగగా తమ తప్పేం లేదని, ఈ ప్రాజెక్ట్ విషయమై సలహాలందించేందుకు కన్సల్టెంట్ ను నియమించుకున్నామని వారే నివేదిక తయారు చేశారని అన్నారు. ఎంత కన్సల్టెంట్ కు అప్పగించినా తమ సంస్థ ద్వారా సబ్మిట్ చేసే పత్రాలను కనీసం ఒక సారి కూడా సరి చూసుకోరా. తాము సంతకం పెట్టే పంపిస్తారు కదా?, తమ సంస్థ పరువు ప్రతిష్ఠలకు సంబంధించిన విషయంలో అంత నిర్లక్ష్యం ఎందుకో?
ఇదే తెలంగాణ ప్రభుత్వం రెండు నెలల క్రితం ఈజ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ డాక్యుమెంట్స్ కాపీ చేసిందని ఆరోపించడం గమనార్హం.
Post a Comment