ఐఐటి హైదరాబాద్ |
ఈ సంవత్సరం JEE అడ్వాన్సుడ్ లో టాప్ 1000 ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్లో 19 మంది ఐఐటి హైదరాబాద్ ను ఎంచుకోవటం విశేషం. మరే కొత్త ఐఐటిలో కూడా ఇంత మంది టాప్ 1000 ర్యాంక్ విద్యార్థులు చేరలేదు. ఐఐటి ఇండోర్ లో ముగ్గురు విద్యార్థులు చేరగా గాంధీనగర్, జైపూర్, రోపర్ లలో ఒక్కో విద్యార్ధి చేరారు. ఇంజనీరింగ్ కాలేజీల ర్యాంకింగ్ లో దేశ వ్యాప్తంగా ఏడవ ర్యాంకు పొందటం, సొంత క్యాంపస్ కు మారటం, అద్భుతమైన విద్యార్థి / అధ్యాపకుల నిష్పత్తి (1/12), దాదాపు 80% మంది అధ్యాపకులకు స్పాన్సర్డ్ ప్రాజెక్టులు/ ఫండింగ్ ఉండటం దీనికి కారణాలుగా చెప్పుకోవచ్చు.
కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే విద్యార్థులు మెట్రో సిటీలలో ఉన్న ఐఐటిలలో చేరటానికి ప్రాధాన్యతనిచ్చారని అర్థమవుతుంది. టాప్ 1000 విద్యార్థుల్లో ఐఐటి బాంబే (262) కు తొలి ప్రాధాన్యత దక్కగా, ఢిల్లీ (196) తర్వాత స్థానం లో నిలిచింది. తెలుగు విద్యార్థులు కూడా వీటినే ఎంచుకోవటం విశేషం. పాత ఐఐటిలైన కాన్పూర్, ఖరగ్ పూర్, మరియు మద్రాస్ లలో కూడా 100 కు మించిన విద్యార్థులు చేరారు.
ఐఐటి హైదరాబాద్ లో ఈ సంవత్సరం చేరిన విద్యార్థులతో కలిపి మొత్తం విద్యార్థుల సంఖ్య 1900 కు చేరింది. ఇక్కడ మొత్తం 160 మంది అధ్యాపకులున్నారు. ఒక్కో గైడ్ కు సగటున ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులున్నారు. ఈ సంవత్సరం ఐఐటి హైదరాబాద్, ఎద్దుమైలారం లోని ఆర్డినెన్సు ఫ్యాక్టరీ నుండి సంగారెడ్డి పక్కన ఉన్న కంది గ్రామంలోని సొంత ప్రాంగణానికి మార్చబడింది.
2008 లో నెలకొల్పబడిన ఐఐటి హైదరాబాద్ లో మొత్తం అన్ని విభాగాలలో కలిపి 240 సీట్లు ఉన్నాయి. తొలిసారి ఈ విద్యా సంవత్సరం (2016)లో అన్ని సీట్లు నిండటం విశేషం. గత సంవత్సరం చివరి రౌండ్ కౌన్సిలింగ్ తర్వాత 13 సీట్లు మిగిలిపోయాయి. కౌన్సిలింగ్ ను మూడు దశల నుండి ఆరు దశలకు పెంచటం తో అన్ని ఐఐటిలలో ఖాళీగా ఉండే సీట్లు గణనీయంగా తగ్గిపోయాయి. గత సంవత్సరం మొత్తం 341 సీట్లు మిగలగా ఈ సారి సంఖ్య 73కే పరిమితమైంది.
Post a Comment