పర్యాటక జైలు |
చాలా మంది సాధారణ ప్రజలు జైలు జీవితం ఎలా ఉంటుందో విని ఉంటారు, కానీ ప్రత్యక్షంగా అనుభవించి వుండరు. కానీ కొంత మందికి అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంటుంది. తెలంగాణా ప్రభుత్వం నిజాం కాలం నాటి మ్యూజియం జైలు ద్వారా ఇలాంటి ఔత్సాహికుల కోరిక తీర్చబోతోంది. కేవలం 500 రూపాయలు చెల్లించటం ద్వారా 24 గంటల పాటు జైలు జీవితాన్ని చవిచూడవచ్చు.
హైదరాబాద్ కు 55 కిలోమీటర్ల దూరం లోని సంగారెడ్డి జిల్లా జైలు లో ఆగష్టు రెండవ వారం నుండి ఈ అవకాశం కల్పించారు. ఈ జైలు 1796 లో మొదటి సాలార్ జంగ్ కాలంలో నిర్మితమైంది. 2012 లో ఇక్కడ కొత్త జైలు నిర్మించిన తర్వాత ఈ కట్టడం నిరుపయోగం గా ఉండేది. గత జూన్ లో ఈ జైలును మ్యూజియం గా మార్చారు. ఈ మ్యూజియంలో నిజాం కాలం నాటి జైళ్ల కు సంబంధించిన వస్తువులు, ఫోటోలు, ప్రముఖులు జైల్లో ఉన్నప్పుడు ఉపయోగించిన వస్తువులు వున్నాయి. ఈ జైలు లో ఒక వాచ్ టవర్, తొమ్మిది బ్యారక్ లు మరియు కొన్ని ఒంటరి సెల్ లు ఉన్నాయి. పురాతన కాలం నాటి జైలు కావటంతో చూడటానికి కొంచం భయం గొలిపేదిగానే ఉంది.
ఇక్కడ ఒక రోజు జైలు జీవితం గడపాలనుకునే వాళ్లకు నిజమైన జైలులో ఉండే అనుభవాన్నే కల్పించనున్నారు. ఇందులోకి వచ్చే ముందే ఒక జత తెల్లని ఖాదీ దుస్తులు, జైలులో తయారైన సబ్బును అంద చేస్తారు. ఖైదీలను లేపినట్లు గానే ఉదయం 5 గంటలకు నిద్ర లేపుతారు. లేచిన తర్వాత పర్యాటక ఖైదీ తోనే జైలు గదిని శుభ్రం చేయిస్తారు. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఆరున్నరకు టీ, ఏడున్నర కు అల్పాహారం గా ఇడ్లీలు అందచేస్తారు. 11 గంటలకు పక్కనే ఉన్న నిజమైన జైలు లో అందజేసే ఆహారాన్నే అల్యూమినియం ప్లేటులో అందచేస్తారు. సాయంత్రం ఐదు గంటలకు రాత్రి ఆహారాన్ని అందచేసి ఆరు గంటలకు సెల్ లోకి పంపిస్తారు. మధ్యాహ్న సమయం లో ఇష్టాన్ని బట్టి మొక్కలు నాటడం లాంటి పనులు చేయిస్తారు. పడుకోవటానికి కేవలం చాప ను మాత్రమే అందచేస్తారు. రాత్రి సమయం లో నిజమైన జైలు లో తనిఖీ చేసిన విధంగానే గార్డులు వచ్చి చూసి వెళతారు. ఈ జైలు లో ఉండటానికి ఇప్పటి వరకు చెన్నై,కర్ణాటక, ముంబైల నుండి కూడా వాకబు చేసారట కానీ ఎవరూ ఇంతవరకు బుక్ చేసుకోలేదట.
Post a Comment