మృగ‌శిర‌ కార్తె

మృగ‌శిర‌ కార్తె
మృగ‌శిర‌ కార్తె ప్రవేశాన్ని వర్షారంభానికి సూచనగా భావిస్తారు. రోహిణికార్తె లో ఎండలతో సతమతమైన జీవకోటికి ఈ కార్తెలో వచ్చే  నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. మృగ‌శిర‌ కార్తె ను రైతులు ఏరువాక‌ సాగే కాలం అని కూడా అంటారు. ఏరువాక‌ అంటే నాగటి చాలు. ఈ కాలంలో తొల‌క‌రి జ‌ల్లులు ప‌డ‌గానే  పొలాలు దున్ని పంటలు వేయటం మొదలుపెడతారు.

మృగ‌శిర‌ కార్తె  జరుపుకునే విధానం / ఆచారాలు 

మృగ‌శిర‌ కార్తె మొదటి రోజుని ప్రజలు వివిధ ప్రాంతాల్లో మృగ‌శిర‌, మృగం,మిరుగు, మిర్గం పేర్లతో పండగలా జరుపుకుంటారు. ఈ రోజు ప్రజలు బెల్లంలో ఇంగువను కలిపి  తింటారు. ఇంగువ శరీరంలో వేడిని అధికం చేసి వర్షకాలంలో సోకే జలుబు, ఇతర వ్యాధులను నియంత్రిస్తుందని భావిస్తారు. మృగశిర కార్తె ప్రారంభం రోజు చేపలు / ఇతర మాంసాహారం తింటే వ్యాధులు దూరమవుతాయని ప్రజల లో నమ్మకం కూడా వుంది. 

ఉబ్బసం (ఆస్తమా) రోగులకు ఏటా మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిన సోదరులు  చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తారు. 

అసలు కార్తె అంటే.... 

సూర్యుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. సూర్యుడు ఏ నక్షత్రానికి సమీపంలో  ఉంటే ఆ కాలానికి (కార్తెకు) ఆ నక్షత్రం పేరు పెట్టారు.ఈ కార్తెలు సౌరమానం ప్రకారం గణించబడటం తో  ఈ కార్తెలు ఆంగ్ల (గ్రెగొరియన్) క్యాలెండరు ప్రకారం దాదాపు ప్రతీ సంవత్సరం ఒకే తేదీల్లో వస్తాయి.  

మొత్తం మనకు అశ్వినితో ప్రారంభమై రేవతీతో ముగిసే కార్తులు ఇరవై ఏడు నక్షత్రాల పేర్లతో ఇరవై ఏడు ఉన్నాయి. అవి 1.అశ్వని, 2.భరణి, 3.కృత్తిక, 4.రోహిణి 5.మృగశిర 6. ఆరుద్ర 7.పునర్వసు 8.పుష్యమి 9.ఆశ్లేష 10.మఖ 11.పుబ్బ 12.ఉత్తర 13.హస్త 14. చిత్త 15.స్వాతి 16.విశాఖ 17.అనూరాధ 18.జేష్ట్య 19.మూల 20.పూర్వాషాడ 21.ఉత్తరాషాడ 22.శ్రవణం 23.ధనిష్ట 24.శతభిషం 25.పుర్వాబాధ్ర 26. ఉత్తరాబాధ్ర 27.రేవతి

మృగశిర కార్తె ప్రాముఖ్యత 

మృగ‌శిర‌ న‌క్ష‌త్రం దేవ‌గ‌ణానికి చెందిన‌ది. దీనికి అధిప‌తి కుజుడు. ఈ న‌క్ష‌త్రంలో జ‌న్మించిన‌వారు మంచి అదృష్టం క‌లిగివుంటారని భావిస్తారు. పూర్వం వైశంపాయనుడు మృగశిర కార్తె రోజునే తన శిష్యుడైన యాజ్ఞవల్క్యునికి తైత్తిరీయోపనిషత్తు బోధించాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణదేవుని ప్రార్థనతోనే ప్రారంభం అవుతుంది. 

అటు పరమాత్మకూ, ఇటు లౌకిక వ్యవహారాలకు మధ్య మృగశిర కార్తె ను సంధానకర్తగా భావిస్తారు. తొలకరి జల్లుల సమయం లో భూమిపైనుంచి వచ్చే పరిమళం జీవరాశులన్నింటికీ ఆనందం కలిగిస్తుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు వర్షపు జల్లుల అనంతరం ధరణినుంచి ఉద్భవించివ్యాపించే పరిమళాన్ని తానేనని వివరిస్తాడు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి మానవునిలో ఓజస్సు, తేజస్సు మృగశిరకార్తె అనంతరం అధికం అవుతాయని జీవకుడనే పూర్వకాలంనాటి వైద్యుడు గ్రంథస్థం చేశాడు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post