ఉక్రెయిన్‌లో ఇద్దరు భారత వైద్య విద్యార్థుల హత్య |
ఉక్రేయిన్ లో మెడిసిన్ చదువుతున్న ఇద్దరు భారతీయ విద్యార్ధులు, ఆదివారం నాడు జరిగిన జాత్యహంకార దాడిలో కత్తిపోట్లకు గురై మరణించారు. మరో విధ్యార్థి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. ఈ ముగ్గురూ ఉత్తర ప్రదేశ్ కు చెందినవారు. ముజఫర్ నగర్ కు చెందిన ప్రణవ్ శాండిల్య, ఘజియాబాద్ కు చెందిన అంకుర్ సింగ్ లు మరణించగా, ఆగ్రాకు చెందిన ఇంద్రజిత్ సింగ్ చౌహాన్ తీవ్రంగా గాయపడ్డారు. భారత విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
భారత విదేశాంగ శాఖా ప్రతినిధి వికాస్ స్వరూప్ మీడియా తో మాట్లాడుతూ ఆదివారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో ముగ్గురు ఉక్రెయిన్ జాతీయులు ఉఘ్గొరొద్ (Uzhgorod) మెడికల్ కాలేజీలోకి ప్రవేశించి ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు. ప్రణవ్ శాండిల్య మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతుండగా, అంకుర్ సింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. దాడికి పాల్పడిన దుండగులను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు, వారి పాస్ పోర్ట్ లను, హత్యాయుధాన్ని సీజ్ చేసినట్లు వివరించారు. గాయపడ్డ చౌహాన్ కోలుకున్నట్లు, అతని వాంగ్మూలం ఆధారంగానే చర్య తీసుకున్నట్లు తెలిపారు. మరణించిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తున్నామని, వారి భౌతిక కాయాలను ఇక్కడికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు.
ఇండియా లో మెడికల్ సీట్ల కొరత ఉండటంతో విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదవటం పరిపాటిగా మారింది. కాని ఇటీవలి కాలంలో మాజీ సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపా దేశాలలో ఆసియా వారిపై కొందరు జాత్యహంకారులు దాడులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
I am sorry two Indian students Pranav Shandilya Muzaffarnagar and Ankur Singh (Ghaziabad) were stabbed to death in Ukraine on 10.4.2016./1— Sushma Swaraj (@SushmaSwaraj) April 11, 2016
Post a Comment