ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌ లో రచ్చ

ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌ లో రచ్చ
ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌ లో రచ్చ
ఆంధ్రప్రదేశ్ కు  ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌ ఉభయసభల్లో చర్చకు కాంగ్రెస్‌ పట్టుబట్టింది. రాజ్యసభలో చర్చకు ఆజాద్‌ నోటీస్ ఇచ్చారు. విభజన తర్వాత ఆదాయం తో కూడిన హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్ళిందని, ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ లోటు ఉందని ఆజాద్ చెప్పారు. పార్లమెంట్‌లో విభజన బిల్లు సందర్బంగా నాటి ప్రధాని కొన్ని హామీలు  ఇచ్చారని, అధికారం లోకి వచ్చి రెండు సంవత్సరాలైనా ఇప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదన్నారు. మేము ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని అంటే పదేళ్లు కావాలని గొడవ చేసిన వెంకయ్య ఇప్పుడు ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.  ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన అన్ని హామీలు తక్షణం నెరవేర్చాలని  గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు చెందిన మరో సభ్యుడు దిగ్విజయ్ సింగ్ కూడా ఈ విషయంలో ఆయనకు మద్దతిచ్చారు.  ప్రత్యేక హోదాపై అప్పటి కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని, దానిని  అమలు చేయాలని దిగ్విజయ్‌ సింగ్ డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ కు  చెందిన కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారనీ, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు చెందిన అంశం కాదని, సభలో హామీ ఇచ్చారు కాబట్టి మొత్తం సభ గౌరవానికి సంబంధించినదని కేవీపీ అన్నారు. సీఎం రమేష్‌ మాట్లాడుతూ కనీసం రెండేళ్లకైనా కాంగ్రెస్‌కు జ్ఞానోదయం కలిగిందన్నారు.  విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలుచేస్తామని రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రాజ్యసభ వెల్‌లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు  నిరసనకు దిగారు. దీంతో రాజ్యసభ వాయిదా పడింది.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై లోక్‌సభలో జరిగిన చర్చలో, విభజన జరిగి రెండేళ్ళవుతున్నా ప్రత్యేకహోదా ఇవ్వటం లేదని కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. ఈ విమర్శలపై వెంకయ్యనాయుడు తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేసారు. విభజన చట్టం అమలుకు కట్టుబడి ఉన్నామని, తాము ఆంధ్రప్రదేశ్ కు చాలా సహాయం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా ప్రస్తావన ఎందుకు లేదని వెంకయ్య ప్రశ్నించారు. తనను ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని ఆయన  అన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post