తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను అర్థం చేసుకోలేదా?

తెలంగాణ ప్రజలు  కాంగ్రెస్ ను అర్థం చేసుకోలేదా?
తెలంగాణ ప్రజలు  కాంగ్రెస్ ను అర్థం చేసుకోలేదా?
తెలంగాణ ఇచ్చి ప్రజల చిరకాల కోరిక తీర్చాం. అయినా ప్రజలు మమ్మల్ని మమ్మల్ని, సోనియా గాంధీని అర్థం చేసుకోలేదు. ఇది తరచుగా కాంగ్రెస్ నేతల నుంచి వినిపించే మాట. కొందరు నేతలైతే మరో అడుగు ముందుకు వేసి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు నమ్మక ద్రోహం చేసారు అని కూడా అనేస్తుంటారు. ఇది నిజమేనా?

ప్రజాస్వామ్యం లో ఓటు హక్కు కు ఎంతో విలువ వుంది. అదే అత్యున్నతమైన నిర్ణాయక వ్యవస్థ. ఈ ఓటుని ప్రజలు వేస్తారు. రాజకీయ నాయకులు ఓటు వేసే ప్రజల్ని అర్థం చేసుకోవాలా? లేక ప్రజలు రాజకీయ నేతల్ని/ పార్టీలని అర్థం చేసుకోవాలా? అనేది మౌలికమైన ప్రశ్న. ఇదెప్పుడో కాంగ్రెస్ వారు మరచిపోయారు.

తెలంగాణ ఇస్తామని మేనిఫెస్టో లో పెట్టి మరీ 2004, 2009 లలో ఎన్నికలకు వెళ్లారు. మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ ని నిలబెట్టుకోవటం కూడా వాళ్ళు చేసిన త్యాగంగా గుర్తించాలా? ఇంకా మాట్లాడితే ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని పోరాటాలు చేస్తే కానీ తెలంగాణా ఇవ్వలేదే?

2004 లో రావాల్సిన తెలంగాణ 2014 వరకు రాకపోవటానికి కారణం ఎవరు? ఆలస్యం ఎందుకు జరిగింది?  ఆ మధ్యకాలం లో ఎవరు అధికారం లో వున్నారు? ఇవన్నీ ప్రజలు ఎలా మరచిపోతారు?

2009 లో తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నారే? తర్వాత కనీసం ఒక్కసారైనా ఈ నాయకులు ప్రజల మనోభావాల గురించి ఆలోచించారా? ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ, నెలకొకసారి కాబినెట్ భేటీ జరిగాయి. ఈ మీటింగులు జరిగినప్పుడల్లా ఇవాళ తెలంగాణ వచ్చేస్తుందని ఎన్నిసార్లు ప్రచారం జరిగిందో తెలుసా? ప్రతి మీటింగ్ తర్వాత తెలంగాణా వాదులు ఎంత నిరాశ చెందేవారో, ఎంతగా ఇరిటేట్ అయ్యేవారో వీళ్ళకు అర్థం అవుతుందా? ఇటువంటి చర్యల వల్లే కదా ఆత్మహత్యలు జరిగాయి.

ఉద్యమం లో జరిగిన ప్రభుత్వ  హింస కి ఎవరు బాధ్యత వహించాలి? కేవలం ఆంధ్రా కాంగ్రెస్ నాయకుల మీద తోసేసి వీళ్ళు ఎలా తప్పించు కుందామనుకున్నారు. వీళ్ళు ప్రభుత్వం లో భాగస్వాములుకారా?

 అధికారం చివర్లో కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు తెలంగాణా వ్యతిరేకం కాదా? ప్రభుత్వం లోపలే వుండి నాలుగు కేసులు మీ పైన పెట్టించుకుని మేం వ్యతిరేకించాం అని చెపితే సరిపోతుందా? మీకు కూడా ప్రభుత్వం లో, ఆ పార్టీ లో ఉన్నందుకు భాగస్వామ్యం ఉంటుందని మీరు మర్చిపోయినంత సులభంగా ప్రజలు మర్చిపోతారా? 

ఇవన్నీ తెలంగాణా ప్రజల్ని అనేముందు కాంగ్రెస్ నాయకులు వాళ్ళని వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్నలు.

0/Post a Comment/Comments

Previous Post Next Post