యూకే వ్యాపారం నుండి వైదొలగనున్న టాటా స్టీల్‌

యూకే వ్యాపారం నుండి వైదొలగనున్న టాటా స్టీల్‌
యూకే వ్యాపారం నుండి వైదొలగనున్న టాటా స్టీల్‌
భారతీయ స్టీల్‌ దిగ్గజం టాటా స్టీల్‌ నష్టాల్లో ఉన్న తన యూకే వ్యాపారంలో  కొంత భాగాన్ని కానీ, పూర్తిగా కానీ విక్రయించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంగళవారం రాత్రి సంస్థ ధ్రువీకరించింది. దీనితో యూకే లోని ఈ సంస్థలో పని చేస్తున్న 15000 మంది ఉద్యోగాలకు ముప్పు ఏర్పడింది.

ముంబయిలో మంగళవారం రాత్రి జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఈ సంస్థ పునర్‌నిర్మాణానికి అవసరమైన అన్ని దారులు వెతకమని  మొదట దాని యూరోపియన్‌ హోల్డింగ్‌ కంపెనీకి చెప్పింది. పునర్‌నిర్మాణం లో భాగంగా కొంత భాగాన్ని కానీ, పూర్తిగా కానీ విక్రయించాలని నిర్ణయించింది.

టాటా స్టీల్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం యూరొప్ మరియు యూకే లలో స్టీల్ పరిశ్రమ మనగలిగే పరిస్థితులలో లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధిక ఉత్పత్తి, ఇక్కడి వేతనాలు అధికం గా ఉండటం, చైనా నుండి దిగుమతులు, కరెన్సీ లో ఒడిదుడుకులు, అధిక కరంటు చార్జీలు, అధిక పర్యావరణ సుంకాలు మరియు ప్రభుత్వ మద్దతు లేకపోవటం తో పరిశ్రమ సంక్షోభం లో ఉంది.

యూకే, వెల్ష్ ప్రభుత్వాలు తాము దేశం లో స్టీల్ పరిశ్రమ ను రక్షించటానికి నిరంతరంగా శ్రమిస్తున్నామని తెలిపాయి. తాము టాటా తో కలిసి పనిచేయాలని  అనుకుంటున్నామని, యూకే స్టీల్ పరిశ్రమకు మంచి రోజులు తెప్పించే దిశగా ప్రయత్నిస్తున్నామని ఒక సంయుక్త ప్రకటన లో తెలిపాయి.  స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్స్ మాత్రం  యూకే, వెల్ష్ ప్రభుత్వాలపై విరుచుక పడ్డారు. అంతా అయిపోయే వరకూ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదని, చైనా డంపింగ్ చేస్తున్న స్టీల్ పై చేష్టలుడిగి చూస్తుండి పోయారని, పరిశ్రమ కు ఇది చీకటి రోజని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సరైన చర్యలు చేపట్టాలని కోరారు. టాటా స్టీల్ మాత్రం తాము రెండు సంవత్సరాల నుండి నష్టాల్లోనే నడిపిస్తున్నామని, నిర్ణయం తీసుకోక తప్పలేదని ప్రకటించింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post