స్కంద పంచమి | కుమార షష్ఠి

ఈ వ్రతానికి స్కంద పంచమి, సుబ్రమణ్య షష్ఠి, స్కంద షష్ఠి, కంద షష్ఠి, కుమార షష్ఠి మరియు మురుగ షష్ఠి అనే వివిధ రకాలైన పేర్లు ఉన్నాయి. 

స్వామి వృత్తాంతము 

పూర్వము తారకాసురుడు, సూరపద్ముడు, సింహముఖుడు అనే రాక్షసులు ఉండేవారు. వారు అనేక వరాలను పొంది, బలగర్వితులై సకల లోకవాసులనూ హింసిస్తూ ఉండడంతో దేవతలందరూ కలసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అందుకు ఆయన దేవతలకు  ప్రస్తుతం శివుడు తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకుంటే వారికి జన్మించే పుత్రుడు అసురులను అంతమొందిస్తాడు అని మార్గ నిర్దేశం చేసాడు. 

శివుడు తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకునేలా చేసేందుకు దేవతలు మన్మథుడిని పంపగా శివుడు మూడవ నేత్రం తెరిచి మన్మథుడిని భస్మం చేసాడు. అయితే తారకాసురుడిని అంతమొందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. 

శివ పార్వతులు కలిసిఉన్న సమయంలో శివుడి రేతస్సు పతనమై భూమిపై పడింది. దానిని భూమి భరించలేక అగ్నిలో పడేసింది. అగ్ని దానిని గంగలో వదలగా, దానిని గంగ తన తీరంలోని శరవణముపైకి (రెల్లుగడ్డిపైకి ) తోసి వేసింది. అక్కడే కుమారస్వామి జన్మించాడు. శరవణమున జనించిన స్వామి కనుక ఆయనకు శరణభవుడు అనే పేరు వచ్చింది. ఈ విధంగా జన్మించిన కుమారస్వామిని పెంచేందుకు శ్రీమహావిష్ణువు ఆరుగురు కృత్తికలను నియమించాడు. కృత్తికల చేత పెంచబడటం వలన స్వామికి కార్తికేయుడు అనే పేరు వచ్చింది. దేవతలను, సకల లోకవాసులను రక్షించేందుకు శివుడి నుండి భాగమై వచ్చినవాడు కనుక కుమార స్వామికి స్కందుడు అనే పేరు ఏర్పడింది. 

తమిళనాడులో వ్యాప్తిలో ఉన్న జన్మ వృత్తాంతం 

శివుని మూడవ నేత్రం నుండి వెలువడిన ఆరు వెలుగు కిరణాలు నదిలో పడి తీరంలో ఆరుగురు శిశువులుగా మారాయి. ఆరుగురు కృత్తికలు వారిని పెంచటానికి నియమింపబడ్డారు. ఒకరోజు పార్వతీదేవి వారి వద్దకు వచ్చి ఆరుగురిని కలిపి ఒకే శిశువుగా మారుస్తుంది. అందుకే స్వామికి ఆరు ముఖాలు, పన్నెండు చేతులు ఉంటాయి. 

శివ పార్వతుల వద్దకు చేరిన కుమార స్వామికి దేవతలు దేవసేనాధిపత్యం ఇచ్చారు. దేవసేనాధిపత్యం స్వీకరించిన స్కందుడు తారకాసురుడిపై దండెత్తి అతన్ని, అతని సోదరుడైన సింహముఖున్ని అంతమొందించి దేవతలను, ప్రజలను రక్షించాడు. 

స్కంద పంచమి / స్కంద షష్ఠి / సూరసంహారం 

తారకాసురుడి సోదరుడు సూరపద్ముడిపై కుమారస్వామి దండెత్తి ఆరు రోజుల పాటు యుద్ధం చేసాడు. ఆ యుద్ధం కార్తీక మాస శుక్ల పాడ్యమి రోజున మొదలైంది. యుద్ధంలో ఆరవ రోజు సూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి తలపడ్డాడు. స్కందుడు శూలాయుధం ప్రయోగించి ఆ పక్షిని రెండుగా ఖండించగా ఒకటి నెమలిగా, రెండవది కోడిపుంజుగా మారి స్వామిని శరణువేడాయి. స్వామి కరుణించి నెమలిని వాహనంగా, కోడిని ధ్వజంగా చేసుకున్నారు. 

ఆ రోజును సూరసంహారంగా, స్కంద షష్ఠిగా వేడుక జరుపుకుంటారు. కార్తీక మాసంలో శుక్ల పక్ష షష్ఠిని సూరసంహారం పేరుతో ఆరు రోజుల ఉత్సవంగా జరుపుకుంటారు. స్కందషష్ఠిని మిగులు రోజు కాకుండా పంచమి, షష్ఠి తిథులు కలిసి ఉన్న రోజే జరుపుకుంటారు. 

స్వామికి ఇరువురు దేవేరులు 

కుమార స్వామికి ఇద్దరు భార్యలు, వల్లీదేవి, దేవసేనలు. తారకాసురుడిని అంతమొందించిన తర్వాత దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను కుమారస్వామికి ఇచ్చి వివాహం చేస్తాడు. తిరుత్తణి ప్రాంత పాలకుడైన నందిరాజు కుమార్తె వల్లీదేవిని వేటగాడి రూపంలో వెళ్లిన స్కందుడు వివాహం చేసుకున్నట్లు ఒక కథ వ్యాప్తిలో ఉంది. 

కావడి మొక్కుల దేవుడు 

పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్లిన సమయంలో శివుడు రెండు కొండలను ఇచ్చి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకువెళ్లామన్నాడు. అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికి ఇచ్చి వాటిని తన వెంట తీసుకరమ్మనగా ఇదంబుడు వాటిని కావడిలో ఉంచి తీసుకురాసాగాడు. 

పళని ప్రాంతానికి వచ్చేసరికి ఇదంబుడికి ఆయాసం వచ్చి కాసేపు విశ్రాంతి కోసం ఆగాడు. ఆ తర్వాత కావడిని ఎత్తగా ఒకే వైపు పైకి లేచింది. మరోవైపు లేవకపోవటంతో వెనక్కు తిరిగి చూడగా దానిపై కుమారస్వామి నిలబడి ఉన్నాడు. ఇదంబుడు కుమారస్వామిని కొండదిగి వెళ్ళిపొమ్మన్నాడు. పోకపోవటంతో వారిద్దరి మధ్య యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు. ఆ విషయం తెలుసుకున్న అగస్త్యుడు ప్రార్థించటంతో స్వామి తిరిగి ఇదంబున్ని బతికించాడు. ఈ విషయం తెలుసుకున్న ఇదంబుడి భార్య కృతజ్ఞతగా కావడితో పాలను తీసుకువెళ్లి స్వామికి సమర్పించింది. అప్పటినుండి కావడి మొక్కులను సమర్పించటం ఆచారమైంది. కాగా కావడికి ఉపయోగించే బద్దను బ్రహ్మ దండానికి, కావడికి ఉపయోగించే తాళ్లను అష్టనాగులకూ ప్రతీకలుగా భావిస్తారు. 

స్కంద పంచమి /షష్ఠి వ్రత విధానం 

స్కంద షష్ఠి వ్రతమును పాటించేవారు ప్రతినెలా శుక్ల పక్ష షష్ఠి రోజున అంటే పంచమి, షష్ఠి కలిసిన రోజున ఉపవాసం ఉండాలి. కార్తీక మాసములో సూర సంహారం సందర్భంగా ఆరు రోజుల పాటు ఉపవాసం పాటిస్తారు. స్వామి షోడశోపచార పూజ చేసి స్వామి స్తోత్రాలను పఠించాలి. 

సుబ్రమణ్య స్వామి స్తోత్రాలు  

0/Post a Comment/Comments

Previous Post Next Post