వ్యాస పూర్ణిమ | గురు పూర్ణిమ

వేదాలను, పంచమ వేదమైన మహాభారతాన్ని మనకందించిన వ్యాసమహర్షి జన్మించిన ఆషాఢ పౌర్ణమి వ్యాస పూర్ణిమగా చెప్పబడింది. వ్యాసుడు జగద్గురువు కనుక ఆయన జయంతిని గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం.

వేద వ్యాసుని జన్మ వృత్తాంతం 

కృతయుగ ప్రారంభ సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మ వక్షస్థలం నుండి ధర్ముడు పుట్టాడు. ఆ ధర్ముడికి నరుడు, నారాయణుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మహా తపస్సంపన్నులైన వారిద్దరూ అవసరమైన సమయంలో ధనుర్ధారులై రాక్షస సంహారం చేస్తారు. మిగిలిన సమయమంతా బదరికాశ్రమంలో తపస్సులో ఉంటారు. 

భూలోకానికి పైన భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము అనే అయిదు లోకాలు దాటిన తర్వాత సత్యలోకానికి కిందుగా తపోలోకము ఉంది. ఆ లోకములో తపస్వులు, సిద్ధులు ఉంటారు. వారు తమ ఇచ్ఛ మేరకు కింద లోకాలలో జన్మనెత్తడం, తిరిగి వెళ్లిపోవడం అనేది యుగ యుగాలుగా జరుగుతుంది. అటువంటి తపస్వులలో ఒకరైన అపాంతరముడనే మహర్షి ఒకరోజు బదరికాశ్రమానికి వచ్చాడు. 

ఆ మహర్షిని నర, నారాయణులిద్దరూ భక్తితో పూజించారు. దానికి సంతోషించిన మహర్షి వారితో ఇలా అన్నాడు. "నర, నారాయణులారా... మీకు గుర్తున్నదా, సహస్ర కవచుడనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి విచిత్రమైన వరం కోరుకున్నాడు. వేయ్యేళ్లు తపస్సు చేసినవాడు, తనతో వేయ్యేళ్లు యుద్ధం చేసినప్పుడు మాత్రమే పోయేటంత సురక్షితమైన కవచం కావాలన్నాడు. అటువంటి వేయి కవచాలు అతను వరంగా పొందాడు. ఆ రోజుల్లో మీరు వాడితో ఒకరు యుద్ధం, ఒకరు తపస్సు చొప్పున నిర్వహిస్తూ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను పోగొట్టారు. చివరిగా నరుడి వంతు వచ్చింది. మిగిలిపోయిన ఆ ఒక్క కవచంతో సహస్ర కవచుడు ఇప్పుడు సూర్యమండలంలో దాక్కున్నాడు. సూర్యుని శరణు పొందిన ఆ రాక్షసున్ని వధించటం అప్పట్లో సాధ్యం కాలేదు. ఇన్నేళ్లకు మళ్ళీ ఆ రాక్షసుణ్ణి సూర్యుడు నేలమీదకు పంపబోతున్నాడు. వాడిని వధించాల్సిన బాధ్యత నర మహర్షీ నీదే." 

"అలాగే మహర్షీ. వాడు నేల మీదకు వచ్చిన తర్వాత కదా" అని నరుడు బదులిచ్చాడు. 

"అంతే. కానీ వాడిని చంపేందుకు మీరు కూడా కొత్త జన్మలెత్తాలని బ్రహ్మ ఆదేశం. ఇప్పటికే ద్వాపర యుగం పూర్తి కావస్తున్నది. రాక్షసుల వల్ల ధర్మం కల్లోలితమవుతున్నది. కృత యుగం నాటి జీవులు మీరు. ఇప్పుడున్నవారంతా అల్ప ప్రాణులు. మీ మహా దేహాలతో నేటివారిని నిర్జించటం చాలా సులువు, కానీ ధర్మం అందుకు అంగీకరించదు. అందువల్ల మీరు జన్మ తీసుకోక తప్పదు. కంస చాణూరులను, ఇంకా అనేక రాక్షసులను సంహరించి ధరాభారం తగ్గించటానికి నారాయణ మహర్షి దేవకీ గర్భాన శ్రీకృష్ణుడిగా జన్మించాలి. కర్ణ వధ కోసం నరుడు పాండవ మధ్యముడైన అర్జునుడిగా అవతరించాలి." అన్నాడు అపాంతరముడు.

"సరే స్వామి" అన్నారు నర నారాయణులిద్దరూ. 

అక్కడినుండి అంతర్థానమైన అపాంతరముడు యమునా తీరంలో మత్స్యగంధికి సద్యో గర్భాన ఆషాఢ పూర్ణిమ రోజు ఉదయించాడు. సద్యోగర్భమంటే గర్భధారణ, నెలలు నిండటం, శిశువు పుట్టి పెరిగి పెద్దవాడవటం వంటి దశలన్నీ లేకుండా పోవటమే. పరాశర మహర్షి అనుగ్రహించిన వెంటనే యోజనగంధికి కృష్ణ ద్వైపాయనునిగా పుట్టగానే తరుణ వయస్కుడయ్యాడు. తలచుకున్న వెంటనే వచ్చి అడిగిన పని చేసి పెడతానని తల్లికి మాటిచ్చి తపస్సుకు వెళ్ళిపోయాడు. 

హిమాలయ ప్రాంతంలో తపస్సు చేసి అపారంగా ఉన్న వేదరాశిని విభజించి వేద వ్యాసుడయ్యాడు. శిష్యులకు వేదబోధ చేస్తూ అరణ్యకాలుగా, బ్రాహ్మణాలుగా, ఉపనిషత్తుల ఆవిర్భావానికి ప్రేరకుడయ్యాడు. కురు వంశాన్ని కాపాడటానికి దృతరాష్ట్ర, పాండురాజు మరియు విదురుల జన్మకు కారకుడయ్యాడు. ఇప్పటికీ వేదవ్యాసుడు బదరికాశ్రమంలో సజీవంగా ఉన్నాడని విశ్వసిస్తారు. 

మహా భారతంలో 

శ్రీమన్నారాయణుడు ప్రజాసృష్టి చేయటానికి సంకల్పించిన వెంటనే అతని నాభికమలం నుండి బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మ ముఖం నుండి వేదాలు ప్రసరించాయి. వాటికి మేలు చేయటానికి సంకల్పించిన బ్రహ్మ ఒక అపార జ్ఞానిని పుత్రునిగా పొందాడు. ఆయనే అపాంతరముడు. ఆయన వేదాలన్నింటినీ అధ్యయనం చేసి క్రమబద్ధం చేసాడు. అందుకు సంతోషించిన శ్రీమన్నారాయణుడు అన్ని మన్వంతరాలలో మిక్కిలి ఆనందం పొందుతావని వరమిచ్చాడని మహాభారతంలో శాంతి పర్వం చెబుతుంది. 

వ్యాస పూర్ణిమ సంకల్పం

"గురు పరంపరాసిద్ధ్యర్థం వ్యాసపూజాం కరిష్యే"

0/Post a Comment/Comments

Previous Post Next Post