ఉపగ్రహాలు ఢీకొంటాయా?

ఉపగ్రహాలు ఢీకొంటాయా?
మానవ నిర్మిత శాటిలైట్లు, గ్రహాల చుట్టూ గానీ, ఉపగ్రహాల చుట్టూ గానీ వాటికి నిర్దేశించిన దీర్ఘవృత్తాకార కక్ష్యలలో పరిభ్రమిస్తూ ఉంటాయి. అయితే ఇవి ఒకదానితో ఒకటి గుద్దుకుంటాయా? చరిత్ర లో అలా జరిగిన సందర్భాలున్నాయా?  

కృత్రిమ ఉపగ్రహాలు కూడా ఆక్సిడెంట్లకు గురవుతాయి. కొన్ని సార్లు ఉపగ్రహాలు అనుకోకుండా ఒకదానితో ఒకటి ఢీకొన్న సందర్భాలున్నాయి. అత్యధిక వేగంతో ఢీకొన్నప్పుడు అవి అంతరిక్ష శిధిలాలు (space debris) గా మారతాయి. వాటిలో ప్రముఖమైనది అమెరికాకు చెందిన ఇరిడియం-33 మరియు రష్యా కు చెందిన కాస్మోస్-2251 ఉపగ్రహాల మధ్య జరిగింది. 2009 ఫిబ్రవరి 10వ తేదీన ఇవి భూమి నుండి 789 కిలోమీటర్ల ఎత్తులో, గంటకు 41,120 కిలోమీటర్ల వేగం తో సైబీరియా ప్రాంతంపై ఢీకొన్నాయి. ఆ దానితో అవి రెండూ పూర్తిగా ధ్వంసమై వందల ముక్కలుగా విడిపోయాయి. ఆ ముక్కల్లో కొన్ని పూర్తిగా నాశనమైనప్పటికీ మిగిలినవి భవిష్యత్తులో ఉపగ్రహాలను ఢీకొని నష్టం కలిగించే అవకాశం ఉంది. 

ఇలా రెండు కృత్రిమ ఉపగ్రహాలు ఢీకొనటం ఆ సమయంలో ప్రపంచం దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండేందుకు అన్ని దేశాల అంతరిక్ష సంస్థల కోసం నియమనిబంధనలు రూపొందించాలని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు.

1996లో కూడా ఫ్రాన్స్ కు చెందిన సిరీస్ ఉపగ్రహం, ఆ దేశానికే చెందిన ఏరియాన రాకెట్ యొక్క శిథిలాలను ఢీకొంది. 2013 జనవరిలో ఫంగ్యున్ FY-1C ఉపగ్రహ శిధిలాలు, రష్యన్ బ్లిట్స్ శాటిలైట్ ను, అదే సంవత్సరం మే నెలలో ఈక్వెడార్ యొక్క పెగాసో మరియు అర్జెంటీనా యొక్క క్యూబ్ బగ్-1 శాటిలైట్లు ఢీకొన్నాయి. అయితే ఇవన్నీ నానో శాటిలైట్లు. 

అయితే కృత్రిమ ఉపగ్రహాలను ఉద్దేశ్యపూర్వకంగా రాకెట్లతో ఢీకొట్టి నాశనం చేసే ప్రయోగాలు కూడా కొన్ని జరిగాయి. అమెరికా, రష్యా, చైనాలు ఇలాంటి ప్రయోగాలు జరిపాయి. మనదేశంలో  ఈ తరహా పరిశోధన, ఇంకా  ప్రయోగాల దశకు చేరలేదు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post