వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిన, కేంబ్రిడ్జ్ అనలిటికా కేసులో ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌కు, అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టిసి) 5 బిలియన్ డాలర్ల (సుమారు ₹35000 కోట్లు) భారీ జరిమానా విధించింది. అయితే దీనిని న్యాయశాఖ ఇంకా ఆమోదించవలసి ఉంది. ప్రపంచంలో ఒక టెక్నాలజీ సంస్థపై, ఒక దేశం ఇంత భారీ మొత్తంలో జరిమానా విధించడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు రికార్డు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ పేరిట ఉంది. 2012లో ఆ సంస్థ 22 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించింది.
జరిమానాపై రాజకీయ విభజన
వినియోగదారుల సమాచార రక్షణ, గోప్యత చట్టాల ఉల్లంఘనపై ఫేస్‌బుక్ సంస్థ ఐదు బిలియన్ డాలర్ల జరిమానా చెల్లింపునకు సిద్ధమై, అమెరికా నియంత్రణ మండలి ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టిసి)తో సెటిల్‌మెంట్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందానికి ఎఫ్‌టిసిలోని ముగ్గురు రిపబ్లికన్ సభ్యులు అనుకూలంగా, ఇద్దరు డెమొక్రాట్ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయడంతో, దీనికి 3-2 ఓట్ల తేడాతో ఆమోదం లభించింది.
కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ఫేస్‌బుక్ సంస్థ వినియోగదారులకు సంబంధించి వివిధ 'ఆప్'లను కూడా అందిస్తుంది. వినియోగదారుల వ్యక్తిగత వివరాలు, ఆలోచనలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సంస్థ ఒక క్విజ్‌ను రూపొందించింది. దానిని దాదాపు మూడు లక్షల మంది వినియోగదారులు ఉపయోగించారు. అయితే ఆ యాప్ వినియోగించిన మూడు లక్షల మందితో పాటు, వారికి మిత్రులుగా ఉన్న 8 కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలను ఫేస్‌బుక్ అక్రమంగా కేంబ్రిడ్జ్ అనలిటికా అనే బ్రిటన్‌కు చెందిన రాజకీయ సలహా సంస్థకు అమ్మింది. ఈ వినియోగదారుల సమాచారాన్ని అమెరికాతో సహా వివిధ దేశాల ఎన్నికలలో, తమకు అనుకూల/ డబ్బులు చెల్లించిన రాజకీయ పార్టీల ప్రచారానికి వాడినట్లుగా ఆరోపణలున్నాయి.
పెరిగిన ఫేస్‌బుక్ షేర్లు
ఇప్పటికే 5 బిలియన్ డాలర్ల ఒప్పందానికి ఫేస్‌బుక్ సంస్థ కేటాయింపులు జరిపింది. ఒకసారి ఒప్పందం ప్రభుత్వ ఆమోదం పొందిందనే వివరాలు బయటకు రాగానే షేర్లు 1.8% వరకు పెరిగాయి.
Post a Comment