ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్ కృష్ణ గారి సతీమణి విజయనిర్మల(73) ఇక లేరు. గతకొంతకాలంగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆమె, నిన్న రాత్రి కన్నుమూశారు.
1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో జన్మించారు. విజయనిర్మల తండ్రి చెన్నైకి చెందినవారు కాగా, తల్లిది గుంటూరు జిల్లా నరసరావుపేట. చిన్ననాటి నుండే ఆమె సోదరి వద్ద భారతనాట్యం అభ్యసించేవారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీ రంగానికి రాగా, 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. రంగులరాట్నం చిత్రం ద్వారా తెలుగులో కథానాయికగా మారారు. తెలుగు, తమిళ, మలయాళ భాషలలో ఆమె నటించేవారు. 1971లో తొలిసారి మీనా చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
విజయ నిర్మల గారి అసలు పేరు నిర్మల. అప్పటికే సినిమా రంగంలో ఒక నిర్మల (నిర్మలమ్మ) ఉండడంతో, ఈమెను, తను నటించిన మొదటి సినిమాకు చెందిన విజయ స్టూడియో పేరుతొ "విజయ నిర్మల" గా పిలిచేవారు. క్రమంగా అదే పేరు స్థిరపడింది.
- తెలుగు, తమిళ, మలయాళ భాషలలో కలిపి విజయ నిర్మల గారు 200కుపైగా చిత్రాల్లో నటించారు.
- సాక్షి చిత్రంలో తొలిసారి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించిన ఆమె, ఆయనతో ఏకంగా 47 చిత్రాల్లో నటించారు.
- సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై 15కుపైగా చిత్రాలను నిర్మించారు.
- తెలుగులో కథానాయికగా నటించిన తన తొలి చిత్రం రంగులరాట్నంకి నంది బహుమతిని అందుకున్నారు.
- తెలుగు సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన రఘుపతి వెంకయ్య అవార్డును ఆమె 2008లో అందుకున్నారు.
- 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు.
మీనా, కవిత, దేవదాసు, దేవుడు గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, కిలాడీ కృష్ణుడు, భోగి మంటలు, పుట్టింటి గౌరవం, నేరము శిక్ష ఆమె దర్శకత్వం వహించిన చిత్రాల్లో ముఖ్యమైనవి. ఆమె దర్శకత్వం వహించిన/నటించిన చిత్రాలలో అత్యధికం కృష్ణ నటించినవే కావడం విశేషం.
Post a Comment