బిజెపితో సమరానికి కెసిఆర్ సన్నద్ధం

తెలంగాణ రాష్ట్ర సమితి, రాష్ట్రంలో బిజెపిని ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సన్నాహాలపై జరిగిన విలేఖరుల సమావేశంలో కూడా ఆయన అదే ధోరణిని ప్రదర్శించారు. 

రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కన్నా, బిజెపియే బలమైన శత్రువుగా కనిపించడం మొదలైంది. దీనికి కాంగ్రెస్ అసమర్ధతతో పాటు టిఆర్ఎస్ అనుసరించిన విధానాలు కూడా కారణమే. రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఫిరాయింపులు ప్రోత్సహించడం ద్వారా బలహీనపర్చమే కాక, ప్రజలలో కొంత వ్యతిరేకతను తెచ్చుకున్నారు. దీని వలన రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. బిజెపి ఆ శూన్యతను భర్తీ చేసే దిశగా బలపడుతోంది. బిజెపి అతివాద, హిందుత్వ విధానాలు, ఎంఐఎం తో టిఆర్ఎస్‌కు ఉన్న దోస్తీ కూడా దీనికి దోహదపడ్డాయి.  

గత అయిదేళ్లుగా టిఆర్ఎస్ నేతలు, కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి సహకరించట్లేదని గాని, నిధులు కేటాయించడం లేదనిగాని, బిజెపి పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యతనిస్తుందని గాని, విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చడంలేదని గాని పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. పైగా నోట్ల రద్ధు, జిఎస్టి లాంటి విషయాలలో మరియు రాష్ట్రపతి ఎన్నికలలో సహకరించారు కూడా. అందుకే  బిజెపితో అప్రకటిత మైత్రి కొనసాగిస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. అప్పట్లో బిజెపిని విమర్శిస్తే కాంగ్రెస్ బలపడుతుందేమోనన్న అనుమానంతో వారు అలా వ్యవహరించినట్లు తెలుస్తుంది.   

ఎంపీలతో జరిగిన సమావేశంలో కెసిఆర్ గారు, ఢిల్లీలో మనకు మిత్రులూ లేరు.. శత్రువులూ లేరు... అంటూనే, గత ఐదేళ్లుగా కేంద్రం అన్యాయమే చేసిందని, రాష్ట్రానికి పన్నుల వాటా నిధులు తప్ప అదనంగా ఒక్క రూపాయి రాలేదని అన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైలు బోగీల కర్మాగారం లాంటి విభజన హామీలు నెరవేర్చలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇవ్వలేదని, మిషన్‌ భగీరథ, కాకతీయ లాంటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చలేదని... ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదనే భావన వచ్చే విమర్శలెన్నో చేశారు. ఎంపీలు, విషయ పరిజ్ఞానం పెంచుకుని, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సన్నాహాలపై జరిగిన విలేఖరుల సమావేశంలో కూడా ప్రధానంగా కేంద్రం రాష్ట్ర ప్రాజెక్టులకు సహకరించడం లేదని, నిధులు ఇవ్వడం లేదని విమర్శలు చేశారు. 

రాష్ట్ర అభివృద్ధికి బిజెపి సహకరించడం లేదని, తాము మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలమనే భావనలను ప్రజలలో కలిగించడం ద్వారా కెసిఆర్ గారు ఆ పార్టీని ఎదుర్కోదలచుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో భవిష్యత్ ఎన్నికలను ఆయన, రాష్ట్ర ప్రయోజనాలకు, అతివాద జాతీయ భావానికి మధ్య పోరాటంగా చూపించే ప్రయత్నం చేయనున్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post