తెలంగాణా ప్రాంతంలోని ధర్మపురి, మంచిర్యాలలో ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది పట్టుబడిన విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ఆర్పీ ఠాకూర్ ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చారు. తమ పోలీసు సిబ్బంది తెలంగాణాలో సంచరించటానికి, శాసనసభ ఎన్నికలకు సంబంధం లేదని ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం నిర్మూలన ఆపరేషన్లలో భాగంగానే అక్కడకు వెళ్లారని తెలిపారు. తమకు సంబంధంలేని ఎన్నికల విషయాలలో జోక్యం చేసుకుంటే చర్యలు తీసుకోవచ్చని కూడా సూచించారు.
తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి మాత్రం ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది, ఎన్నికలపై సర్వే నిర్వహిస్తూ పట్టుబడ్డారని నివేదిక ఇచ్చారు. వారి దగ్గర సంబంధిత ఐడీ కార్డులు కూడా లేవని, వారి ఫోన్ నంబర్లు మాత్రం అడిషనల్ డిజిపి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయని కూడా తెలిపారు. కాగా టిఆర్ఎస్ పార్టీ ఆరోపించిన ఏపీ పోలీసులు డబ్బులు పంచుతున్నారన్న విషయాన్ని మాత్రం ఆయన నివేదికలో నిర్ధారించలేదు.
రాష్ట్ర విభజనకు ముందు తీవ్ర ఆందోళనలతో అట్టుడికిన తెలంగాణా ప్రాంతం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత శాంతి భద్రతల పరంగా మెరుగైన స్థితిలో ఉంది. చెప్పుకోదగ్గ ఘటనలు ఏమీ అక్కడ జరగలేదు. ఈ సమయంలో ఏపీ ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాద నిర్మూలన ఆపరేషన్లలో భాగంగా సిబ్బందిని వినియోగిస్తున్నామని చెప్పటం తాము చేస్తున్న తప్పును కవర్ చేసుకోవటంలా కనిపిస్తుంది.
ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించే కొంతమంది నాయకులు తెలంగాణ ఏర్పడితే అక్కడ ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం పెరుగుతుందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని వాదించేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదుల దాడిలో ప్రస్తుత ఎమ్మెల్యే మరియు మాజీ ఎమ్మెల్యే చనిపోయారు. ప్రతిపక్షనేతపై హత్యాయత్నం, రైలును, పంటలను తగలబెట్టడం లాంటి మరికొన్ని శాంతి భద్రతల వైఫల్యాలను సూచించే సంఘటనలు కూడా జరిగాయి. ఇలాంటివే తెలంగాణా ప్రాంతంలో జరిగితే దానిని తీవ్ర వైఫల్యంగా ఇప్పుడు మౌనంగా ఉన్న మీడియా సంస్థలు, నాయకులు గళమెత్తేవారు.
Post a Comment