జనసేన ఆవిర్భావం తరువాత రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ ఉంటుందని అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఆ పార్టీ ఈ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?, సొంతంగా పోటీ చేస్తారా?, ఎవరికైనా మద్ధతిస్తారా? లేక ఇటు పోటీ చేయకుండా అటు మద్దతివ్వకుండా ఉండిపోతారా? వంటి అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే జనసేన పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో ఒకసారి విశ్లేషించుకుందాం.
తెలంగాణాలో కూడా పవన్ కళ్యాణ్‌కు అభిమానులు ఉన్నారు. పార్టీ తరపున ఎన్నికలలో పోటీపడాలనుకునే కొంతమంది ఔత్సాహికులు ఉన్నారు. ఇక్కడ కూడా ఆయన కొండగట్టు, కరీంనగర్ మరియు ఖమ్మం ప్రాంతాలలో పర్యటించారు. ఇటీవలికాలంలో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆయన దృష్టి పెట్టారు. కొంతమంది నాయకులు చేరడం, కొన్ని ప్రాంతాలలో క్యాడర్ ఏర్పడటం కూడా జరిగాయి. కానీ తెలంగాణాలో ఇప్పటి వరకు పెద్దగా అటువంటి ప్రయత్నాలేం జరుగలేదు.
పార్టీ సంస్థాగతంగా బలంగా లేకపోవటంతో ఇక్కడ ఒంటరిగా పోటీకి దిగితే కేవలం అభిమానుల మద్ధతును, రెబల్ అభ్యర్థులను నమ్ముకోవలసి వస్తుంది. 2009లో ప్రజారాజ్యం కూడా తెలంగాణలో కేవలం రెండు సీట్లలో, అదీ రెబల్ అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు. ఇక్కడ సొంతంగా పోటీకి దిగి అతి తక్కువ సంఖ్యలో ఓట్లు సాధిస్తే, అది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఆయన ఇమేజ్‌కు కొంత నష్టం కలిగించవచ్చు. తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవటం వలన పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రయత్నం చేయకపోవచ్చు.
ముందస్తు ఎన్నికలవటం మూలాన తాము సిద్ధంగా లేమని, కాబట్టి ఒంటరిగా బరిలోకి దిగబోమని, పొత్తుల విషయం ఆలోచిస్తామని ఒక సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు. చేగువేరా అభిమాని అయిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో కొన్నిసార్లు వామపక్షాలతో కలిసి పనిచేయటం, ఉద్యమాలలో పాల్గొనటం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సిపిఎం, బిఎల్ఎఫ్ లు తెలంగాణాలో తమతో పొత్తు పెట్టుకొమ్మని అడిగాయి. కానీ పవన్ మాత్రం స్పందించలేదు. ఇక్కడ అంతంత మాత్రంగా ఉన్న ఆ పార్టీలతో పొత్తు వలన పెద్దగా ప్రయోజనం ఉండదని ఆయన భావిస్తుండవచ్చు.
కెసిఆర్‌తో సమావేశమైన తరువాత పవన్ ఆయనను, తెలంగాణాలో పరిపాలనను పొగిడారు. అయితే అలా అని ఆయన టిఆర్ఎస్‌కు మద్ధతు ఇస్తారని అనుకోలేము. ఎందుకంటే ఇక్కడ టిఆర్ఎస్‌తో చేసుకునే అవగాహన ఆంధ్రప్రదేశ్‌లో ఆయనకు నష్టంగా పరిణమించవచ్చు. అంతేకాక టిడిపి ఇప్పటికే టిఆర్ఎస్‌ను, బిజెపితో అంటగడుతూ విమర్శలు చేస్తోంది. బిజెపితో పవన్‌కు కూడా సంబంధాన్ని అంటగట్టే అవకాశం కల్పించినట్లవుతుంది.
జగ్గారెడ్డి గారు అంటే అభిమానం అని ఒకసారి, వి. హనుమంతరావు గారు అంటే ఇష్టమని మరొకసారి ఆయన వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పటికే తెలుగుదేశం ఉన్న కూటమిలో ఆయన చేరే అవకాశం లేదు. మహా అయితే వ్యక్తిగతంగా వారికి మద్ధతు ప్రకటించవచ్చు. ఒకవేళ మహా కూటమికి మద్దతిచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగు దేశం, జనసేన పార్టీలు ఒకటే అని విమర్శించవచ్చు.
గత ఎన్నికలలో ఇక్కడ చాలా నియోజకవర్గాలలో పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా తెలంగాణా నుండి వైదొలగింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ముఖ్యం మరియు అక్కడ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా. ఈ సమయంలో ఆయన అనవసరంగా తెలంగాణా ఎన్నికలలో కల్పించుకుని లేని ఇబ్బందులు తెచ్చుకోవాలని అనుకోకపోవచ్చు.
Post a Comment