ఎంఎంటిఎస్ పై ఇంత నిర్లక్ష్యమెందుకు?

ఎంఎంటిఎస్ పై ఇంత నిర్లక్ష్యమెందుకు?
హైదరాబాద్ లో మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్ (ఎంఎంటిఎస్) అనే ప్రజా రవాణా వ్యవస్థ ప్రారంభమై ఇవాళ్టికి సరిగ్గా పదిహేనేళ్ళు. ఆగస్టు 9, 2003 లో 44 కిలోమీటర్లతో ప్రారంభమైన ఈ వ్యవస్థ విశేష ప్రజాదరణ పొందినది. ఇప్పుడు దీనిలో రోజుకు సరాసరిన  1.7 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.  

2003 నుండి ఈ 44 కిలోమీటర్ల వ్యవస్థకు కనీసం ఒక కిలోమీటరు కూడా అదనంగా జతపరచలేదు. 2010 వ సంవత్సరంలో 107 కిలోమీటర్లతో ఫేజ్-2 పనులు ప్రారంభిస్తున్నామని రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించాయి. ఇప్పటి వరకూ కనీసం దానిలో ఒక భాగమైనా ప్రారంభానికి నోచుకోలేదు. 

హైదరాబాద్ మెట్రో వ్యవస్థను ఎన్నికలలోగా ప్రారంభిస్తామని ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటివరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీనికి బాధ్యత వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం అసలే స్పందించదు. రైల్వే శాఖ ఫేజ్-2 సిద్ధమైందని త్వరలో ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. ఆ త్వరలో ఎప్పుడో చెప్పడం మాత్రం కష్టమే. 

మెట్రోలో ప్రయాణించాలంటే రాను యాభై రూపాయలు, పోను యాభై రూపాయలు చార్జీలు భరించాలి. అందరూ ఆ స్థాయి స్తోమత కలిగినవారే ఉండరు. 5-10 రూపాయలతో అంతకన్నా ఎక్కువ దూరం ప్రయాణించగలిగే సౌలభ్యం ఎంఎంటిఎస్ లో ఉంది. కానీ ఈ రైళ్ల నిర్వహణలో, విస్తరణలో భారీ నిర్లక్ష్యం చోటు చేసుకుంది. 

రైల్వే శాఖకు మొదటినుండి మన రాష్ట్ర ప్రాజెక్టులంటేనే నిర్లక్ష్యం. ఎంఎంటిఎస్ రైళ్లకు ఇప్పటివరకు ప్రత్యేక ట్రాకులు లేవు. సమయ పాలన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. ఉన్నదే 15 నుండి 30 నిమిషాలకు ఒక రైలు. పీక్ టైంలో ఎప్పుడూ గంటల తరబడి నిరీక్షించినా కనిపించవు. ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్ పడి ఆగుతాయి. ట్రాక్ లపై అతి తక్కువ ప్రాధాన్యత మన లోకల్ రైళ్లకే. ముంబయిలో అయితే  లోకల్ రైళ్లకే తోలి ప్రాధాన్యం, ప్రతి 3-5 నిమిషాలకు ఒక రైలు, ఖచ్చితమైన సమయపాలన. రాశి మరియు వాసి రెండింటిలో మనకూ, ముంబయికి హస్తిమశకాంతరం తేడా.

కేంద్రం రైల్వేలకు ఆదాయాన్ని సమకూర్చి పెట్టే దక్షిణాదిపై చూపే నిర్లక్ష్యం గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. మనం ఇప్పుడు ఈ విషయం ప్రస్తావించటం కూడా దండగే. 

ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికొస్తే వేల కోట్లు, లక్షల కోట్లు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నామని ప్రకటిస్తుంది. కొన్ని వందల కోట్లతో నగరంలో ట్రాఫిక్ ను, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే ఈ ప్రజా రవాణా వ్యవస్థను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. మెట్రోలో 50 వేల మంది ప్రయాణిస్తే అది కెటిఆర్ ట్వీట్ చేసే వార్త అవుతుంది. దాదాపు రెండు లక్షల మంది ప్రయాణించే ఎంఎంటిఎస్ ఇబ్బందులు ఆయనకు పట్టవు. బస్సు స్టాప్ ల పక్కనే ఉండే మెట్రో స్టేషన్లకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఫీడర్ సర్వీసులు, బైకులు ఇంకా చాలా చేస్తున్నారు. దూరంగా ఉండే  ఎంఎంటిఎస్ స్టేషన్లపై దీనిలో పది శాతం దృష్టి పెట్టినా బాగుపడతాయి. మన మీడియాలో కూడా మెట్రో గురించిన వార్తలు రోజూ వస్తుంటాయి. కానీ ఎంఎంటిఎస్ ఎప్పుడోకానీ కనిపించదు. 

మంగళవారం రోజు దేశవ్యాప్తంగా రవాణా బంద్ పాటించటంతో ఆరోజు ఎంఎంటిఎస్ రైళ్లలో 2.1 లక్షల మంది ప్రయాణించారు. ఇటువంటివి జరిగినప్పుడన్నా నగరంలో ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థల అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తే మంచిది.

0/Post a Comment/Comments

Previous Post Next Post