జగన్నాథుడి స్నాన యాత్ర

జగన్నాథుడి స్నాన యాత్ర
పూరీ జగన్నాథుడి స్నాన యాత్రా వేడుక జ్యేష్ఠ పూర్ణిమ రోజు జరుపుకుంటారు. ఇది హిందూ సంవత్సరంలో ఆలయం నుండి స్వామివార్లను తొలిసారి బయటకు తీసుకు వచ్చే సందర్భం. ఈ రోజు జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన మరియు మదన్మోహన విగ్రహాలను బయటకు తీసుకువచ్చి ఊరేగింపుగా స్నాన బేడి వద్దకు తీసుకెళతారు. అక్కడ సాంప్రదాయబద్ధంగా స్నానాభిషేకం జరిపించి అలంకరిస్తారు. 

ఈ స్నానాభిషేకానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. స్నాన యాత్రా వేడుకకు హాజరవటం పుణ్యకార్యంగా భావిస్తారు. స్కందపురాణం ప్రకారం విగ్రహ ప్రతిష్ఠాపన జరిగినప్పుడు, రాజు ఇంద్రద్యుమ్నుడు, ఈ స్నాన యాత్రా వేడుకను కూడా ఆరంభించాడు. 

స్నాన యాత్ర సందర్భంగా దేవతల విగ్రహాలు గర్భగుడి నుండి స్నాన బేడికి (స్నానం చేసే వేదిక కు), భారీ భక్తజన సందోహం మధ్య మేళతాళాలతో ఊరేగింపుగా తరలిస్తారు. దేవాలయం లోని ఉత్తరపు బావి నుండి తెచ్చిన నీటితో, మంత్రోచ్చారణల మధ్య 108 కడవలతో స్వామి వారి స్నానాభిషేకం కన్నుల పండుగగా జరుగుతుంది. సాయంత్రం స్నాన యాత్ర  ముగిసిన తరువాత జగన్నాథ మరియు బలభద్రులను  ఏనుగును తలపాగాలతో  అలంకరిస్తారు. స్వామి వారి ఈ  రూపాన్ని 'గజవేష' అని పిలుస్తారు. 

అనవాసర - జగన్నాథుడికి ఆయుర్వేద చికిత్స 

ప్రతీ సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి రోజున జరిగే స్నాన యాత్ర తర్వాత జగన్నాధ, బలభద్ర, సుభద్ర మరియు సుదర్శన విగ్రహాలను  అనవాసర ఘర్ అని పిలిచే రహస్య మందిరానికి తీసుకు వెళ్లి కృష్ణ పక్షం వరకు అక్కడే ఉంచుతారు. స్నాన యాత్ర తో దేవుళ్ళకు జలుబు, జ్వరం వస్తుందని, అక్కడ రాజవైద్యుడి సమక్షంలో ఆయుర్వేద చికిత్స జరిపిస్తారు. 

ఈ పదిహేను రోజుల పాటు దేవతలను భక్తులు దర్శించటానికి వీలు పడదు. ఆలయంలో విగ్రహాలకు బదులుగా పట చిత్రాలను భక్తుల దర్శనార్థం ఉంచుతారు.  అంతవరకూ భక్తులు బ్రహ్మగిరి అనే సమీప ఊరిలో విష్ణు స్వరూపమైన అల్వర్నాథ్ అనే నాలుగు చేతుల రూపాన్ని కొలుస్తారు. భక్తులకు కేవలం రథయాత్ర ముందు రోజు మాత్రమే మళ్ళీ స్వామి వారి దర్శనం దక్కుతుంది. దీనిని 'నవయవ్వన' అని అంటారు. 

0/Post a Comment/Comments