తెలుగు ప్రజలు అనుసరించే చాంద్రమానం ప్రకారం, ఆషాఢ మాసము సంవత్సరంలో నాలుగవ నెల. ఈ నెలలో పౌర్ణమి రోజు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం తో కలసి వస్తాడు కనుక ఈ నెలకు ఆషాఢ మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంతో మనదేశంలో వర్షఋతువు ప్రారంభమవుతుంది. గ్రామీణ ప్రజానీకమంతా వ్యవసాయ సంబంధమైన కార్యక్రమాలలో నిమగ్నమవుతుంది.
ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా ప్రరిగణిస్తారు, వ్యక్తిగత శుభకార్యాలు ఏవి జరుపుకోరు. కానీ దేవాలయాలలో మరియు గ్రామ దేవతల ఉత్సవాలు జరుపుతారు. నాలుగు నెలల చాతుర్మాస్య వ్రతం ఈ ఆషాఢ మాసం నుండే ప్రారంభమవుతుంది. బ్రాహ్మణులు ఈ సమయాన్ని ప్రత్యేకించి వేదాధ్యయనానికి వినియోగించుకుంటారు.
ఆషాఢ మాసంలో నవ దంపతులు, అత్తా కోడళ్ళు ఒకరికొకరు దూరంగా ఉంటారు. ఈ మాసంలో స్త్రీలు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకుంటారు. ఆహారంలో మునగకాయను విరివిగా వాడటం, పేలపిండిని తినడం మంచిదని భావిస్తారు.
ఆషాఢ మాస నిబంధనలు -సాంప్రదాయాలు
ఆషాఢ మాసానికి సంబంధించి అనాదిగా కొన్ని నిబంధనలు, సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ కాలంలో చాలామంది వీటిని విశ్వసించనప్పటికీ, ఇవి శాస్త్రీయ వివరణలతో ఆచరణాత్మక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉన్నాయి.
ఆషాఢమాసాన్ని శూన్య మాసంగా పరిగణిస్తారు.
ఈ మాసంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు మరియు ఉపనయనము లాంటి శుభకార్యాలు ఏవీ చేయరు. దీనికి కారణాలు
ఈ మాసంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు మరియు ఉపనయనము లాంటి శుభకార్యాలు ఏవీ చేయరు. దీనికి కారణాలు
- రుతుపవనాల వర్షం మరియు గాలుల వల్ల శుభకార్యాలు నిర్వహించడానికి కలిగే అసౌకర్యం వలననే ఈ సంప్రదాయం ఏర్పడి ఉండవచ్చు.
- ఆషాఢ మాసంలో వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. వారికి ఈ సమయంలో సరిపడే తీరిక మరియు డబ్బులు ఉండే అవకాశం లేదు కాబట్టి ఈ మాసంలో శుభకార్యాలు జరుపుకోకూడదనే నిబంధన తెచ్చి ఉంటారు.
- ఈ నెల విష్ణుమూర్తి యోగనిద్ర లోకి వెళ్లే సమయం కాబట్టి శుభ ప్రదం కాదనే నమ్మకం.
ఆషాఢ మాసంలో నవ దంపతులను ఒకరికొకరిని దూరంగా ఉంచుతారు. అత్తా కోడళ్లను కూడా ఈ మాసంలో దూరంగా ఉంచుతారు. ఈ సమయంలో ఒక వేళ అమ్మాయి గర్భం దాలిస్తే వేసవిలో శిశువుకు జన్మనిస్తుంది. వేసవి కారణంగా ఆమె మరియు శిశువు వేసవి మూలంగా సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి, ప్రజలు ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించి ఉంటారు.
ఆషాఢ మాసంలో గర్భిణులు మరియు స్త్రీలు తమ అరచేతులకు మరియు పాదాలకు గోరింటాకును పెట్టుకుంటారు. ఇది కేవలం సౌందర్యం కోసమే కాకుండా వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యల నుండి కూడా కాపాడుతుంది అని నమ్మకం.
ఈ మాసంలో వచ్చే పండగలు
ఆషాఢ శుద్ధ విదియ - జగన్నాథస్వామి రథయాత్ర
ఆషాఢ శుద్ధ ఏకాదశి - తొలి ఏకాదశి, చాతుర్మాస్య వ్రత ప్రారంభం
ఆషాఢ పూర్ణిమ - వ్యాస భగవానుని జయంతి - గురుపూర్ణిమ
ఆషాఢ బహుళ చతుర్థి - సంకటహర చతుర్థి
ఆషాఢ బహుళ ఏకాదశి - కామ ఏకాదశి
ఆషాఢ బహుళ చతుర్దశి - మాస శివరాత్రి
తొలి ఏకాదశికి ప్రథమ ఏకాదశి, శయన ఏకాదశి, మతత్రయ ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి.
ఆషాఢ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని గ్రామాలలో గ్రామదేవతలకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గ్రామ దేవతల పేరిట తమ గ్రామంలో ఏ విధమైన వ్యాధులూ రాకుండా ఉండాలని కోరుకుంటారు. ప్రత్యేకించి తెలంగాణాలో నిర్వహించే బోనాలు వీటిలో ప్రాముఖ్యత కలిగి ఉంది.
Post a Comment