విశాఖ విమానాశ్రయంలో తొలగనున్న ఆంక్షలు

విశాఖ విమానాశ్రయంలో తొలగనున్న ఆంక్షలు
విశాఖ విమానాశ్రయంలో పౌర విమానాలపై ఉన్న ఆంక్షలను పూర్తి స్థాయిలో  శాశ్వతంగా తొలగించటానికి భారత నావికాదళం అంగీకరించింది.  ఈ నిర్ణయం నవంబర్ 1, 2018 నుండి అమల్లోకి రానుంది. శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో వైస్ అడ్మిరల్ పోవార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈమేరకు హామీనిచ్చారు. 

విశాఖ విమానాశ్రయంలో శిక్షణ మరియు ఇతర నావికాదళ కార్యకలాపాల కోసం రోజుకు ఐదు గంటల పాటు  పౌర విమానాలపై ఆంక్షలు విధించారు. ఈ చర్య పౌర విమానయాన సంస్థల నుండి, ప్రజా సంఘాల నుండి మరియు ప్రజాప్రతినిధుల నుండి తీవ్ర విమర్శలకు గురైంది. దీనితో ఆంక్షలను రోజుకు మూడు గంటలకు పరిమితం చేస్తున్నామని నావికా దళం ప్రకటించింది. ఈ ఆంక్షలవల్ల పౌర విమానయాన సంస్థలు విశాఖపట్నానికి కేటాయించిన అనేక విమానాలను రద్దు చేసాయి. దీనితో పూర్తిగా తొలగించాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు నావికా దళ అధికారులతో మాట్లాడి ఈ మేరకు వారిని ఒప్పించగలిగారు. ఈ సమావేశంలో విశాఖపట్నం ఎంపీ హరిబాబు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కూడా ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post