క్రీడారంగంలో బెట్టింగ్‌ను, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలను చట్టబద్ధం చేయాలని తన 276వ నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి న్యాయ కమిషన్ సిఫారసు చేసింది. న్యాయ కమిషన్ చేసిన సిఫారసులు గతంలో న్యాయ వ్యవస్థలోనూ, పరిపాలనారంగంలోనూ అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాయి. అదే సమయంలో కొన్ని సిఫారసులు వివిధ కారణాలతో అమలుకు నోచుకోలేదు. ఇంకా చెప్పాలంటే రాజకీయ ప్రాధాన్యం ఉన్న అంశాలపై న్యాయ కమిషన్ సిఫారసులు అములులోకిరాగా.. ‘రాజకీయంగా’ ఎలాంటి ఉపయోగంలేని సిఫారసులు చెత్తబుట్టలోకి వెళ్లాయి. తాజాగా క్రీడారంగంలో బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ను నిషేధించడం వల్ల మేలుకన్నా కీడే ఎక్కువ జరుగుతోందని, నల్లధనం పెరిగి చలామణీ అవుతోందని, కాబట్టి వాటిని చట్టబద్ధం చేసి అనుమతించడం మేలని న్యాయ కమిషన్ సిఫారసు చేసింది. ఈ రెండు అంశాలపై పన్ను విధించడం ద్వారా కూడా ఆదాయాన్ని పొందొచ్చని సూచించింది.
అయితే గతంలో కొన్ని కీలక అంశాలపై న్యాయ కమిషన్ సిఫారసులు ఏమయ్యాయో పరిశీలిస్తే..
మూలన పడిన 377 సెక్షన్!
18 ఏళ్ల క్రితం.. 2000 సంవత్సరంలో భారత నేరస్మృతిలోని సెక్షన్ 377ను తొలగించాలని, లేదా దాని తీవ్రతను తగ్గించాలని న్యాయ కమిషన్ సిఫారసు చేసింది. ఈ మేరకు 172 నివేదికను లా కమిషన్ చైర్మన్ బీపీ జీవన్‌రెడ్డి కేంద్రానికి సూచించారు. ఈ నిబంధన ప్రకారం.. ‘‘ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా.. పురుషుడు, మహిళలు, జంతువులతో శృంగారంలో పాల్గొంటే వారికి జీవిత ఖైదు విధించవచ్చు. ప్రత్యేక సందర్భాల్లో ఈ శిక్షను మరో పదేళ్లకు పెంచవచ్చు. జరిమానా కూడా విధించొచ్చు’’ అని ఉంది. అయితే.. ఈ నిబంధనను పూర్తిగా ఎత్తివేయాలని న్యాయ కమిషన్ సిఫారసు చేసింది. కానీ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ.. 2013లో హోమోసెక్సువాలిటీ క్రిమినల్ నేరమేనని ఓ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పుడు అదే సుప్రీంకోర్టు ఈ నెల 10న ఇందుకు సంబంధించిన కీలకమైన కేసును విచారించనుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కుల హక్కులకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం తీర్పు కీలకంగా మారనుంది.
ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక చోట్ల పరువు హత్యల ఘటనలు ఆందోళనకరంగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి 2011లోనే అప్పటి జస్టిస్ ఏపీ షా నేతృత్వంలోని న్యాయకమిషన్ పలు సిఫారసులు చేసింది. మతాంతర, కులాంతర వివాహాలను ఉద్దేశపూర్వకంగా అడ్డగించేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలను రూపొందించాలని కమిషన్ సిఫారసు చేసింది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే వ్యక్తులకు కలెక్టర్లు లేదా జిల్లా మేజిస్ట్రేట్ల ఆధ్వర్యంలో రక్షణ కల్పించాలని, కుల పంచాయతీలు లేదా ఖాప్ పంచాయతీలు నిర్వహించకుండా అడ్డుకునే అధికారాలు ఇవ్వాలని సూచించింది. కానీ ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. ఇద్దరు ప్రౌఢ (మేజర్) వ్యక్తులు సంప్రదాయాలకు భిన్నంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఈ విషయంలో ఎవరి జోక్యం కూడదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తో కూడిన ధర్మాసనం కూడా ఓ కేసులో స్పష్టం చేసింది. అయినా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎన్నికల కమిషన్‌లో సభ్యుల తొలగింపు, ఉరిశిక్షను తొలగించాలని కూడా గతంలో న్యాయ కమిషన్ సూచించింది. వీటిపై కేంద్రంలో ఎలాంటి కదలిక లేదు.
పె అంశాలను పరిశీలించినప్పుడు.. బెట్టింగ్, గ్యాంబ్లిగ్‌ను చట్టబద్దం చేయాలనే న్యాయ కమిషన్ సిఫారసును కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందా? అనే మీమాంస ఉత్పన్నమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని చట్టబద్దం చేసేందుకు కేంద్రం సుముఖత చూపకపోవచ్చునని విశ్లేషిస్తున్నారు. ఇది నైతికతకు సంబంధించిన అంశమైనందున కేంద్రం సాహనం చేయకపోవచ్చునని కూడా అంటున్నారు. వాస్తవానికి బిహార్, ఒడిషా క్రికెట్ సంఘాలకు, బీసీసీఐకి మధ్య సాగుతున్న ఓ వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడం సాధ్యమా అన్న అంశంపై పరిశీలన జరపాలని చేసిన ఆదేశాల మేరకు కమిటీ ఈ నివేదిక రూపొందించింది. విద్యార్థులు, నిపుణులు, ప్రముఖుల, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న మీదట బెట్టింగ్‌ను నిషేధించడం కన్నా నియంత్రించడం మేలన్న తుది నిర్ణయానికి వచ్చింది. ‘‘నైపుణ్యం గల క్రీడ అన్నపేరుతో గుర్రప్పందాల మీద బెట్టింగ్‌కు అనుమతిస్తున్నారు. ఇలాగే నైపుణ్యం గల క్రీడలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ గ్యాంబ్లింగ్-నిషేధ చట్ట పరిధి నుంచి తప్పించి చట్టబద్ధత కల్పించవచ్చు’’ అని కమిషన్ సూచించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో మార్పులు చేసి కేసినోలను, ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమలను భారత్‌కు రప్పించవచ్చు అని కూడా సిఫార్సు చేసింది.
Post a Comment