బీజేపీలో జోష్

బీజేపీలో జోష్
జన చైతన్య యాత్రతో బీజేపీకి ఊపొచ్చింది. కార్యకర్తల్లో ఉత్సాహం నిండింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆధ్యర్యంలో 14 రోజుల పాటు కొనసాగిన యాత్ర సందర్భంగా కార్యకర్తలతో మంతనాలు, స్థానిక రాజకీయ నేతలతో భేటీలు, బహిరంగ సభలతో పార్టీలో కదలిక వచ్చింది. నిన్నమొన్నటి దాకా ప్రకటనలకే పరమితమైందనుకున్న పార్టీ ఇప్పుడు ప్రజలకు కూడా దగ్గరవుతుండటం పార్టీ శ్రేణులకు సంతోషం కలిగిస్తోంది. ఇతర పార్టీల్లోని కొందరు బీజేపీలో చేరడంతో పోటీ చేసే అభ్యర్థులపై చర్చలు కూడా కొనసాగుతున్నాయి. దీనితో అన్ని పార్టీల మాదిరిగానే ఎన్నికల పయనం ప్రారంభమైందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

అధిష్ఠానం దర్శకత్వంలో జన చైతన్య యాత్ర జూన్23న భువనగిరిలో ప్రారంభమై జులై  6, శుక్రవారం తుంగతుర్తి సభతో ముగిసింది. రాష్ట్రంలోని 14 పార్లమెంట్, 26 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పర్యటన కొనసాగింది. యాత్రతో నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరినట్లే కనిపిస్తోందని, సిటీ పార్టీ అనే ముద్ర తుడిచిపెట్టే ప్రయత్నం సఫలమైందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా అమిత్ షా రాష్ట్ర పర్యటన అనంతరం రెండో విడత యాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 

మరింత దూకుడుగా.. 

తొలి విడత జన చైతన్య యాత్ర కమలం పార్టీలో జోష్ నింపిందనే చెప్పవచ్చు. ప్రతీ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి, ప్రజలను రప్పించారు. దీని బాధ్యతలు ఆయా నియోజకవర్గ సీటు ఆశించే వ్యక్తులు దగ్గరుండి మరీ చూసుకున్నారు. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నించేందుకు భారీ ర్యాలీలు నిర్వహించారు. కేంద్రమంత్రులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలను ఉత్తేజపరిచే ప్రసంగాలు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల కోలాహలం కనిపించింది. అయితే గతంలో బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు మొత్తం హైదరాబాద్ నగరం నుంచే ఉండేవారు. దీంతో జిల్లాలలో అది నగర పార్టీ అనే ముద్ర ఉండేది. దీంతో ప్రజలు ఆ పార్టీవైపు ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ప్రస్తుత యాత్రతో క్షేత్ర స్థాయిలో జనాలు, యువత మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.  గతంలో బీజేపీకి ఇంత ఆదరణ లేదని, యాత్రతో క్షేత్రస్థాయిలో మంచి ఊపు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కాగా యాత్ర మొదలైన రోజు నుంచే బీజేపీ నేతలు అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శనాస్త్రాలకు పదును పెట్టారు. ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ టీఆర్‌ఎస్‌పై దూకుడు పెంచారు. అంతేకాకుండా కేంద్రం నుంచి పార్టీ పెద్దలు, కేంద్రమంత్రులు కూడా గులాబీ పార్టీపై ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు వచ్చే నిధులు తదితర అంశాలపై వివరించే ప్రయత్నం చేశారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. అటు కాంగ్రెస్‌తోపాటు, హిందూ భావజాలం ఉన్న వ్యక్తుల ఆకట్టుకునేందుకు మజ్లీస్‌పై కూడా విమర్శలు గుప్పించారు. 

నువ్వెంతంటే.. నువ్వెంత..

జనచైతన్య యాత్ర సందర్భంగా వివిధ పార్టీల నేతలు మాటల తూటాలను పేల్చారు. యాత్రలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై లక్ష్మణ్ చేస్తున్న ఆరోపణలకు ఆయా పార్టీ నేతలు సైతం ఘాటుగానే స్పందించారు. యాత్ర ప్రారంభసమయంలోనే సీఎం కేసీఆర్ స్పందిస్తూ ‘వారి ఆరోపణలకు మేమెందుకు స్పందిస్తాం. అసలు తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉంది’ అని తేలికగా తీసిపారేశారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్ నేతలు కర్నె ప్రభాకర్, వినోద్ తీవ్ర స్థాయిలో కమలం పార్టీ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. నువ్వెంతటే, నువ్వెంతన్న స్థాయిలో విమర్శలు చేసుకుకున్నారు. అదే విధంగా పీసీసీ అధ్యక్షుడు సైతం బీజేపీపై మండిపడ్డారు. 

పొత్తు, ముందస్తు అంతేనా..!

ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును గమనిస్తే త్వరలోనే ముందుస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపించింది. బీజేపీ యాత్ర కూడా అంతస్థాయిలో జరిగింది. అయితే కమల దళపతి లక్ష్మణ్ మాత్రం ముందస్తు ఎన్నికలకు సంబంధించి తమకు కేంద్ర అధినాయకత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని, ముందస్తు వచ్చినా మేం సిద్ధమేనని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో టీఆర్‌ఎస్, బీజేపీ పొత్తు ఉంటుందని వస్తున్న ఊహాగానాలకు కూడా తెర పడినట్లేనని పలువురు అంటున్నారు. బీజేపీ నేతల విమర్శల తీరు, టీఆర్‌ఎస్ కమలం పార్టీపై విరుచుకుపడటాన్ని చూస్తుంటే పొత్తు లేదనే సంకేతాలు కన్పిస్తున్నాయి. 

కేంద్ర మంత్రుల పొగడ్తలతో తలనొప్పి..

ఇంత వరకు బాగానే ఉన్నా బీజేపీకి కేంద్ర మంత్రుల తీరు తలనొప్పిగా మారింది. గతంలో కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను ప్రశంసించేవారు. దీంతో స్థానికంగా టీఆర్‌ఎస్‌ను విమర్శించే బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో టీఆర్‌ఎస్ నేతలు కూడా దీన్ని క్యాష్ చేసుకునేవారు. ఇదే విషయమై రాష్ట్ర బీజేపీ కేంద్ర అధినాయకత్వానికి మొరపెట్టుకోగా, కొన్నాళ్లుగా పొగడ్తల కార్యక్రమం నిలిచిపోయింది. అయితే ఒక వైపు రాష్ట్రంలో బీజేపీ జనచైతన్య యాత్ర చేస్తుంటే.. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మెదక్‌కు వచ్చి మిషన్ భగీరథను పొగుడుతూ కితాబిచ్చారు. దీంతో బీజేపీ ఇరకాటంలో పడిందని పలువురు అంటున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post